ముంబయి : పోక్సో చట్టం కింద షేర్డ్ ఆటోలో ప్రయాణించడాన్ని ‘పనిప్రదేశం’గా గుర్తించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ‘అంతర్గత ఫిర్యాదుల కమిటీ’ (ఐసిసి) నిర్ణయాన్ని హైకోర్టు జూన్ 22 నాటి ఉత్తర్వుల్లో రద్దు చేసింది. ఉద్యోగి పనికి వెళ్లేందుకు వినియోగించే షేర్డ్ ఆటోను యజమాని/సంస్థ స్వయంగా కల్పించి ఉంటే తప్ప, పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం, పరిష్కారం) చట్టం, 2013 (పోక్సో) పరిధిలో పనిప్రదేశంగా పరిగణించలేమని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది.
2023 మార్చి 24 నుండి ఎస్‌బిఐ ఉద్యోగి (పిటిషనర్) బ్యాంక్‌కు షేర్డ్ ఆటోలో వెళ్తున్నారు. 3వ ప్రతివాది కూడా అదే ఆటోలో ప్రయాణిస్తున్నారు. వాహనంలో జనం ఎక్కువగా ఉండటం వలనే 3వ ప్రతివాదితో శారీరక స్పర్శ జరిగిందని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే 3వ ప్రతివాది ఆ స్పర్శను ఉద్దేశ్యపూర్వకమైనదిగా భావించడంతో వాగ్వివాదానికి దిగారని, ఆమె తనపై పెప్పర్ స్ప్రే చేసి, పోలీసులకు సమాచారం అందించారని పేర్కొన్నారు. పోలీసులు పిటిషనర్‌ని అదుపులోకి తీసుకుని, ఐపిసి, 1860లోని సెక్షన్ 354-ఎ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మూడవ ప్రతివాది కూడా పోక్సో చట్టం కింద ఐసిసికి ఫిర్యాదు చేశారు. పిటిషనర్ దోషి అని నిర్థారించిన ఐసిసి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. ఈ ఉత్తర్వుపై పిటిషనర్ అప్పీల్ దాఖలు చేశారు. కోర్టు అనుమతి లేకుండా ఈ అప్పీల్‌లో ఎటువంటి తుది ఉత్తర్వు జారీ చేయకూడదని కోర్టు గతంలోనే ఆదేశించింది.
పోక్సో చట్టంలోని సెక్షన్ 2(o) ప్రకారం ఆ ఘటన 'పని ప్రదేశం' పరిధిలోకి వస్తుందా లేదా అని జస్టిస్ ఫిర్దోష్ పి. పూనివాలా, జస్టిస్ సుమన్ శ్యామ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పరిశీలించింది. పిటిషనర్ తన కార్యాలయానికి వెళ్తున్నారని కోర్టు గుర్తించింది. అయితే, ఆ రవాణా సదుపాయాన్ని అతని యజమాని గానీ లేదా 3వ ప్రతివాది యజమాని గానీ సమకూర్చలేదు. అటువంటి రవాణా విధానం పోక్సో చట్టంలోని సెక్షన్ 2(o)(v) ప్రకారం 'పని ప్రదేశం' నిర్వచనం పరిధిలోకి రాదని కోర్టు పేర్కొంది. ఆ ఘటన పనిప్రదేశంలో జరగలేదని ధర్మాసనం నిర్థారించింది. ఆరోపిత వేధింపులు పనిప్రదేశంలో జరగనట్లయితే, ఐసిసి ఫిర్యాదును స్వీకరించలేదని పేర్కొంది. ఫలితంగా, 3వ ప్రతివాది ఫిర్యాదును స్వీకరించే అధికార పరిధి ఐసిసికి లేదని, ఐసిసి జారీ చేసిన ఉత్తర్వులు జారీ చేయలేదని, దానిని రద్దు చేసింది.
పిటిషనర్ 3వ ప్రతివాదిని లైంగికంగా వేధించారా లేదా అనే అంశంపై తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంపై తగిన విచారణ ప్రక్రియలో నిర్ణయం తీసుకునే అవకాశం అలాగే ఉందని పేర్కొంది. ఆ ఘటన పనిప్రదేశంలోకి వస్తుందా లేదా అనే విషయాన్ని ఐసిసి ముందుగా నిర్థారించుకోవాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ తీర్పు సిద్దేష్ ప్రదీప్ సత్పుతే వర్సెస్ ఎస్‌బిఐ కేసులో ఈ ఏడాది జూన్ 16న తీర్పు వెలువడింది.









కామెంట్‌లు (0)