మంగళవారం, 07 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

జోరు వర్షంలోనూ సిజెపి ఆందోళన

3 గంటల క్రితం

cjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 01:11 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- సంయుక్త కిసాన్‌ ‌మోర్చా సంఘీభావం

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : నీట్ ప‌రీక్ష ప‌త్రం లీక్‌, సిబిఎస్ఇ అవ‌క‌త‌వ‌క‌లకు బాధ్య‌తగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఢిల్లీలోని జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద సాగిస్తున్న ఆందోళన మంగళవారం కూడా కొనసాగింది. జోరు వర్షం కురుస్తున్నా..యువతరం పోరాట పటిమతో తమ నిరసన తెలియజేశారు. కాగా సిజెపి ఆందోళనలకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) నాయకులు సంఘీభావం తెలిపారు. నిరాహార దీక్ష చేస్తున్న ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త‌ సోనమ్ వాంగ్‌చుక్‌ను పరామర్శించి ఆయన పోరాటస్ఫూర్తిని అభినందించారు. ఎస్‌కెఎం నేత‌లు హన్న‌న్‌ మొల్లా, పి కృష్ణప్రసాద్, పుష్పేంద్ర త్యాగి, రాజన్ క్షీర సాగర్, దలీజీత్ సింగ్ దాగర్, పురుషోత్తం శర్మ, మనీష్ భారతి, రాజ్ బాల యాదవ్, శశికాంత్, అర్జున్ ప్రసాద్ సింగ్, విమల్ త్రివేది, కుల్దీప్ సింగ్, చరణ్ సింగ్, అనురాగ్ చౌహాన్, దల్జీత్ సింగ్ తదితరులు సిజెపి దీక్షా శిబిరాన్ని సంద‌ర్శించారు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు చర్యలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత సాగిస్తున్న ఈ పోరాటానికి దేశంలోని రైతులందరి త‌ర‌పున త‌మ పూర్తి మ‌ద్ద‌తుతో అండగా నిలుస్తామని ఈ సందర్భంగా ఎస్‌కెఎం నేతలు ప్రకటించారు.

జంతర్ మంతర్ వద్ద జూన్ 20న ప్రారంభమైన సిజెపి ఆందోళ‌న‌ మంగళవారంతో 18 రోజులు పూర్తి చేసుకుంది. వాంగ్‌చుక్‌తో పాటు విద్యార్థులు చేపట్టిన నిరాహార దీక్ష ప‌ది రోజులు పూర్తి చేసుకుంది. మంగ‌ళ‌వారం జోరు వ‌ర్షంలో ఆందోళ‌న కొన‌సాగింది. వంద‌లాది మంది విద్యార్థులు, యువ‌త జోరువ‌ర్షంలో కూడా తమ ఆందోళ‌న‌ను కొన‌సాగించారు. మండుటెండైనా, కుండపోత వర్షమైనా సరే ఈ ఉద్యమం వెనక్కి తగ్గదని, పైగా మరింత ఉత్సాహాన్ని పుంజుకుంటుందని చెప్పడానికి ఇదే నిదర్శనమంటూ సిజెపి నేత‌లు పేర్కొన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కచ్చితమైన చర్యలు తీసుకునే వరకు ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ఈ ఉద్యమం ఏదో ఒకే సంస్థకు సంబంధించిన ఆందోళనల చుట్టూ కాకుండా, విద్య, ప్రజాస్వామ్య హక్కుల చుట్టూ కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు. విద్యా రంగానికి సంబంధించిన పలు కీలక సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను తీవ్రంగా పరిగణించి, జవాబుదారీతనం కల్పించే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘‘మా నిరాహార దీక్షను ఎంతకాలం కొనసాగించాలనే దానిపై గడువు లేదు. ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసి, మరింత ముందుకు తీసుకెళ్లడమే దీని ఉద్దేశ్యం. ప్రధాన్ రాజీనామా చేసే వరకు మేము కొనసాగిస్తాము” అని నేహా అన్నారు. తొలుత ఆరుగురు విద్యార్థులు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారని, అయితే వారిలో ఒకరు అనారోగ్యానికి గురవడంతో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్