- ఇప్పటికే 32 డిగ్రీలు సొంతం
- విద్యాభ్యాసంలో స్ఫూర్తినిస్తున్న మిల్ఖిరామ్
హమీర్‌పూర్ : సాధించాలనే తపన ఉంటే వయస్సు అనేది అడ్డేమీ కాదని హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 75 ఏళ్ల మిల్ఖిరామ్ నిరూపిస్తున్నారు. ఇప్పటికే 32 విద్యాపరమైన డిగ్రీలు సాధించిన మిల్ఖిరామ్ తాజాగా మరో డిగ్రీ కోసం పరీక్షకు హాజరయ్యారు. జూన్ 30న హమీర్‌పూర్‌లోని ఇగ్నో స్టడీ సెంటర్‌లో సంస్కృత పరీక్షకు హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. ఇగ్నోలో అందించే ఈ ‘ఎంఎ సంస్కృతం' కోర్సు 'ఆచార్య' డిగ్రీకి సమానమైనదిగా గుర్తింపు పొందింది. ఈ కేంద్రంలో పరీక్ష రాసిన వారిలో రామ్ అత్యంత పెద్ద వయస్కులు. 75 ఏళ్ల వయస్సులో ఎక్కువ మంది విశ్రాంతి తీసుకొవడానికి ప్రాధాన్యత ఇస్తారని, కానీ రామ్ పరీక్షకు హాజరుకావడం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిని, ప్రేరణను కలిగించింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన రామ్ 1952 ఫిబ్రవరి 10న జన్మించారు. ఇరవై ఏళ్ల వయస్సులోనే అంటే 1972లో అటవీ శాఖలో చేరారు. అయితే చదువును విడిచిపెట్టలేదు. 1976లో ధర్మశాలలోని ఒక ప్రైవేట్ కళాశాల నుండి ముందుగా బ్యాచిలర్ డిగ్రీని పొందారు. 2010లో గ్రేడ్-1 అధికారిగా పదవీ విరమణ చేసే సమయానికి 26 డిగ్రీలను సాధించారు, ప్రస్తుతం ఆ సంఖ్య 32కి చేరింది. డిగ్రీల జాబితాలో బిఇడి, ప్రభాకర్, ఎల్‌ఎల్‌బి, జర్నలిజం (జెఎంసి), బిఎ (సంస్కృతం), ఎంఎ (హిందీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, హిస్టరీ, ఇంగ్లీష్, ఎకనామిక్స్), ఎంబిఎ, ఎంఫిల్, హిందీలో పిహెచ్‌డి వంటివి ఉన్నాయి. ‘యువత విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఎందుకంటే జ్ఞానం అనేది ఎవరూ దొంగలించలేని సంపద. సమాజ, వ్యక్తిగత వికాసానికి విద్య అత్యంత శక్తివంతమైన సాధనం’ అని రామ్ తెలిపారు. తన చదువు, పరీక్షల సన్నద్ధతకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకునేందుకు తాను ఇటీవల కంటి చికిత్స చేయించుకున్నానని ఆయన తెలిపారు. అలాగే, ఈ సుదీర్ఘ విద్యా ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచినందుకు తన భార్య విద్యా దేవికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.







కామెంట్‌లు (0)