మంగళవారం, 07 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ 22న దేశవ్యాప్త రైతుల ప్రతిజ్ఞ దినం

3 గంటల క్రితం

skm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 01:12 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- అదే రోజు ట్రంప్‌, మోడీ దిష్టిబొమ్మ‌ల ద‌గ్ధం

- సంయుక్త కిసాన్‌ ‌మోర్చా పిలుపు

- ఎఫ్‌టిఎకు వ్య‌తిరేకంగా సుదీర్ఘ పోరాటం

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : అమెరికాతో భారత ప్రభుత్వం చేసుకోనున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) దేశ వ్యవసాయ రంగాన్ని పెను సంక్షోభంలోకి నెట్టేస్తుందని సంయుక్త కిసాన్‌ ‌మోర్చా (ఎస్‌‌కెఎం) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న అన్నదాతలకు వ్యతిరేకంగా కార్పొరేట్‌ ‌సంస్థల ప్రయోజనాల కోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమెరికాతో ఎఫ్‌‌టిఎ ఒప్పందానికి తహతహలాడుతోందని విమర్శించింది. రైతన్నలకు వినాశకరమైన భారత్ - అమెరికా ఎఫ్‌‌టిఎను వ్యతిరేకిస్తూ ఈ నెల 22న దేశవ్యాప్తంగా రైతుల ప్రతిజ్ఞ దినం పాటించాలని ఎస్‌‌కెఎం పిలుపునిచ్చింది. అదే రోజున అమెరికా అధ్యక్షులు డొనాల్డ్‌ ‌ట్రంప్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన తెలియజేయాలని కోరింది. ఈ మేరకు ఎస్‌కెఎం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్-అమెరికా ఎఫ్‌టిఎపై సంతకం చేస్తే, 2020-21 నాటి చారిత్రాత్మక రైతు పోరాటం తరహాలోనే, అన్ని ఎఫ్‌టిఎలను రద్దు చేసే వరకు దేశవ్యాప్తంగా భారీ, నిరంతర పోరాటాలను చేస్తామ‌ని హెచ్చ‌రించింది. చిన్న స్థాయి ఉత్పత్తిదారులను నాశనం చేసే, దేశీయ మార్కెట్‌ను ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాల దోపిడీకి గురిచేసే భారత్-అమెరికా ఎఫ్‌టిఎపై సంతకం చేయవద్దని ప్రధాని నరేంద్ర మోడీని ఆదేశించాల్సిందిగా కోరుతూ ప్రతి గ్రామం నుండి రైతుల సంతకాలతో కూడిన లేఖను రాష్ట్రపతికి పంపుతారని పేర్కొంది. బిజెపి-ఎన్‌డిఎ ఎంపిల కార్యాలయాల ముందు భారీ ప్రదర్శనలు నిర్వహిస్తామ‌ని తెలిపింది. సబ్-డివిజన్ స్థాయిలో రైతులు నిరసన ప్రదర్శనలు, మూడు గంటల పాటు భారీ ధర్నా నిర్వహిస్తామ‌ని పేర్కొంది. జిల్లా కేంద్రాలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోడీల దిష్టిబొమ్మలను దహనం చేస్తామ‌ని, టోల్ ప్లాజా వద్ద నిరసన కార్యక్రమం మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు కొనసాగుతుంద‌ని తెలిపింది. దేశ ప్రజల స్వయం సమృద్ధిని, సార్వభౌమాధికారాన్ని నాశనం చేసే ప్రపంచ కార్పొరేట్ సంస్థలు, అమెరికా సామ్రాజ్యవాద శక్తుల ఆదేశాలకు తలొగ్గడం మానుకోవాలని అధికార బిజెపి-ఆర్ఎస్ఎస్ కూటమి నాయకత్వాన్ని ఎస్‌కెఎం గట్టిగా హెచ్చరిస్తోంది. అలాగే, పార్లమెంటు, శాసనసభలలో ఎఫ్‌టిఎలను గట్టిగా వ్యతిరేకించాలని, కొనసాగుతున్న తీవ్రమైన వ్యవసాయ సంక్షోభాన్ని, రైతులు, కూలీల ఆత్మహత్యలను అరికట్టే విధానాలను కేంద్ర ప్రభుత్వం అమ‌లు చేసేలా డిమాండ్ చేయాలని ఎస్‌కెఎం అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తోంది. అలాగే, అన్ని పంటల సేకరణతో కూడిన ఎంఎస్‌పి సి2+50 శాతం హామీనిచ్చే చట్టాలను, సమగ్ర రుణ మాఫీని అమలు చేయాలని డిమాండ్ చేసింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్