న్యూఢిల్లీ : టెలిగ్రామ్ యాప్ పై నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. నీట్, యుజి పున: పరీక్ష నిర్వహణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జూన్ 22 వరకు టెలిగ్రామ్ యాప్ ను నిలిపివేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది.
చట్టవిరుద్ధమైన, అనుమానిత చానల్స్ ను అడ్డుకునేలా టెలిగ్రామ్ తగిన ముందస్తు చర్యలు చేపట్టలేదని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. అనుమానాస్పద చానెళ్లపై నిఘా ఉంచడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్రం టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ ను పదేపదే కోరిందని, కానీ ఆ సంస్థ స్పందించలేదని కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం ఆరోపించారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ టెలిగ్రామ్ కోర్టును ఆశ్రయించింది. ఈ ఉత్తర్వులపై హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన మరుసటి రోజు విచారణ చేపట్టడం గమనార్హం.
టెలిగ్రామ్ యాప్ లో అధికశాతం చానల్స్ బాట్స్ (సాఫ్ట్ వేర్ అప్లికేషన్ ) ప్లాట్ ఫామ్ పై పనిచేస్తున్నాయని అన్నారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (14సి) ప్రకారం.. టెలిగ్రామ్ లో ఒక ఖాతాపై సుమారు 40 బాట్స్ ను రూపొందించవచ్చని, కానీ వాట్సప్ లో కేవలం యూజర్ కి ఒక్క బాట్ మాత్రమే ఉంటుందని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ఇతర యాప్ లతో పోలిస్తే.. ప్రస్తుత పరిస్థితులను ఈ యాప్ సమర్థవంతంగా ఎదుర్కొనలేదని అన్నారు. క్లౌడ్ ఆధారంగా ఈ యాప్ పనిచేస్తుందని, దీంతో నేరాలకు పాల్పడిన వారిని గుర్తించడం కష్టమని పేర్కొన్నారు. టెలిగ్రామ్ యాప్ ఇతర దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన చర్యలను ఎదుర్కొంది. ఇతర దేశాలు కూడా చర్యలు తీసుకున్నాయని అన్నారు. చర్యలు తీసుకున్న దేశాల జాబితాను కోర్టుకు సమర్పించామని ఆయన వెల్లడించారు.









కామెంట్‌లు (0)