ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నిరంతరం ‘జలధార-జలహారతి’

16 గంటల క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 11:48 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- తాగునీటికి ముందస్తు ప్రణాళికలు

- సమీక్షలో సిఎం చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నిరంతర కార్యక్రమంగా ‘జలధార - జలహారతి’ చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావం అంచనాలకు మించి ఉన్నందున నీటి వనరుల పరిరక్షణ, తాగునీటి సరఫరా, పంటల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ‘జలధార - జలహరతి’పై శనివారం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 82,865 పనులను గుర్తించగా.. 79,826 పనులు పూర్తి చేసినట్టు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. మొత్తం రూ.3,409.35 కోట్ల పనులు మంజూరు చేసినట్లు సిఎం తెలిపారు. చెరువులు, ఫీడర్‌ ఛానళ్లు, ఫార్మ్‌ పాండ్లు, ట్రెంచ్‌ల తవ్వకం వంటి పనులను చేపట్టినట్టు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఎల్‌నినో తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతుందని అంచనాలు ఉన్నాయని, తద్వారా వర్షపాతం సాధారణం కంటే 39 శాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. జూన్‌ – డిసెంబర్‌ మధ్య సాధారణ వర్షపాతం 867 మిల్లీమీటర్ల మేర నమోదవుతుందని, ప్రస్తుతం 525 మిల్లీమీటర్లు మాత్రమే నమోదవుతుందన్న అంచనాలు వస్తున్నాయని తెలిపారు. ఆగస్టులో 56 శాతం మేర లోటు వర్షపాతం ఉండే ప్రమాదం ఉందన్నారు. రిజర్వాయర్ల నీటి నిల్వలపైనా ఎల్‌నినో ప్రభావం కనిపిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ బేసిన్లలో ప్రస్తుతం 563.05 టిఎంసిల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని, గతేడాది ఇదే సమయానికి 825.67 టిఎంసిల నీరు నిల్వ ఉన్నట్లు వివరించారు. భూగర్భజల మట్టాలు మరింత పడిపోయే అవకాశం ఉందని, తాగునీటి నిల్వలు, సరఫరాపై పక్కాగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. వెలుగోడు, గోరకల్లు, అవుకు, జీడిపల్లి, చెర్లోపల్లి తదితర రిజర్వాయర్లలో తాగునీటి అవసరాల కోసం నీటిని నిల్వ చేయాలని సూచించారు. నాగార్జునసాగర్‌ కాలువల ద్వారా వివిధ జిల్లాల తాగునీటి అవసరాలకు నీటి కేటాయింపులను సిద్ధం చేసుకోవాలన్నారు.

వరద నీటిని సమర్ధవంతంగా వినియోగించండి

ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదని, ప్రాజెక్టుల్లోకి వస్తున్న నీటిని సమర్థంగా వినియోగించుకుని రిజర్వాయర్‌లను వీలైనంత మేర నింపాలని సిఎం సూచించారు. తాగునీటి వసతి పూర్తిస్థాయిలో అందుబాటులో లేని ప్రాంతాలను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవసరమైన ప్రాంతాలకు నీటిని సరఫరా చేసేందుకు ట్యాంకర్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. సాగులో ఉన్న పంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. భవిష్యత్‌లో తక్కువ నీటి వినియోగంతో సాగు చేసే పంటలను ప్రోత్సహించాలని సూచించారు. నీటి లభ్యత తగ్గిన పరిస్థితుల్లోనూ పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

పరివాహక ప్రాంతాల అనుసంధానం

వర్షాభావ పరిస్థితుల కారణంగా పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సిఎం ఆదేశించారు. అవసరమైన చోట్ల గోకులాలను సిద్ధం చేయాలని సూచించారు. పశుసంపదకు ఇబ్బంది తలెత్తకుండా జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. నీటి లభ్యత లేని చెరువులు, కాల్వలను గుర్తించి నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు నీరు ఉన్న ప్రాంతాల నుంచి నీటి కొరత ఉన్న ప్రాంతాలకు చిన్నచిన్న నీటి పరివాహక ప్రాంతాల అనుసంధాన అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈ సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్‌, వ్యవసాయ, పంచాయతీరాజ్‌శాఖల ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్