ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సముద్ర ప్రాంతాన్ని విధ్వంసం చేయొద్దు

1 గంట క్రితం

cpm.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 01:52 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • రేర్ ఎర్త్ మినరల్స్‌ కోసం తవ్వకాలు ఆపాలి:సిపిఎం

ప్రజాశక్తి-టెక్కలి రూరల్‌: సముద్ర తీర ప్రాంతాన్ని ‘రేర్ ఎర్త్ మినరల్స్‌’ పేరుతో అదానీ సంస్థకు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యులు నంబూరు షణ్ముఖరావు అన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో మండల కన్వీనర్‌ కొల్లి ఎల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.

శ్రీకాకుళం జిల్లా సముద్ర తీర ప్రాంతంలో గార్నైట్‌, ఇల్మెనైట్‌, జిర్కాన్‌, టైటానియం తదితర రేర్ ఎర్త్ మినరల్స్‌ కోసం తవ్వకాలు చేపడితే జిల్లాకు తీవ్ర ప్రమాదం ఏర్పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తీర ప్రాంతాన్ని తవ్వి వివిధ రకాల ఇసుకను తరలించడం వల్ల అదానీ సంస్థకు వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, అదే సమయంలో శ్రీకాకుళం జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకార కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటుందని, మత్స్యకార గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు పెనుముప్పు ఏర్పడుతుందని అన్నారు. తీర ప్రాంతంలో భారీగా తవ్వకాలు జరపడం వల్ల ఉప్పునీరు పంట పొలాల్లోకి చేరి రైతాంగానికి తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని తెలిపారు. తుఫాన్లు, సునామీలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో తీర ప్రాంతంలోని మట్టి బలహీనపడటం వల్ల సముద్రం మరింత ముందుకు చొచ్చుకువచ్చే ప్రమాదం ఉందని, ఇది పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. పెట్టుబడుల పేరుతో ప్రభుత్వం గొప్పలు చెబుతున్నప్పటికీ, ప్రజలకు కలిగే నష్టం, పర్యావరణ విధ్వంసం గురించి ఎందుకు చెప్పడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును వారు ప్రశ్నించారు. తీర ప్రాంతాన్ని అదానీ సంస్థకు అప్పగించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. టెక్కలి, సంతబొమ్మాళి మండలాల్లోని 27 పంచాయతీల పరిధిలో పారిశ్రామిక కారిడార్‌ పేరుతో సుమారు 38 వేల ఎకరాల భూములను రైతుల నుంచి బలవంతంగా సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఎం నాయకులు విమర్శించారు. తరతరాలుగా ఈ భూములపై ఆధారపడి జీవిస్తున్న వేలాది రైతు కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.

ప్రజల భూములను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగిస్తే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం బలవంతపు భూసేకరణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ను పూర్తిచేస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినా వాటిని ఎందుకు అమలు చేయలేదని మంత్రి అచ్చెన్నాయుడును ప్రశ్నించారు. కాలువల చివరి భూముల వరకు సాగునీరు అందిస్తే రెండు పంటలు పండించి వేలాది రైతు కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని అన్నారు. పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. బలవంతపు భూసేకరణకు పాల్పడితే ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్