న్యూఢిల్లీ : పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడి పది రోజులు గడిచినా, వర్షాకాల సమావేశాలు ఇంకా అధికారికంగా ముగియలేదు. దీంతో, కొత్త సమావేశాలను ఏర్పాటు చేయకుండానే ప్రభుత్వం ఒక కీలకమైన చట్టాన్ని ఆమోదించాలనుకుంటోందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. లోక్‌సభ మరియు రాజ్యసభ రెండూ ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడ్డాయి. సాధారణంగా, ఆ తర్వాత మూడు లేదా నాలుగు రోజుల్లోనే సమావేశాలు అధికారికంగా ముగిసినట్లు (ప్రొరోగ్) ప్రకటిస్తారు. అయితే, ఆదివారం ఉదయం వరకు వర్షాకాల సమావేశాల ముగింపునకు సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా జారీ కాలేదు. బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 18న ముగియగా, ఏప్రిల్ 20న సభ వాయిదా (ప్రోరోగ్) పడింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, ప్రభుత్వం చేసే సిఫార్సు మేరకు రాష్ట్రపతి సమావేశాలను ఏర్పాటు చేయడం మరియు వాయిదా వేయడం (ప్రోరోగ్ చేయడం) జరుగుతుంది.
2029 పార్లమెంటరీ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ చట్టం అమలును ఖరారు చేసేందుకు, ఆ చట్టాన్ని సవరించే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టవచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. గతంలో బడ్జెట్ సమావేశాల సమయంలో బిజెపి ప్రభుత్వానికి అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో విఫలమైంది. జనాభా ఆధారిత నియోజకవర్గాల పునర్విభజన వల్ల లోక్‌సభలో తమ బలం తగ్గుతుందని ప్రతిపక్షాలు ముఖ్యంగా, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం కోరే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అమిత్ షా వ్యూహమే కారణమా : జైరాం రమేష్
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడి పది రోజులు గడిచినా అధికారికంగా ముగించకపోవడంపై కాంగ్రెస్ తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రత్యేక సమావేశంలో ఆమోదించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికీ అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ కోసం ప్రయత్నిస్తున్నారా అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ప్రశ్నించారు. లోక్‌సభ, రాజ్యసభలు ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడ్డాయి. సాధారణంగా నిరవధిక వాయిదా (అడ్జర్న్‌మెంట్ సైన్ డై)కు, సమావేశాలను అధికారికంగా ముగించే ప్రొరోగేషన్‌కు మధ్య రెండు నుంచి నాలుగు రోజుల వ్యవధి ఉంటుందని జైరాం రమేష్ పేర్కొన్నారు. అయితే పది రోజులు గడిచినా ప్రొరోగేషన్‌పై ఎలాంటి సమాచారం లేకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో ఈ రెండు ప్రక్రియలు ఒకే రోజున కూడా జరిగినట్లు తెలిపారు.
2015 వర్షాకాల సమావేశాల తర్వాత ప్రొరోగేషన్‌కు 28 రోజులు, 2021లో 20 రోజులు పట్టిన విషయాన్ని జైరాం రమేష్ అంగీకరించారు. అయితే అప్పట్లో ఇటువంటి ‘దుర్మార్గపు ఎత్తుగడలు’ ఏవీ లేవని వ్యాఖ్యానించారు. “ఇప్పుడు ఈ అసాధారణ జాప్యానికి కారణమేంటి? ప్రత్యేక సమావేశంలో డీలిమిటేషన్‌పై రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించేందుకు అమిత్ షా మూడింట రెండొంతుల మెజారిటీ కోసం ఇంకా ప్రయత్నిస్తున్నారా?” అని ప్రశ్నించారు.
డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల ఆందోళన
ఆగస్టు 21న మహాబలిపురంలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ డీలిమిటేషన్ అంశాన్ని ప్రస్తావించారు. జనాభా నియంత్రణలో సాధించిన విజయానికి శిక్షగా ఏ రాష్ట్రం పార్లమెంటులో తన ప్రాతినిధ్య శాతాన్ని కోల్పోకుండా కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన చట్టపరమైన హామీ ఇవ్వాలని ఆయన కోరారు. దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశానికి హాజరైన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ ప్రస్తుత లోక్‌సభ స్థానాల సంఖ్య 543నే రాబోయే 25 ఏళ్లపాటు కొనసాగించాలని కేంద్రాన్ని కోరారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల ప్రొరోగేషన్‌లో జాప్యం, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ చట్టం అంశాలు పరస్పరం ముడిపడి ఉన్నాయా అనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.







కామెంట్‌లు (0)