- గిద్దలూరు వేదికగా శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రజాశక్తి- గిద్దలూరు (మార్కాపురం జిల్లా) : రాష్ట్ర ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్య భద్రత కల్పించి, ‘హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్’గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ‘సంజీవని’ పథకాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్యుడి ఆరోగ్య రక్షణకు వాడుకోవాలనే సంకల్పంతో సంజీవని పథకానికి రూపకల్పన చేశామని వివరించారు. నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికీ త్వరితగతిన ‘ఆభా’ ఐడీలను నమోదు చేసి, డిజిటల్ సంజీవని హెల్త్ కార్డులను అందజేస్తామన్నారు. కృష్ణంశెట్టిపల్లి పిహెచ్‌సిని అన్ని రకాల ఆధునిక మౌలిక వసతులు, సాంకేతిక సదుపాయాలతో ఒక ఆదర్శవంతమైన మోడల్ ఆరోగ్య కేంద్రంగా తీర్చిదిద్దామని, రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహా వైద్య సేవలను విస్తరిస్తామని ప్రకటించారు. భవిష్యత్తు తరాల కోసమే విజన్ 2047 కూటమి ప్రభుత్వం కేవలం వర్తమానం గురించే కాకుండా భవిష్యత్తు తరాల ఉజ్వల భవితను దృష్టిలో ఉంచుకుని పనిచేస్తోందని ముఖ్యమంత్రి అన్నారు.‘విజన్ 2047’ మహోన్నత లక్ష్యంతో వికసిత భారతం - సమృద్ధి ఆంధ్రప్రదేశ్‌ను సాధిస్తామని పునరుద్ఘాటించారు. యువతకు అపారమైన ఉపాధి అవకాశాలు, రైతులకు సాగునీటి భరోసా, మహిళలకు సంపూర్ణ సాధికారత కల్పిస్తూ.. సమాజంలో ప్రతి ఒక్కరూ సుసంపన్నమైన, సంతోషకరమైన జీవితాన్ని గడిపేలా ప్రణాళికలు సిద్ధం చేసి వేగంగా అడుగులు చేస్తాన్నామన్నారు. కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలా వీరాంజనేయ స్వామి, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)