- వైసిపి రాజధాని యాత్రను అడ్డుకున్న టిడిపి శ్రేణులు
- రాళ్లు, కోడిగుడ్లతో దాడి
- హెడ్ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు
- టిడిపి వర్సెస్ వైసిపి
ప్రజాశక్తి-తాడేపల్లి (గుంటూరు జిల్లా) : సిఆర్‌డిఎ రైతు పరిరక్షణ సమితి పేరిటి వైసిపి నేతలు రాజధాని గ్రామాల్లో శనివారం నిర్వహించ తలపెట్టిన పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఉండవల్లి గ్రామంలో ఈ పర్యటనను టిడిపి శ్రేణులు అడ్డుకున్నాయి. వైసిపి నేతలు, వారి వాహనాలను లక్ష్యంగా చేసుకుని రాళ్లు, కోడిగుడ్లతో దాడికి దిగాయి. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ టి.చిన్న తంబి కు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలంలో సొమ్మసిలి పడిపోయిన ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. పలువురు వైసిపి కార్యకర్తలూ గాయాల పాలయ్యారు. అమరావతి రైతుల సమస్యల పరిష్కారం-భూముల పరిశీలన కోసమంటూ వైసిపి నాయకులు ఈ పర్యటనను చేపట్టారు. వైసిపి ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, మాజీ మంత్రులు పేర్నినాని, అంబటి రాంబాబు. పార్టీ నాయకులు డైమండ్‌బాబు, దేవినేని అవినాష్, దొంతి రెడ్డి వేమారెడ్డి తదితరులు ఈ కార్య్రకమంలో పాల్గొన్నారు. తాడేపల్లి నుంచి ప్రారంభమైన నాయకులు ఉండవల్లి సెంటర్ వద్దకు చేరగానే టిడిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. రాజధాని పనులు వైసిపి వల్లనే గందరగోళంగా మారాయని, ఆ పార్టీ నాయకులకు రాజధాని గ్రామాల్లో పర్యటించే హక్కు లేదంటూ నల్లజెండాలు ప్రదర్శించారు. గో బ్యాక్ వైసిపి, రాజధానిలో మీకేం పని, మావిగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అమరావతిలో మీకేం పని.. ఐదేళ్లు నాశనం చేసి ఇప్పుడు రైతులకు ఏదో చేస్తున్నట్టు వస్తారా? అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనల మధ్యనే వైసిపి నేతల కాన్వాయ్ కొంత ముందుకు సాయిబాబా గుడి వద్దకు వెళ్లింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైసిపి టిడిడి కార్యకర్తలు రాళ్లు, కోడిగుడ్లతో దాడికి దిగారు. రాళ్లు తాకడంతో బందోబస్తు కోసం వచ్చిన చిత్తూరు జిల్లాకు చెందిన హెడ్ కానిస్టేబుల్ టి.చిన్న తంబి (పిసి 1787) రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వెంటనే అతన్ని పోలీసులు మణిపాల్ హాస్పిటల్ కి తరలించారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కారు ధ్వంసమైంది. కారులో ఉన్న వైసిపి నాయకులు, కార్యకర్తలు , కిందకు దిగడంతో టిడిపి కార్యకర్తలు రెచ్చిపోయారు. ముందుకు కదలనియమంటూ నినాదాలు చేశారు. ప్రతిగా వైసిపి నాయకులు ముందుకు వెళ్లాల్సిందేనంటూ పట్టు పట్టారు. సుమారు గంటపాటు అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాడేపల్లి సిఐ వీరేంద్రబాబు ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను సర్ది చెప్పి వెనక్కు పంపించడానికి ప్రయత్నించారు. అయినా టిడిపి శ్రేణులు వెనక్కి తగ్గలేదు. వైసిపి బృందం ముందుకెళ్లటానికి వీలులేదంటూ పట్టుపట్టారు. తాడేపల్లి, పెనుమాక నుండి టిడిపి శ్రేణులు తరలి వచ్చాయి. సుమారు గంటన్నర పైగా సాగిన ఘర్షణ వాతావరణం ఉండవల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. టిడిపి నిరసన కార్యక్రమానికి ఆ పార్టీ మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ఎం సత్యనారాయణ, దాసరి కృష్ణ, ఆర్ కిరణ్, హరికృష్ణ, జి బసి విరెడ్డి, ఇట్ట పెంచలయ్య, ఇట్ట భాస్కరరావు, సాంబశివరావు తదితరులు నాయకత్వం వహించారు. ఇదిలా ఉండగా తమపై వైసిపి నాయకులే దాడి చేశారని మాణిక్యం అనే మహిళ తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సిఐ వీరేంద్రబాబు కేసు విచారిస్తున్నారు.








కామెంట్‌లు (0)