- సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ విమర్శ
- మోడీ ప్రభుత్వ హయాంలో హద్దేలేని అవినీతి
- జులై 11-13 తేదీల్లో కేంద్ర కమిటీ సమావేశం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలను బలహీనపర్చేందుకు వివిధ రూపాల్లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధానకార్యదర్శి ఎంఎ బేబీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వ ఎన్‌డిఎ ప్రభుత్వ హాయంలో వివిధ రంగాల్లో అవినీతి హద్దేలేకుండా పెరిగిపోయిందని విమర్శించారు. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించేందుకు ఇక్కడి ఎకెజి భవన్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ఎంఎ బేబీ మీడియాతో మాట్లాడారు. దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితులు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించేందుకు కేంద్ర కమిటీ ప్రత్యేక సమావేశం వచ్చే జులై నెల 11 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక సమావేశంలో పరిశీలించాల్సిన ఎన్నికల సమీక్షా నివేదిక సహా మూడు పత్రాలకు పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపిందన్నారు. “ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను సమీక్షించిన పార్టీ.. పశ్చిమ బెంగాల్‌లో బిజెపి అధికారంలోకి రావడం, కేరళలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ ఎల్‌డిఎఫ్‌కు ఎదురుదెబ్బ తగలడం, తమిళనాడులో కొత్త రాజకీయ పరిస్థితులు ఏర్పడడం వంటి అంశాలను చర్చించాం. ఆదివాసీ ప్రాంతాల్లో పార్టీ విస్తరణ, దిద్దుబాటు ప్రక్రియకు సంబంధించిన అంశాలపై నివేదికలను సమావేశం ఆమోదించింది’ అని తెలిపారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇతర రాజకీయ పార్టీలను చీల్చి తమ పార్లమెంటరీ బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తోందని ఆయన విమర్శించారు. రాజకీయ పార్టీలను నయానోభయానో కూడగట్టుకోవడం, విలీనం చేసుకోవడం, పూర్తిగా స్వాధీనం చేసుకోవడం వంటి దుర్మార్గ విధానాలతో ప్రతిపక్షాలను బలహీనపరుస్తోందన్నారు. రాజ్యాంగ
విరుద్ధంగా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తుంగలో తొక్కి మోడీ సర్కార్ ఈ దారుణానికి ఒడిగడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం సాగిస్తున్న ఈ వినాశకర చర్యలపై దేశవ్యాప్తంగా రాజకీయ ప్రచారం నిర్వహించడంతో పాటు ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు జరుపనున్నామని తెలిపారు. అలాగే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ హయాంలో అవినీతి హద్దులేకుండా పెరిగిపోతోందని ఎంఎ బేబీ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖకు చెందిన ఒక మంత్రి రాయితీ పేరుతో సుమారు రూ.కోటి మొత్తాన్ని కాజేశారన్న వార్తలు దీనికి నిదర్శనమన్నారు. అలాగే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి భూ కుంభకోణం కూడా బిజెపి అవినీతి తీవ్రతకు అద్దం పడుతోందని చెప్పారు. ఆఖరుకు అయోధ్య రామమందిర విరాళాల్లోనూ కుంభకోణం చోటుచేసుకోవడం చూస్తున్నామని, ఈ అక్రమాల్లో అసలు సూత్రధారులపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు. బాధ్యులందరిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)