mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనా పరిస్థితి ఇలావుంటే ఇక సామాన్యుల గతేంటి?

2 గంటల క్రితం

sir
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 01:21 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- ఓటు హక్కు పోతే అన్నీ పోయినట్టే

- పాస్‌‌పోర్టుకు తప్పని తిప్పలు

- ప్రఖ్యాత జర్నలిస్టు ఆర్‌‌ రాజగోపాల్‌ ఆందోళన

కొల్‌‌కతా : ‌దేశంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ‌ప్రక్రియపై పశ్చిమబెంగాల్‌‌కు చెందిన ప్రఖ్యాత జర్నలిస్టు, 'ది టెలిగ్రాఫ్' మాజీ సంపాదకులు ఆర్‌ ‌రాజగోపాల్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాలో పేరు కోల్పోతే అన్నీ కోల్పోయినట్టే అని ఆయన అంటున్నారు. ఎస్‌ఐఆర్‌ ‌ప్రక్రియతో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంటూ తన పరిస్థితి ఇలావుంటే ఇక సామాన్యుల గతేంటి? అని ఆయన నిలదీశారు. బెంగాల్‌‌లో తన ఓటరు గుర్తింపు కార్డును ఎలా కోల్పోయారో, తదనంతరం తన పాస్‌పోర్ట్‌ను పునరుద్ధరించుకోలేకపోయారో వివరించారు. నిర్లక్ష్యపూరిత వ్యవస్థ కోరల్లో చిక్కుకున్న అణగారిన తరగతుల దుస్థితి ఇంకెంతటి దయనీయంగా మారుంతోనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన మాటల్లోనే...‘ఈ సంవత్సరం మార్చిలో, కోల్‌కతాలోని బల్లిగంజ్ నియోజకవర్గ ఓటర్ల జాబితా నుండి నా పేరును తొలగించారు. 2002 ఓటర్ల జాబితాలో నా పేరు గానీ, చనిపోయిన నా తండ్రి పేరు గానీ లేకపోవడమే తొలగించడానికి కారణమని చెప్పారు. గాంధేయవాది, విశ్రాంత ప్రొఫెసర్, కేరళలోని గాంధీ స్మారక్ నిధి మాజీ రాష్ట్ర కార్యదర్శి అయిన నా తండ్రి 2016లో కన్నుమూశారు. ఆయన వంటి బాధ్యతాయుతమైన ఓటరు పేరు జాబితాలో ఎలా లేకుండా పోయిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. పశ్చిమ బెంగాల్‌లోని దాదాపు 27 లక్షల మంది ఇతర నివాసితుల మాదిరిగానే, టెక్నికల్‌ ‌సాకులతో నన్ను కూడా మినహాయించారు. నేను నా మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత కూడా లాభం లేకుండా పోయింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్‌లలో ఒకదాని ముందు నా అప్పీల్ ఇప్పుడు పెండింగ్‌లో ఉంది. పర్యవసానంగా, నేను ఇటీవలి ఎన్నికలలో ఓటు వేయలేకపోయాను. నా పాస్‌పోర్ట్ పునరుద్ధరణ దరఖాస్తు అనుభవం మరింత బాధాకరంగా ఉంది. నేను మార్చి 19, 2026న బయోమెట్రిక్ లాంఛనాలను పూర్తి చేసినప్పటికీ, ఓటర్ల జాబితాలో నా పేరు ఇకపై కనిపించకపోవడంతో పోలీసు ధృవీకరణ ఇంకా ఆమోదం పొందలేదు. అనేక ప్రత్యామ్నాయ పత్రాలు సమర్పించినప్పటికీ, అవి సరిపోవని చెబుతున్నారు. వాస్తవానికి, పాస్‌పోర్ట్ పునరుద్ధరణ కోసం నా బయోమెట్రిక్స్ తీసుకున్నప్పటి నుండి నేటికి (జూన్ 27, 2026) 100 రోజులు. ఓటర్ల జాబితా నుండి నా పేరును తొలగించారని పేర్కొంటూ, కోల్‌కతా పోలీసులు ప్రతికూల నివేదిక పంపారని గత వారం పాస్‌పోర్ట్ జారీ చేసే అధికారి నాకు అధికారికంగా తెలియజేశారు. కోల్‌కతాలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం ముందు "వెంటనే" హాజరు కావాలని నన్ను కోరారు, కానీ నేను అపాయింట్‌మెంట్ కోరినప్పుడు జులై 17న రావాలన్నారు.’ అని ఆయన తన బాధను పంచుకున్నారు. తనలాంటివారికే ఈ పరిస్థితి ఉంటే ఇక పేదలు, సామాన్య ప్రజలు, గిరిజనులు, ఇతర అణగారిన తరగతుల దుస్థితి ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే అనేక రాష్ర్టాల్లో ఓటరు జాబితాతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ముడివేసి లబ్ధిదారులను కుదించివేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌ఐఆర్‌ ‌ప్రక్రియ ఎంతటి భయానక పరిస్థితుల్లోకి నెట్టేస్తోందో జర్నలిస్టు రాజగోపాల్‌ ఉదంతం ఒక ఉదాహరణ మాత్రమే.

ఎస్‌ఐఆర్‌‌తో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన : ఎంఎ బేబీ

‘ద టెలిగ్రాఫ్‌’ ‌మాజీ సంపాదకులు రాజగోపాల్‌‌కు ఎదురైన ఇబ్బందులపై సిపిఎం ప్రధానకార్యదర్శి ఎంఎ బేబీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా మారుతోందన్నారు. ఇది పౌరుల రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి తన విభజన రాజకీయాలు, హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి 'ఎస్‌ఐఆర్‌'ను ఒక సాధనంగా వాడుకుంటోందని ఆయన విమర్శించారు. ఎస్‌ఐఆర్‌ పేద, బలహీన తరగతుల ప్రజల ఓటు హక్కును హరిస్తుందని సిపిఎం మొదటి నుంచీ హెచ్చరిస్తూనే ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు, ప్రముఖ సంపాదకుడు, ప్రశంసలు పొందిన జర్నలిస్ట్ ఆర్. రాజగోపాల్ కూడా ఓటు హక్కును కోల్పోవడం ఈ ప్రక్రియ ఎంత ప్రమాదకరమో తెలియజేస్తోందని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నవారు దేశ పౌరుల జీవితాలతో, హక్కులతో ఆడుకుంటున్న క్రూర పరిహాసానికి ఇది అద్దం పడుతోందని ఎంఎ బేబీ అన్నారు. ఈ చర్యలను ఇక ఏమాత్రం అనుమతించరాదని, ప్రజాస్వామ్య ప్రియులు, పౌర హక్కులను గౌరవించేవారు, ఎస్‌ఐఆర్‌‌ను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష పార్టీలు నిరసన చేపట్టాలని, గణతంత్రాన్ని తిరిగి పొందాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్