ప్రజాశక్తి-పొదిలి: గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ పొదిలిలో పొగాకు రైతులు సోమవారం వేలాన్ని బహిష్కరించి రోడ్డెక్కారు. నంద్యాల–ఒంగోలు రాష్ట్ర రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. తాము పండించిన పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు విఫలమయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించి పొగాకు కొనుగోలు చేపట్టాలని, లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాజకీయ నాయకులు, వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఒంగోలు నుంచి మార్కాపురం వెళ్తున్న జిల్లా ఎస్పీ వాహనాన్ని అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నించగా, స్థానిక పోలీసులు వారిని అడ్డుకుని ఎస్పీ వాహనానికి మార్గం సుగమం చేశారు. సోమవారం నిర్వహించిన క్లస్టర్ వేలంలో మార్కాపురం జిల్లా కంభం మండలం జంగంగుంట్లతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని రాస్తారోకో నిర్వహించారు.








కామెంట్‌లు (0)