ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది.తీవ్ర ఉత్కంఠ భరితంగా సాగిన ప్రిక్వార్టర్స్ పోరులో ఇంగ్లాండ్3-2గోల్స్ తేడాతో ఆతిథ్య మెక్సికోపై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.ఈమ్యాచ్36వ నిమిషంలో జూడ్ బెల్లింగ్‌హామ్ అద్భుత హెడర్‌తో ఇంగ్లాండ్‌కు తొలి గోల్ అందించాడు.ఆ తర్వాత కేవలం98సెకన్ల వ్యవధిలోనే(38వ నిమిషంలో)కెప్టెన్ హ్యారీ కేన్ సహకారంతో బెల్లింగ్‌హామ్ మరో గోల్ చేసి జట్టుకు2-0ఆధిక్యాన్ని ఇచ్చాడు. 42వ నిమిషంలో మెక్సికో ఆటగాడు జూలియన్ క్వినోనెస్ ఒక గోల్ చేయడంతో మొదటి భాగం ముగిసేసరికి స్కోరు2-1గా మారింది.
రెండో భాగంలో ఇంగ్లాండ్ డిఫెండర్ జారెల్ క్వాన్సా రెడ్ కార్డ్ రావడంతో మైదానం వీడాడు.దీంతో ఇంగ్లాండ్ 10మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది.అయినప్పటికీ పట్టుదలగా పోరాడిన ఇంగ్లాండ్‌కు లభించిన పెనాల్టీని కెప్టెన్ హ్యారీ కేన్ గోల్‌గా మలిచి 3-1ఆధిక్యాన్ని అందించాడు.ఈ గోల్‌తో కేన్ ప్రపంచకప్‌లలో అత్యధిక గోల్స్ (14)చేసిన ఆటగాళ్ల జాబితాలో జర్మనీ దిగ్గజం గెర్డ్ ముల్లర్ సరసన చేరాడు.ఆ తర్వాత మెక్సికో ఆటగాడు రౌల్ జిమెనెజ్ పెనాల్టీ ద్వారా మరో గోల్ చేయడంతో మ్యాచ్ 3-2కు చేరింది.చివరి నిమిషాల్లో మెక్సికో గోల్ కోసం ప్రయత్నం చేసినా ఇంగ్లాండ్ గోల్ కీపర్ జోర్డాన్ పిక్‌ఫోర్డ్ సమర్థవంతంగా అడ్డుకోవడంతో ఇంగ్లాండ్ విజయం ఖాయమైంది.మయామిలో జరగబోయే క్వార్టర్ ఫైనల్లో నార్వేతో ఇంగ్లాండ్ తలపడనుంది.








కామెంట్‌లు (0)