ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : పంచ గ్రామాల భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు డిమాండ్ చేశారు. పంచ గ్రామాల భూ సమస్యకు శాశ్వత పరిష్కారం కోరుతూ .... సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం చలో విశాఖ జిల్లా కలెక్టర్ పేరుతో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జగ్గు నాయుడు మీడియాతో మాట్లాడుతూ .... పంచ గ్రామాలలో చట్టబద్దమైన భూ యజమానుల హక్కులను పరిరక్షించాలన్నారు. సర్వే నెం. 275లో నివాసం ఉంటున్న కుటుంబాలకు పట్టాలు మంజూరు చేయాలని, అలాగే క్రయ విక్రయాలు, నిర్మాణాలకు అనుమతులు కల్పించాలన్నారు. పంచ గ్రామాల భూ సమస్య కారణంగా వేలాది కుటుంబాలు ఎన్నో సంవత్సరాలుగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ పత్రాలతో భూములు కొనుగోలు చేసిన భూ యజమానులు, అలాగే సర్వే నెం. 275లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న కుటుంబాలు తమ భూ హక్కులు, జీవన భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభుత్వమే రిజిస్ట్రేషన్లు నిర్వహించి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేసినప్పటికీ ప్రస్తుతం ప్రజలు తమ ఆస్తులపై హక్కులను వినియోగించుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. మరోవైపు,సర్వే నెం. 275లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న అనేక కుటుంబాలకు ఇప్పటికీ పట్టాలు మంజూరు కాకపోవడంతో వారి జీవన భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. పంచ గ్రామాల్లో చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ పత్రాలు కలిగిన భూ యజమానుల హక్కులను రెవెన్యూ రికార్డుల ఆధారంగా గుర్తించి పరిరక్షించాలని, చట్టబద్ధమైన పత్రాలు కలిగిన భూ యజమానులకు ఎలాంటి అన్యాయం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పంచ గ్రామాల భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి ప్రజల్లో నెలకొన్న అనిశ్చితికి ముగింపు పలకాలన్నారు. సమస్య పరిష్కారం జరిగే వరకు చట్టబద్ధమైన భూ యజమానులకు క్రయవిక్రయాలు, భవన నిర్మాణాలు, బ్యాంకు రుణాలు తదితర ప్రక్రియలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుమతులు కల్పించాలన్నారు. కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత పంచ గ్రామాల భూ సమస్యపై సిపిఎం చేపట్టిన నిరసన కార్యక్రమం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తతలకు దారి తీసింది. పార్టీ తరపున వినతి పత్రం సమర్పించడానికి కొందరు నాయకులను అనుమతించిన పోలీసులు, బాధిత ప్రజలు వ్యక్తిగతంగా ఎవరికి వారు వినతి పత్రాలు సమర్పించడానికి లోపలికి పోలీసులు అనుమతించలేదు. ప్రవేశ ద్వారాలను మూసివేసి లబ్ధిదారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జగ్గు నాయుడు మాట్లాడుతూ .... పంచ గ్రామాల ప్రజలు సమర్పిస్తున్న వ్యక్తిగత వినతిపత్రాలను ప్రత్యేకంగా పరిశీలించి, ప్రతి అర్హుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పిజిఆర్ఎస్ లో ఎవరైనా వ్యక్తిగతంగా వినతిపత్రాలు సమర్పించవచ్చు అన్నారు. అటువంటప్పుడు అడ్డుకోవడం భావ్యం కాదన్నారు. ఈ కార్యక్రమంలో గోపాలపట్నం సిపిఎం జోన్ కమిటీ కార్యదర్శి బి. జగన్,నాయకులు బి.వెంకటరావు,బి. రమణి,లబ్ధిదారులు కొల్లి అప్పలనాయుడు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
పంచ గ్రామాల భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి : ఎం.జగ్గునాయుడు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 06, 2026, 12:20 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)