బీసెంట్ రోడ్ (విజయవాడ) : బీసెంట్ రోడ్డులో హాకర్లను తొలగిస్తే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం అని సిఐటియు హెచ్చరించింది. బీసెంట్ రోడ్డులో హాకర్లపై వేధింపులు వెంటనే ఆపాలని విజయవాడ హాకర్స్ & తోపుడుబండ్లు యూనియన్ (సిఐటియు) డిమాండ్ చేసింది. బీసెంట్ రోడ్‌లో దశాబ్దాలుగా జీవనోపాధి పొందుతున్న హాకర్లను గుర్తింపు కార్డులు లేవనే పేరుతో తొలగించేందుకు టౌన్ ప్లానింగ్ అధికారులు చేస్తున్న చర్యలను నిరసిస్తూ ... సోమవారం విజయవాడ హాకర్స్ & తోపుడుబండ్లు యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో హాకర్లు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కార్యదర్శి ఎం. సోమేశ్వరరావు, హాకర్స్ యూనియన్ నగర అధ్యక్షులు భూలోకం మాట్లాడుతూ .... ️బీసెంట్ రోడ్డులో హాకర్ల జీవనోపాధిపై జరుగుతున్న దాడులను వారు తీవ్రంగా ఖండించారు. హాకర్లను తొలగించే ప్రయత్నాలు వెంటనే నిలిపివేయాలనీ డిమాండ్ చేశారు. బీసెంట్ రోడ్‌లో గత 30 సంవత్సరాలకు పైగా వేలాది మంది హాకర్లు తమ కుటుంబాల జీవనోపాధి కోసం చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, ఇలాంటి వారిని ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా బలవంతంగా తొలగించడం అమానుషమన్నారు. హాకర్ల జీవనోపాధిని దెబ్బతీసే విధంగా మున్సిపల్ , టౌన్ ప్లానింగ్ అధికారులు వ్యవహరించడం తగదని అన్నారు. గుర్తింపు కార్డులు ఇవ్వకుండా హాకర్ల ను వేధించడం దుర్మార్గమన్నారు. హాకర్లు అనేకసార్లు గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, అధికారులు ఉద్దేశపూర్వకంగా వాటిని జారీ చేయలేదని ఆరోపించారు. గుర్తింపు కార్డులు ఇవ్వకుండా, అదే కారణాన్ని చూపిస్తూ హాకర్లను తొలగించే ప్రయత్నం చేయడం అధికారుల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే చర్య అని విమర్శించారు. హాకర్ల నుంచి డబ్బులు వసూలు చేసి రసీదులు ఇవ్వలేదు. గుర్తింపు కార్డుల పేరుతో హాకర్ల నుంచి రూ.200 చొప్పున వసూలు చేసినప్పటికీ, ఇప్పటివరకు వారికి రసీదులు గానీ, గుర్తింపు కార్డులు గానీ ఇవ్వలేదని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీధి విక్రయదారుల చట్టం–2014ను అమలు చేయాలన్నారు. భారత పార్లమెంట్ ఆమోదించిన వీధి విక్రయదారుల (జీవనోపాధి రక్షణ వీధి విక్రయాల నియంత్రణ) చట్టం–2014 ప్రకారం హాకర్లకు చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయని పేర్కొన్నారు. ️టౌన్ వెండింగ్ కమిటీ నిర్ణయాలు, సర్వేలు, గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ పూర్తి చేయకుండా హాకర్లను తొలగించడం పూర్తిగా చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. బీసెంట్ రోడ్ గ్రీన్ జోన్‌లో ఉందనీ అన్నారు.దశాబ్దాలుగా అక్కడే జీవనోపాధి పొందుతున్న కుటుంబాల పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించడం సామాజిక న్యాయానికి విరుద్ధమని అన్నారు. కక్షపూరిత వైఖరి మానుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసెంట్ రోడ్ హాకర్లపై కక్షపూరిత చర్యలు పెరిగాయని నాయకులు ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో కొందరు అధికారులు పనిచేస్తున్నారని, దీనివల్ల సాధారణ పేద హాకర్ల కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయని తెలిపారు. హాకర్ల జీవనోపాధిపై దాడి చేస్తే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని ప్రకటించారు. బీసెంట్ రోడ్‌లో ఒక్క హాకర్‌ను కూడా బలవంతంగా తొలగించడానికి ప్రయత్నిస్తే, విజయవాడ నగరవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ️అవసరమైతే మున్సిపల్ కార్యాలయం ముట్టడి, ధర్నాలు, రాస్తారోకోలు, నిరవధిక ఆందోళనలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. టౌన్ వెండింగ్ కమిటీ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించి, హాకర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసారు. ️పెండింగ్‌లో ఉన్న గుర్తింపు కార్డులను వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని అన్ని హాకర్లకు చట్టబద్ధ రక్షణ కల్పించాలని కోరారు.ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ కమిషనర్, ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకొని బీసెంట్ రోడ్ హాకర్లపై జరుగుతున్న వేధింపులను ఆపాలని, వారి జీవనోపాధిని రక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి ఎం. సోమేశ్వరరావు, విజయవాడ హాకర్స్ & తోపుడుబండ్లు యూనియన్ (సిఐటియు) నగర అధ్యక్షులు భూలోకం, ఆర్గనైజింగ్ కార్యదర్శి బి. లక్ష్మణ్, కోశాధికారి ఉదయకుమార్, ఉపాధ్యక్షులు మస్తాన్, లక్ష్మి, గోవింద్, సూరమ్మ, యూనియన్ నాయకులు శ్రీను, పిడుగు శ్రీను, ప్రసాద్, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
బీసెంట్ రోడ్డులో హాకర్లను తొలగిస్తే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం : సిఐటియు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 06, 2026, 04:03 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)