సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

'ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలని చూస్తే ... తెలుగు ప్రజలు సహించరు` : వి.శ్రీనివాసరావు

1 గంట క్రితం

'ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలని చూస్తే ... తెలుగు ప్రజలు సహించరు` : వి.శ్రీనివాసరావు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 03:58 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

విజయవాడ : 'ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలని చూస్తే ... తెలుగు ప్రజలు సహించరు` అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో శ్రీనివాసరావు మాట్లాడుతూ .... పవన్ కల్యాణ్ ను యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ విమర్శించాడని కేసులు పెట్టి ఒకటి కాకుండా ఏకంగా నాలుగైదు కేసుల్లో రాష్ట్రమంతా తిప్పి అన్నిచోట్లా బెయిల్ వచ్చిన తరువాత ఆఖరికి నిన్న గన్నవరంలో అతనిపై ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఉపా కేసు పెట్టారని అన్నారు. రాజద్రోహం కింద, దేశ సమగ్రతకు, ఐక్యతకు భంగం కలిగిస్తున్నాడనే నెపాన్ని నెట్టి ఇప్పుడు నాన్ బెయిలబుల్ కేసు అంటూ .. రిమాండుకి పంపారని తెలిపారు. ఒక యూట్యూబర్ పై ఉగ్రవాద నిరోధక చట్టాన్ని ప్రయోగించడమేంటి ? అని ప్రశ్నించారు. ఒక సభలో ఉపన్యాసం చేస్తే, యూట్యూబ్ లోనో, సోషల్ మీడియాలోనో ఒక కామెంట్ చేస్తే ఉగ్రవాదులైపోతారా ? అని నిలదీశారు. పోలీస్ స్టేషన్లపై దాడి చేయడం, పోలీస్ స్టేషన్ల గోడలను దూకి పోవడం, పోలీసుల చొక్కాలు పట్టుకోవడం వీటినేమంటారు ? అని ప్రశ్నించారు. ఏది ఉగ్రవాదం-ఏది ప్రమాదం ? అని నిలదీశారు. ఎవరినైనా ఎవరైనా విమర్శించినప్పుడు ఆ మాటల్లో ఏమైనా అభ్యంతరకర పదాలొచ్చినా, ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడినా... వాళ్లు రిక్వస్టు కేసులు సివిల్స్ వేస్తారని తెలిపారు. కానీ ఇప్పుడు క్రిమినల్ కేసులను పెట్టి ఆ కేసుల తరపున పోలీసులు, ప్రభుత్వమే రంగంలోకి దిగి నడపడమనేది అరుదైన విషయమన్నారు. ప్రశ్న రావణ్ ను ఎక్కడికి తీసుకెళితే అక్కడికి జనసేన, ఆర్ఎస్ఎస్ వాళ్లు పోవడం, పోలీస్ స్టేషన్లలో దూకడం, పోలీసులను నెట్టేయడం... ఈ చర్యలన్నీ ఏమిటి ? వీటినేమంటారు ? అని ప్రశ్నించారు. ఏది ఉగ్రవాదం ? అని అడిగారు. కేవలం ఒకరి గురించి కాదు... రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలపై, ప్రజా ఉద్యమాలపై, ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు వీరంతా కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తున్నదని విమర్శించారు. తెలుగు ప్రజలకు ఉద్యమాల్లో పాల్గొన్న చరిత్ర ఉందని గుర్తు చేశారు. ఈ అణచివేతలను తెలుగు ప్రజలు ఏమాత్రం సహించబోరని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యాన్ని, నిరంకుశత్వాన్ని తెలుగు ప్రజలు ఎంతమాత్రం సహించరు అని చెప్పారు. ఈ దురాగతాలన్నిటినీ ఖండించి తెలుగు ప్రజలంతా వామపక్ష పార్టీలకు అండగా నిలబడాలని వి.శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్