mh ad
మంగళవారం, 23 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అణు కేంద్రాల్లోకి యుఎన్‌ నిఘా సంస్థను అనుమతించబోం : ఇరాన్‌

2 గంటల క్రితం

Foreign Ministry spokesman Esmaeil Baqaei
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 23, 2026, 03:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

టెహ్రాన్‌ : బాంబు దాడికి గురైన అణు కేంద్రాల్లోకి ఐక్యరాజ్యసమితి (యుఎన్‌) నిఘా సంస్థలను అనుమతించబోమని ఇరాన్‌ స్పష్టం చేసింది. గతేడాది అమెరికా, ఇజ్రాయిల్‌ సైనిక దురాక్రమణలో బాంబు దాడులకు గురైన తమ అణు కేంద్రాల్లోకి యుఎన్‌ అణు పర్యవేక్ష‍క సంస్థ పరిశీలకులను అనుమతించబోమని ఇరాన్‌ విదేశాంగ శాఖ మంగళవారం ప్రకటించింది. తాము యుఎన్‌ అణుశక్తి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌తో సమావేశం కాలేదని, సైనిక దురాక్రమణలో దెబ్బతిన్న ఇరాన్‌ అణు కేంద్రాలను ఆ సంస్థ తనిఖీ చేసేందుకు ఎటువంటి ప్రణాళికలు లేవని విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్‌ బఖాయి మీడియాకు వెల్లడించారు. ఈ విషయంలో ప్రాథమికంగా ఎటువంటి ప్రోటోకాల్‌ లేదని అన్నారు. అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందంలో సభ్యునిగా, రక్ష‍ణ ఒప్పందాలకు కట్టుబడి ఉన్న దేశంగా, తాము ప్రస్తుత విధానాన్ని కొనసాగిస్తామని అన్నారు. ప్రస్తుత విధానం చాలా స్పష్టంగా ఉందని తాను భావిస్తున్నానని చెప్పారు. ఇజ్రాయిల్‌, అమెరికాదాడులను ఖండించడంలో విఫలమైన యుఎన్‌ అణు పర్యవేక్ష‍క సంస్థకు ఇరాన్‌ గతేడాది జులైలో సహకారాన్ని నిలిపివేసింది. ఇరు పక్ష‍ాలు ఒక ఒప్పందానికి వచ్చిన అనంతరం సెప్టెంబర్‌లో సహకారాన్ని పున:ప్రారంభించడానికి అంగీకరించింది. కానీఈ ఒప్పందం బాంబు దాడులు జరిగిన ప్రదేశాలకు వర్తించదని తెలిపింది.

అయితే యుఎన్‌ అణు పర్యవేక్ష‍కులను తిరిగి రావడానికి ఇరాన్‌ అనుమతిస్తుందని సోమవారం అమెరికా ఉపాధ్యక్ష‍ుడు జె.డి. వాన్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అని, ఇరాన్‌ను శాశ్వతంగా అణ్వాయుధ రహితం చేసే దిశగా మొదటి అడుగుగా పేర్కొన్నారు. పాకిస్థాన్‌, ఖతార్‌ మధ్యవర్తిత్వంతో స్విట్జర్లాండ్‌లో అమెరికా,ఇరాన్‌ల మధ్య జరిగిన చర్చల అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు.

గతేడాది జూన్‌లో అమెరికా, ఇజ్రాయిల్‌ 12 రోజుల పాటు ఇరాన్‌పై సైనిక దురాక్రమణకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఫోర్డో, నతాంజ్‌, ఇస్ఫహాన్లలోని మూడు అణుకేంద్రాలపై బాంబు దాడులు చేపట్టింది. ఇటీవల యుద్ధంలో నతాంజ్‌ కేంద్రంపై మరోసారి దాడి జరిగిందని ఇరాన్‌ ప్రకటించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్