ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో కేసు నమోదు
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య కేంద్రంగా అక్కడి డబుల్ ఇంజిన్ బిజెపి ప్రభుత్వ పెద్దల అక్రమాలకు, అన్యాయాలకు హద్దేలేకుండా పోతోంది. ఆఖరుకు అయోధ్యలోని బాలరాముడి గుడిలోనూ సంఘ్ పరివార్ దొంగలు పడ్డారంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా దాపురించిందో బోధపడుతుంది. సంఘ్ పరివార్‌లోని గ్రూపులే ఇప్పుడు అయోధ్య రామాలయంలో అక్రమాలు జరిగాయంటూ, విరాళాలు, కానుకలను నిలువునా దోచుకెళ్తున్నారంటూ వాపోతుండటం విశేషం. ఈ విరాళాల అక్రమాలపై తాజాగా అయోధ్యలోని రామ జన్మభూమి పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. రామ మందిర ట్రస్టుకు వచ్చిన విరాళాలు గల్లంతైన విషయంలో నిధుల దుర్వినియోగం, మోసం, నేరపూరితమైన కుట్ర, విశ్వాస ఉల్లంఘన వంటి ఆరోపణలతో 8 మందిపై శ్రీ రామ జర్మభూమి ట్రస్టు సభ్యులు కృష్ణ మోహన్ ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు ఈ కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత(బిఎన్‌ఎస్) లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఈ వ్యవహారంపై రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నియమించగా..అది కంటితుడుపు చర్య అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ కేసులోనైనా తొలుత ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి..ఆ తర్వాత ఆ కేసును సిట్‌కు అప్పగిస్తారని, కానీ ఇక్కడ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా సిట్ అంటూ చేతులు దులిపేసుకున్నారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వ బిజెపి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, సంఘ్ పరివార్‌లోని ఒక గ్రూపు వాపోయారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరగాలని బుధవారం విహెచ్‌పి నేత అలోక్ కుమార్ కోరారు. బాధ్యులైన వారినిక కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దర్యాప్తు ముగిసిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయని, అంతవరకు నిరాధారమైన వ్యాఖ్యలు చేయవద్దని యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోరారు.
సుప్రీంకోర్టులో పిటిషన్
అయోధ్యలోని రామమందిరం విరాళాల గల్లంతు కుంభకోణంపై నిష్పక్షపాతంగా నిర్దిష్ట కాలపరిమితిలో విచారణ జరగాలని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను ఈ నెల 29న ప్రస్తావించాల్సిందిగా సుప్రీం కోర్టు గురువారం సదరు పిటిసనర్‌కు సూచించింది. జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ జోమాల్యా బాగ్చిలతో కూడిన బెంచ్ ముందు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ దీనిపై అత్యవసర విచారణ జరగాలని పిటిషనర్లు కోరారు. న్యాయవాదులు అజయ్ కుమార్ రాయ్, దినేష్ కుమార్ యాదవ్‌లు ఈ పిటిషన్ దాఖలు చేశారు. శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు వ్యవహారాల్లో ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై సిబిఐ నేతృత్వంలో పలు విభాగాలతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరపాలని వారు కోరారు. ట్రస్టుకు సంబంధించిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యమని, దీనిపై సత్వర విచారణ అవసరమని పిటిషనర్ తెలిపారు. పిటిషన్‌లో ఎటువంటి లోపాలు లేకపోయినట్లైతే రిజిస్ట్రీ దాన్ని ప్రాసెస్ చేస్తుందని బెంచ్ పేర్కొంది. తమ పిటిషన్ రిజిస్టర్ అయిందని, అందులో ఎటువంటి లోపాలు లేవని పిటిషనర్లు తతెలిపారు. ప్రజా ప్రయోజనాలను పరిరక్షించేందుకు, కోట్లాదిమంది భక్తులు, దాతల విశ్వాసాన్ని కాపాడేందుకు ఒక రెగ్యులేటరీ, పర్యవేక్షక, ఆడిట్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం వుందని పిటిషన్ పేర్కొంది.
సిట్.. కంటి తుడుపు చర్యే: కేజ్రీవాల్
అయోధ్య రామ మందిర విరాళాల కుంభకోణంపై విచారణ కోసం సిట్ ఏర్పాటు ఒక కంటితుడుపు చర్య అని, దానికి చట్టబద్ధత లేదని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఈ సిట్ అసలు లక్ష్యం, ఉద్దేశ్యం సత్యాన్ని వెలికితీయడం కంటే ఈ కేసులో చిక్కుకున్న పలుకుబడి ఉన్న వ్యక్తులను రక్షించడమేనని తెలిపారు. గురువారం అయోధ్యకు వెళుతూ మార్గమధ్యంలోని లక్నో విమానాశ్రయంలో కేజ్రీవాల్ దిగారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో విలేకరులతో కేజ్రీవాల్ మాట్లాడారు. రామ మందిరానికి విరాళాల రూపంలో అందిన విలువైన వస్తువులు, నగదు చోరీకి గురయ్యాయని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ అనేక వజ్రాలు, విలువైన రాళ్లతో పాటు రూ. 200 కోట్ల రూపాయల నగదు, 200 కిలోల వెండి కూడా చోరీకి గురయ్యాయి’ అని ఆయన తెలిపారు. ఈ వార్తలతో కోట్లాది మంది మనోవేదనకు గురయ్యారని అన్నారు. ‘ అందుకే నేను అయోధ్యకు వెళ్తున్నాను. రేపు నేను రామ మందిరాన్ని సందర్శించి ప్రార్థనలు చేస్తాను, అలాగే హనుమాన్‌గఢిని కూడా సందర్శిస్తాను’ అని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి వెల్లడించారు. కాగా, గురువారం ఉదయం ఆప్ రాజ్యసభ ఎంపి సంజయ్ సింగ్ ఈ సిట్ ముందు హాజరై విరాళాల చోరీకి సంబంధించిన సాక్ష్యాలను సమర్పించారు.








కామెంట్‌లు (0)