సెకన్ల తేడాతో వణికించిన *భారీ భూకంపాలు
వేలాది మంది మృతి?
188 మృత దేహాలు వెలికితీత
కొనసాగుతున్న *సహాయ చర్యలు
సెలవురోజు కావడంతో సేదతీరుతున్న వెనిజులా ప్రజలపై మృత్యురక్కసి ఒక్కసారిగా విరుచుకుపడింది. బుధవారం రాత్రి సెకన్ల వ్యవధిలో సంభవించిన రెండు భీకర భూకంపాలు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. తప్పించుకునే అవకాశం లేక, ఎటు పరుగెత్తాలో తెలియక కుప్పకూలిన శిధిలాల మధ్య లక్షలాది మంది చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య భారీగా ఉంటుందన్న అంచనాలు కలవరం సృష్టిస్తున్నాయి. రాజధాని నగరం కారకస్‌లో ఎటు చూసినా కూలిపోయిన ఇళ్లు , సర్వం కోల్పోయి రోడ్లపైనే విలపిస్తున్న ప్రజానీకం కనిపిస్తున్నారు.
కారకాస్ : వెనిజులా ఉత్తర తీరంలో బుధవారం రాత్రి నిమిషాల వ్యవధిలో రెండు శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. రాజధాని కారకాస్ సహా పలు నగరాల్లో భూమి కంపించడంతో అనేక భవనాలు కుప్పకూలాయి.ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. కరీబియన్ తీర ప్రాంత దేశాలు సునామీ భయంతో వణికిపోయాయి. ఈ భూకంపాల కారణంగా పది వేల నుండి లక్ష వరకూ మృతి చెందే అవకాశం ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. భూకంప తీవ్రతను పరిశీలించిన పలువరు నిపుణులు వేలాదిమంది మరణించే ఉంటరని అంచనా వేస్తున్నారు. అయితే, భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11 గంటల సమయానికి 188 మృతదేహాలను భవనాల శిధిలాల నుండి వెలికి తీసినట్లు వెనిజులా ప్రకటించింది. 970 మందికి పైగా గాయపడ్డవారిని గుర్తించామని వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగజ్ తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు, మారుమూల ప్రాంతాలకు చేరుకునేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. అయితే, సెలవు రోజు కావడం , పైగా రాత్రీ ఒకేసారి సెకన్ల వ్యవధిలో భూమి కంపించడంతో భారీగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఈ విపత్తులో వెనిజులాకు సాయం అందించేందుకు అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే రాజకీయ, ఆర్థిక సంక్షోభాలతో ఇబ్బందులు పడుతున్న వెనిజులాను భూకంపాలు కోలుకోలేని దెబ్బ తీశాయి. అమెరికా జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) నివేదిక ప్రకారం.. మొదట కారకాస్‌కు పశ్చిమాన 160 కిలోమీటర్ల దూరంలోని మొరోన్ సమీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించగా.. సరిగ్గా దాని తరువాత కొన్ని సెకన్లలోనే అదే ప్రాంతంలో 7.5 తీవ్రతతో రెండో భూకంపం కుదిపేసింది. భూ గర్భంలో కేవలం 10 నుంచి 13 కిలోమీటర్ల లోతులోనే ఈ ప్రకంపనలు కేంద్రీకృతం కావడంవల్ల నష్టం తీవ్రత ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలోనే దేశంలోని అతి పెద్ద చమురు రిఫైనరీలు ఉన్నాయి. లాటిన్ అమెరికాలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే వెనిజులాలో పెద్ద భూకంపాలు అరుదుగా సంభవిస్తాయి. అయితే, ఈ రెండు భూకంపాలు గత శతాబ్ద కాలంలో వెనిజులాను అతలాకుతలం చేసిన భారీ భూకంపాలు కావడం గమనార్హం..
సెలవు దినం కావడంతో
వెనిజులాలో బుధవారం సెలవు దినం కావడంతో చాలా మంది ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో కూడా భూప్రకంపనలు సంభవించాయి. సమీపంలోని కొలంబియాలో సైతం భూమి కంపించింది. ఇది భూకంప కేంద్రానికి వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. భూకంపంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఆవాసాలను, పెంపుడు జంతువులను వదిలి వీధులలోకి వచ్చారు. భూకంప దృశ్యాలు 'హారర్ చిత్రాన్ని' తలపించాయని ఓ బాధితుడు వ్యాఖ్యానించాడు. అయితే సునామీ ముప్పేమీ లేదని అధికారులు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో భవనాలు పేకమేడలా కూలిపోయాయి. కోస్తా ప్రాంతంలోని లా గుయారా రాష్ట్రం బాగా దెబ్బతిన్నది. దీనిని విపత్తు జోన్‌గా ప్రకటించామని తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగజ్ తెలిపారు. భూకంప ప్రభావిత ప్రాంతాలలో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టామని ఆమె చెప్పారు. అలాగే ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోకి వెళ్లకుండా బహిరంగ ప్రదేశాల్లోనే ఉండాలని, అంబులెన్సుల రవాణాకు ఆటంకం కలిగించకుండా సహకరించాలని వెనిజులా అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్డాడో కాబెల్లో విజ్ఞప్తి చేశారు. రాజధాని కారకాస్ సహా దేశంలోని పలు ప్రాంతాలలో భవనాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మకుటో నగరంలోని ఓ హోటల్ పూర్తిగా కూలిపోయి శిధిలాలు మాత్రమే కన్పిస్తున్నాయి. కటియా లా మర్ పట్టణంలో భవనాలు, ఆకాశ హర్మ్యాలు మరమ్మతులకు కూడా పనికి రాకుండా పోయాయి. కారకాస్ సమీపంలోని సిమన్ బొలివర్ విమానాశ్రయం దెబ్బతినడంతో దానిని తాత్కాలికంగా మూసివేశారు. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో తరగతులను వారం పాటు నిలిపివేశారు. రైళ్ల రాకపోకలు, అత్యవసరం కాని పనులను కూడా తాత్కాలికంగా రద్దు చేశారు. దేశవ్యాప్తంగా భద్రతా దళాలను మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా కొన్ని భవనాలకు గ్యాస్ సరఫరాను నిలిపివేశారు. వివిధ దేశాలు సహాయ బృందాలను పంపుతున్నాయని రోడ్రిగజ్ తెలిపారు.
వెనెజులాలో..
వెనెజులాలో గతంలో సంభవించిన అత్యంత బలమైన భూకంపాల వివరాలు..
1900వ సంవత్సరం: కారకాస్‌కు తూర్పున 7.6-7.7 తీవ్రత గల భూకంపం నమోదైంది. దక్షిణ అమెరికా దేశంలో నమోదైన అత్యంత బలమైన భూకంపంగా ఇది నిలిచింది.
2018: వెనెజులా ఉత్తర తీరంలో సంభవించిన 7.2 తీవ్రత గల భూకంపం 400 మందికి పైగా మరణాలకు కారణమైంది.
1997: సుక్రే రాష్ట్రంలో 6.9-7.0 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 80 మందికి పైగా మరణించారు.
1967: కారకాస్ సమీపంలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇతర భూకంపాల కంటే ఇది చిన్నదైనప్పటికీ, కనీసం 225 మంది మరణించారు, రాజధానిలో తీవ్ర నష్టం వాటిల్లింది.
భారత్ సహా పలు దేశాల సంఘీభావం
భీకర భూకంపాల నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెనిజులాకు సంఘీభావం తెలిపారు. బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారత ప్రజల తరఫున వెనెజులా ప్రభుత్వానికి, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఈ కష్ట సమయంలో భారత్ అన్ని విధాలా సాయం అందించడానికి సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
అమెరికా, డొమినికన్ రిపబ్లిక్, ఎల్ సాల్వడార్, పనామా, మెక్సికో, ఖతార్ దేశాల నుంచి సహాయ బృందాలు వెనిజులాకు చేరుకుంటున్నాయి. చైనా, బ్రెజిల్, కరేబియన్ దేశాలు మానవతా సాయాన్ని పంపుతున్నాయి.
బాధితులు త్వరగా కోలుకోవాలి : ఎంఎ బేబీ
సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ కూడా వెనిజులా ప్రజలతో తమ సంఘీభావాన్ని ప్రకటించారు. భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన బాధితులు త్వరగా కోలుకోవాలని, సహాయక చర్యల్లో నిమగ్నమైన వారికి మనోధైర్యం లభించాలని ఆయన కోరారు.









కామెంట్‌లు (0)