ప్రధానమంత్రికి పోస్టుకార్డు ఉద్యమం
సిజెపి పిలుపు
28 నుంచి వాంగ్‌చుక్ నిరాహార దీక్ష
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, లేదా ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఆందోళనలను మరింత ఉధృతం చేసింది. ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఆందోళనలు గురువారం కూడా కొనసాగాయి. ఉద్యమంలో భాగంగా ధర్మేంద్రను విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పోస్టుకార్డులు రాయాలని దేశ యువతకు సిజెపి పిలుపునిచ్చింది. కాగా సిజెపికి మద్దతుగా తాను కూడా ఈ నెల 28 నుంచి నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ప్రకటించారు. శనివారంలోగా సమస్య పరిష్కారం కాకపోతే ఆదివారం ( ఈ నెల 28) నుంచి తాను నిరాహార దీక్ష ప్రారంభిస్తానని వాంగ్‌చుక్ తెలిపారు.
సిపిఎం, సిపిఐ మద్దతు
జంతర్ మంతర్ వద్ద సిజెపి ఆందోళన ఆరు రోజూకు చేరుకుంది. ఈ ఆందోళనకు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు మరియం ధావలే, సిపిఐ జాతీయ కార్యదర్శి సభ్యురాలు అనీ రాజా తమ మద్దతును తెలియజేశారు. అలాగే టోక్యో పారాలిం పిక్ కాంస్య పతక విజేత వినోద్ శర్మ, ప్రఖ్యాత విద్యావేత్త, యుపిఎస్సి మెంటర్ విజేందర్ చౌహాన్, విద్యావేత్త, అభినయ మేథ్స్ వ్యవస్థాపకులు అభినయ శర్మ జంతర్ మంతర్‌ను సందర్శించి ఆందోళనకు మద్దతు తెలిపారు. ప్రపంచ యుద్ధాలను ఆపగలనని ప్రధానమంత్రి చెప్పుకుంటారని కానీ కనీసం తన దేశంలో పరీక్షా పత్రాల లీకేజీలను అరికట్టలేకపోతున్నారని సిజెపి వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే ఎద్దేవా చేశారు. ఆయన సొంత మంత్రులు బాధ్యులను సరిగా చేయలేకపోతున్నారని, అసలు ఈ ప్రభుత్వం ప్రాధాన్యతలు ఏమిటి? అని ప్రశ్నించారు.








కామెంట్‌లు (0)