mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సింహాచలం కొండపై విధ్వంసం?

2 గంటల క్రితం

google data
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 02:45 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

గూగుల్ డేటా సెంటర్‌‌కు 160 ఎకరాలు

- పర్యావరణపరంగా అత్యంత సున్నిత ప్రాంతం

- విశాఖ తాగునీటికి కీలకం -అయినా నిబంధనలు 
మార్చిన ప్రభుత్వం

- హడావిడేటాయింపు -సమీపంలోనే అరిలోవ కాలనీ, హెల్త్‌ ‌సెంటర్‌

- తప్పని శబ్ధ కాలుష్యం

- ఎంపి సోషల్‌మీడియా పోస్టులో కనిపించని వాస్తవాలు

మధు:

గూగుల్‌‌కు లబ్ధి చేకూర్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోంది. స్థానిక వనరులను కొల్లగొట్టడం, ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ‘అభివృద్ధి’ అనే పేరుతో పర్యావరణ విధ్వంసానికి పాల్పడడం ఉమ్మడి విశాఖ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గూగుల్‌ సంస్థ ఏర్పాటు చేయబోయే 12 మెగావాట్ల హైపర్‌ ‌స్కేల్‌ ‌డేటా సెంటర్‌ ‌కోసమని అడవివరం పరిధిలోని సింహాద్రి అప్పన్న (సింహాచలం) కొండ వాలుపై కైలాసగిరి, కంభాలకొండ పరిధిలోకి వచ్చే 160 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్టు కోసం కేటాయించింది. కంబాలకొండకు 1.53 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. విశాఖ నగరానికి తాగునీటి అవసరాలను తీర్చే ముడసర్లోవకు పరివాహక ప్రాంతం కూడా కావడం గమనార్హం. ఈ కారణంగానే ఈ ప్రాంతాన్ని పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన ప్రాంతంగా గుర్తించి కేటగిరి ఏలో చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని హడావిడిగా కేటగిరి బి-2లోకి మార్చి గూగుల్‌‌కు కేటాయించింది. సాధారణంగా పర్యావరణ పరంగా తక్కువ ప్రభావం చూపే భవనాల నిర్మాణం, చిన్నతరహా గనులు, చిన్న పరిశ్రమలు వంటివి ఈ విభాగం కిందకు వస్తాయి. డేటా సెంటర్‌ ‌వంటి భారీ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఆ విభాగంలోకి చేర్చడం గమనార్హం. ఒక్కసారిగా బి-2 కేటగిరిలోకి మార్చితే సమగ్ర పర్యావరణ ప్రభావ నివేదికను రూపొందించడం, ప్రజా అభిప్రాయ సేకరణ వంటి పనుల నుండి మినహాయింపు పొందే అవకాశం కూడా ఉంది. అంటే, కనీస ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే డేటా సెంటర్‌‌ను నిర్మించే అవకాశం లభిస్తుంది. ఈ కారణంగానే కఠినమైన పర్యావరణ నిబంధనలను తప్పించకుని గూగుల్‌ ‌కు సులభంగా భూములు అప్పగించడానికే ప్రభుత్వం ఈ విన్యాసానికి చేసిందన్న విమర్శలు వస్తున్నాయి. అయితే, ఇటీవల విశాఖ ఎంపి శ్రీభరత్‌ ఇటీవల విడుదల చేసిన మూడు వీడియోల్లో నీటి పరివాహక ప్రాంతం అంశంగానీ, పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన ఇతర అంశాలను గాని, రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా నిబంధనలు మార్చిన విషయం కానీ ప్రస్తావించకపోవడం గమనార్హం. అదే సమయంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాధమిక సమాచారాం కూడా పౌర సమాజానికి, స్థానిక ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో ఉంచలేదు.

మేధావుల లేఖలకు స్పందించని ప్రభుత్వం

ఇటీవల ఈ ప్రాంతాన్ని జలవనరుల పరిరక్షణ సంస్థ ప్రతినిధి డాక్టర్‌ ‌రాజేంద్ర సింగ్‌, విశాఖకు చెందిన పర్యావరణ వేత్త బొలిశెట్టి సత్య, భారత ప్రభుత్వ మాజీ ఇంధన కార్యదర్శి ఇఎఎస్‌ ‌శర్మ సందర్శించారు. వామపక్ష పార్టీల నాయకులు, పర్యావరణ వేత్తలు, పలువురు సాంకేతిక నిపుణులు కూడా ఇక్కడ క్ష్రేత్రస్థాయి పరిశీలన జరిపారు. ఆ పరిశీలన అనంతరం ఈ ప్రాంతంలో డేటా సెంటర్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన పట్ల వారు తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు. పర్యావరణానికి, నదీ పరివాహక ముడసర్లోవ ప్రాంతానికి ఈ డేటా సెంటర్‌ ‌తీవ్ర నష్టం చేకూరుస్తోందని వారు హెచ్చరించారు. ఈ ప్రాజెక్టుల వల్ల జరిగే పర్యావరణ నష్టం, వనరుల కొరతపై మేధావులు ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నప్పటికీ, పాలకుల నుంచి ఎలాంటి స్పందన లేదు. వాస్తవాలను దాచిపెడుతూ, అధికార పార్టీ పెద్దలు ప్రజలను మభ్యపెట్టే ధోరణిని కొనసాగిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నివాస ప్రాంతం ... హెల్త్‌ ‌సిటి కూడా

డేటా సెంటర్‌ ఏర్పాటుతో పెద్ద సంఖ్యలో ప్రజలు నివసించే అరిలోవ కాలనీ, విశాఖ హెల్త్‌ ‌సిటీ కూడా తీవ్రంగా ప్రభావం కానున్నాయి. అరిలోవా కాలనీలో వేలాది మంది ప్రజానీకం నివాసం ఉంటున్నారు. హెల్త్‌ ‌సిటీలో పెద్ద సంఖ్యలో మల్టీ స్పెషాల్టీ ఆస్ప్రతులు ఉన్నాయి. వివిధ రకాల వైద్య సేవల కోసం ప్రజలు భారీగా ఇక్కడకు వస్తుంటారు. ఈ ప్రభావ ప్రాంతంలోనే జైలు కూడా ఉంది. దాదాపుగా 1500 మంది ఖైదీలు ఈ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కీలకమైన ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తో పాటు స్థానిక ఎంపి కూడా చెప్పకుండా దాటవేస్తుండటం గమనార్హం. డేలా సెంటర్‌ ఏర్పాటులో భాగంగా ఇక్కడ 280 మెగావాట్ల విద్యుత్‌‌ను ఉత్పత్తి చేసే డీజల్‌ ‌జనరేటర్‌‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీనికోసం ప్రతిరోజు లక్షల లీటర్ల డీజల్ వినియోగించాల్సివస్తుంది. ఫలితంగా శబ్ధ, వాయు కాలుష్యాలు తప్పనిసరిగా మారుతాయి. అయితే, ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎంపి ఇటీవల విడుదల చేసిన వీడియోలో జూన్‌ 10‌న డేటా సెంటర్‌‌కు అనుమతులు వచ్చాయని చెప్పగా, ఏప్రిల్‌ ‌నెలలోనే ఇక్కడ పనులు ప్రారంభం అయ్యాయి.

వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి 750 మీటర్లే:

​ సింహాచలం కొండవాలు ప్రాంతంపై తవ్వకాలకు సంబంధించి కంబాల కొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ఈ తవ్వకాల ప్రాంతం 750 మీటర్లే ఉందని 2026 మే 8న డిఎఫ్‌ఒ లేఖ కూడా రాయడం గమనార్హం. ఎకో సెన్సిటివ్‌ ‌జోన్‌ (ఇఎస్‌‌జెడ్‌)‌కు 470 మీటర్ల దగ్గరగా కూడా ఇది ఉంది. విశాఖకు తాగునీరు అందించే ముడసర్లోవ జలాశయ స్థలం, పరివాహక ప్రాంతంలోనే ఇది ఉండడంతో భావితరాలు నీటి కొరతతో అల్లాడిపోతారని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. హైపవర్‌ ‌స్కేల్‌ ‌డేటా సెంటర్‌ ‌కోసం ప్రభుత్వం చెబుతున్న లెక్క చూస్తే కేవలం 246 కిలోలీటర్లు రోజుకు అంటే 0.246 మిలియన్‌ ‌లీటర్లు (ఎంఎల్‌‌డి) అని పేర్కొన్నారు. కానీ ఇఇఎస్‌ ‌శర్మ తాజాగా నిపుణుల కమిటీతో అంచనా వేసి వెల్లడించిన వాస్తవం చూస్తే దాదాపు 82 ఎంఎల్‌‌డి అంటే ప్రభుత్వం ప్రకటించిన అంకె కంటే దాదాపు 330 రెట్లు అధికం అవసరమని వెల్లడవుతోంది. సింహాచలం కొండపై డేటా సెంటర్‌ ‌పనులకు సంబంధించి జూన్‌ 10‌న స్టేట్‌ ఎన్విరాన్‌‌మెంట్‌ ఇంపాక్ట్‌ ఎసెస్‌‌మెంట్‌ (ఎస్‌ఇఐఐఎ) విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రాజెక్టు కార్యకలాపాలు ముడసర్లోవ రిజార్వాయర్‌, కంబాలకొండ వన్యప్రాణుల సంరక్షణపై ప్రతికూల ప్రభావం చూపకుండా జాగ్రత్త వహించాలంటూ పేర్కొంది. అయినా ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి స్పందన లేదు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్