దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్
నాగ్‌పూర్ అభ్యర్ధికి అబూదాబీ సెంటర్ !
న్యూఢిల్లీ : నీట్ యుజి పరీక్ష ఆదివారం మళ్లీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి భద్రతాపరమైన లోపాలు తలెత్తకుండా వుండేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పరీక్ష జరిగే కేంద్రాల వద్ద భద్రతను పటిష్టపరచడంతోపాటు అధికారుల సన్నద్ధతను అంచనా వేసేందుకు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. పరీక్ష మరికొన్ని గంటల్లో జరగనుంది అనగా అడ్మిట్ కార్డుకు సంబంధించి లోపాలు బయటపడ్డాయి. నాగపూర్‌కి చెందిన విద్యార్థి అబ్దుల్లాకు అబూదాబీ సెంటర్‌ను కేటాయించడంపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. పరీక్షా కేంద్రాన్ని నాగ్‌పూర్‌కు మార్చాలని అబ్దుల్లా చేసిన అభ్యర్ధనను అంగీకరించామని, సదరు అభ్యర్ధి తండ్రితో మాట్లాడి ఈ అంశాన్ని పరిష్కరించినట్లు ఎన్ టిఎ ఎక్స్ పోస్టులో పేర్కొంది. పరీక్షా కేంద్రానికి సంబంధించి సవరణలు వుంటే మార్చుకోవడానికి అభ్యర్ధులకోసం ఒక విండోను ఓపెన్ చేశారు. దాదాపు 3.2లక్షల మంది విద్యార్ధులు దీన్ని ఉపయోగించుకున్నారని ఎన్‌టిఎ తెలిపింది. ఆదివారం నాటి పరీక్షకు 22.79లక్షల మంది అభ్యర్ధులు హాజరు కానున్నారు. పేపర్ లీక్ ఆరోపణలతో తొలుత నిర్వహించిన పరీక్షను రద్దు చేసిన దాదాపు ఏడు వారాల తర్వాత మళ్ళీ పరీక్ష నిర్వహిస్తున్నారు. దేశంలో 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. పోలీసులు, జిల్లా యంత్రాంగంతో సహా 2లక్షల మందికి పైగా సిబ్బందిని సమీకరించామని, వీరంతా పరీక్షా కేంద్రాల వద్ద పరీక్ష నిర్వహణా ప్రక్రియ సజావుగా సాగేలా చూస్తారని ఎన్‌టిఎ తెలిపింది. మొట్టమొదటిసారిగా ప్రశ్నాపత్రాల రవాణాకు భారత వైమానిక దళాన్ని ఉపయోగిస్తున్నారు.







కామెంట్‌లు (0)