ఫాదర్స్ డే సందర్భంగా తండ్రుల గురించి మాట్లాడేటప్పుడు సాధారణంగా వారి త్యాగాలనే గుర్తు చేసుకుంటాం. కూతురు కోరిన బొమ్మ కోసం తన కోరికను వాయిదా వేసుకునే తండ్రి, కొడుకు చదువు కోసం అప్పు చేసే తండ్రి, పిల్లల భవిష్యత్తు కోసం అదనపు పని చేసే తండ్రి, కూలీ పనికి వెళ్లి వచ్చినా ఫీజుల గురించి ఆలోచించే తండ్రి - ఇలాంటి లక్షలాది మంది మన చుట్టూ కనిపిస్తారు. అయితే ప్రేమ అంటే కేవలం సంపాదించడమేనా? బాధ్యత అంటే కేవలం అవసరాలు తీర్చడమేనా? పిల్లల భవిష్యత్తు కోసం జీవితమంతా పరుగులు తీస్తున్న తండ్రులు, ఆ పిల్లల వర్తమానంలో ఎంతవరకు భాగమవుతున్నారు? అమెరికాలో స్థిరపడిన భారతీయ మూలాలున్న అర్జున్ సేన్ రాసిన 'రైజింగ్ ఎ ఫాదర్' అనే పుస్తకం ఇలాంటి ప్రశ్నలను ముందుకు తెస్తోంది. ఇది కేవలం ఒక తండ్రి కథ కాదు. ఆధునిక జీవితంలో బాధ్యతల కోసం పరుగెడుతూ, పిల్లలతో సమయం గడపలేకపోతున్న తండ్రులను హెచ్చరించే కథ!
బిజీ జీవితం
అర్జున్ సేన్ కోల్‌కతాలో పెరిగాడు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివాడు. తర్వాత అమెరికాకు వెళ్లి ఎంబీఏ పూర్తి చేశాడు. పిజ్జా హట్, బోస్టన్ మార్కెట్, పాపా జాన్స్ వంటి ప్రముఖ సంస్థల్లో ఉన్నత హోదాల్లో పనిచేశాడు. కార్పొరేట్ ప్రపంచంలో విజయవంతమైన భారతీయుడిగా పేరు సంపాదించాడు. అతని రోజులు సమావేశాలతో బిజీగా సాగిపోయేవి. విమాన ప్రయాణాలు, వ్యాపార లక్ష్యాలు, సంస్థల వ్యూహాలు, మార్కెట్ విశ్లేషణలు - అతని జీవితం మొత్తం పని చుట్టూనే తిరిగేది. తాను చేస్తున్నదంతా కుటుంబం కోసమేనని ఆయన నమ్మేవాడు. కూతురికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకునేవాడు. ఆమె చదువు, సౌకర్యాలు, భద్రత కోసం కష్టపడేవాడు. తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నానని భావించేవాడు.
2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా అంతా దిగ్భ్రాంతిలో ఉన్న రోజులు. ఆ సమయంలో అర్జున్ అనుకోకుండా కొన్ని రోజులు ఇంట్లో గడపాల్సి వచ్చింది. ఒకసారి తన ఎనిమిదేళ్ల కూతురు రాకాతో మాట్లాడుతూ, ఆమె గురించి కొన్ని విషయాలు ప్రస్తావించాడు. అప్పుడు ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. తన కూతురి గురించి చాలా తెలుసునని అనుకున్న అర్జున్‌కు, నిజానికి ఆమె ప్రపంచం గురించి చాలా తక్కువ తెలుసని అర్థమైంది. ఆమెకు అత్యంత ఇష్టమైన స్నేహితురాలు ఎవరో సరిగా తెలియదు. ఆమె ఏమి ఆలోచిస్తుందో, ఏమి కలలు కంటుందో, ఎందుకు భయపడుతుందో తెలియదు.
అప్పుడు రాకా ఒక మాట అంది:
"నాన్నా... నువ్వు నన్ను చాలా ప్రేమిస్తావు. కానీ నా గురించి నీకు చాలా విషయాలు తెలియవు."
ఆ మాట అర్జున్‌ను లోలోపల కుదిపేసింది. ఒక సంస్థలో ప్రతి కస్టమర్ గురించి తెలుసుకునే వ్యక్తికి, తన సొంత కూతురి ప్రపంచం గురించి అంత తక్కువ తెలియడం ఆశ్చర్యం కలిగించింది.
అప్పుడు అనుకున్నాడు...
కుటుంబం కోసం కష్టపడటం వేరు. కుటుంబానికి దగ్గరగా ఉండటం వేరు అని.
ప్రేమ భాష
మధ్యతరగతి కుటుంబాల్లో ఈ ప్రశ్న మరింత ముఖ్యమైనది. మన దగ్గర తండ్రుల ప్రేమ ఎక్కువగా పనుల రూపంలో కనిపిస్తుంది. ఉదయం ఉద్యోగానికి వెళ్లడం, సాయంత్రం అలసిపోయి రావడం, పిల్లల ఫీజులు కట్టడం, అవసరాలు తీర్చడం - ఇవే ప్రేమ వ్యక్తీకరణలుగా మారిపోతాయి. కానీ పిల్లల కోరికలు వేరేగా ఉంటాయి. వాళ్లకు నాన్న చెప్పే కథ కావాలి. నాన్నతో కలిసి ఆడుకోవాలి. ధైర్యాన్ని ఇచ్చే నాన్న కావాలి. వాళ్ల భయాలను అర్థం చేసుకోవాలి. తక్కువ మార్కులు వచ్చినప్పుడు మందలించకుండా స్నేహితుడిలా మాట్లాడాలి. చక్కగా కబుర్లు చెబుతూ గుండెకు హత్తుకొని నిద్రపోయే సందర్భాలు కావాలి!
తన చిన్నారి కూతురితో జరిగిన ఆ సంభాషణ తర్వాత అర్జున్ తన జీవితాన్ని తిరిగి చూసుకున్నాడు. పదోన్నతులు, జీతాలు, హోదాలు, విజయాలు అన్నీ ముఖ్యమే. కానీ వాటి కోసం తన కూతురి బాల్యాన్ని కోల్పోతే ఆ విజయాలకు అర్థమేంటని ప్రశ్నించుకున్నాడు. చివరికి తన ఉన్నత ఉద్యోగాన్ని వదిలేశాడు. ఇంటి నుంచే పని చేసే మార్గాన్ని ఎంచుకున్నాడు. రాకాతో సంబంధాన్ని మళ్లీ నిర్మించుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఒక నిజం గ్రహించాడు. పిల్లలను పెంచడం అంటే వాళ్లను మనకు నచ్చిన రూపంలో తీర్చిదిద్దడం కాదు. వాళ్లను వాళ్లుగా అర్థం చేసుకోవడం.
పెరగాల్సింది...
ఈ అనుభవాల తర్వాత అర్జున్ సేన్ రాసిన పుస్తకమే 'రైజింగ్ ఎ ఫాదర్'. ఈ పేరు విన్నప్పుడు ఒక తండ్రి తన కూతురిని పెంచిన కథ అనిపిస్తుంది. చదివితే అర్థమయ్యేది వేరే విషయం. పెరగాల్సింది రాకా కాదు. పెరగాల్సింది అర్జునే. అందుకే ఆయన పుస్తకానికి ఆ పేరు పెట్టాడు. అయితే ఈ కథను చదివేటప్పుడు మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మన ఇళ్లలోని తండ్రులు అర్జున్ సేన్‌లా కార్పొరేట్ అధికారులు కాకపోవచ్చు. వాళ్లు రైతులు కావచ్చు. కూలీలు కావచ్చు. డ్రైవర్లు కావచ్చు. చిన్న ఉద్యోగులు కావచ్చు. వారు పంచే ప్రేమ గురించి సందేహం లేదు. పిల్లల కోసం ఆలోచించడం, అన్నీ అమర్చి పెట్టడం సరే! కానీ వాళ్లకు తగిన సమయం కేటాయించి, కలిసి గడుపుతున్నామా అనేదే ముఖ్యం. 'రైజింగ్ ఎ ఫాదర్' పుస్తకం చెప్పేది ఇదే! పిల్లలను పెంచడం అంటే వారి భవిష్యత్తును నిర్మించడం మాత్రమే కాదు. వారి వర్తమానంలో కూడా భాగం కావడం. పిల్లలు పెద్దయ్యాక వారికి గుర్తుండేది తండ్రి ఎంత సంపాదించాడన్నది కాదు. తమతో ఎంత సమయం గడిపాడన్నదే!
తండ్రులు పిల్లలను పెంచుతారు. అది సహజం. అదే సమయంలో పిల్లలు కూడా తమ తండ్రులను మరింత మంచి మనుషులుగా తీర్చిదిద్దుతారు. జీవితానికి కొత్త అర్థం నేర్పిస్తారు. మనం కోల్పోతున్న వాటిని చూపిస్తారు. ఎనిమిదేళ్ల రాకా తన తండ్రికి ఒక సత్యాన్ని గుర్తు చేసింది. పిల్లల కోసం జీవితం నిర్మించడం ఎంత ముఖ్యమో, వారి జీవితంలో ఉండడం కూడా అంతే ముఖ్యమని. అందుకే ఇది ఒక తండ్రి కథ మాత్రమే కాదు, నాన్నలందరినీ ఒకసారి తమలోకి తాము పరిశీలనగా చూసుకోమని చెప్పే కథ. ఈ పుస్తకం రాసి దాదాపు 23 ఏళ్లు అయింది. ఇప్పటికీ నాన్నలకు ప్రేమ పాఠాలు నేర్పుతూనే ఉంది.








కామెంట్‌లు (0)