మబ్బులను చూచి కుండలో నీళ్లు పారబోసిన చందంగా వుంది- గోదావరి నికర జలాలు అంశంలో కూటమి ప్రభుత్వ ధోరణి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గోదావరి వరద జలాలు గురించి మాట్లాడని రోజంటూ లేదు. గోదావరి నుండి మూడు నాలుగు వేల టి.యం.సి ల నీళ్లు సముద్రంలో కలసి పోతున్నాయని ఇందులో నుండి రెండు వందల టి.యం.సి లు బనకచర్ల అనుసంధానం పథకం ద్వారా తీసుకొంటే తెలంగాణకు గాని, ఎగువ రాష్ట్రాలకు వచ్చిన నష్టమేమిటని ప్రశ్నించని రోజు లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక సామెత వుంది. కోడలు బిడ్డను కంటామంటే అత్తకొచ్చిన అభ్యంతరం లేదని. అలా కూటమి ప్రభుత్వం గోదావరి జలాలు 200 టి.యం.సి లు తీసుకు వచ్చి రాష్ట్రంలోని మెట్ట ప్రాంతాలకు సరఫరా చేస్తే ఎవరికి గాని ఎందుకు అభ్యంతరం వుంటుంది? అయితే నదులపై ప్రాజెక్టులు నిర్మించే సమయంలో కొన్ని నియమ నిబంధనలు వున్నాయి. ఆ మేరకు వరద జలాలు ఆధారంగా ప్రాజెక్టుల డి.పి.ఆర్ లను కేంద్ర జల సంఘం ఆమోదించ లేదు.
సాంకేతికపరమైన ఈ అంశాన్ని ముఖ్యమంత్రికి రాష్ట్ర జల వనరులకు శాఖ మంత్రికి జల వనరుల శాఖలో అనుభవజ్ఞులైన ఇంజనీరింగ్ అధికారులు వివరించి చెప్పి వుండాలి. కాని ఏం జరిగిందో తెలియదు. బహుశా కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతున్నాడు కాబట్టి గోదావరి నదిపై వరద జలాలతో డి.పి.ఆర్ ఆమోదం లభిస్తుందని ఇంజనీరింగ్ అధికారులు భావించినట్లుంది. తుదకు ఇప్పుడేమైంది? అందరికీ తెలుసు. గోదావరి వరద జలాల కోసం కృష్ణ నికర జలాలకు కేంద్ర జల సంఘం ఎసరు పెట్టింది.
నాణేనికి ఇదొక వేపు అయితే గోదావరి వరద జలాలు దేవుడెరుగు. నికర జలాలకు కేంద్ర జల సంఘం స్పాట్ పెట్టింది. బచావత్ ట్రిబ్యునల్ గోదావరి బేసిన్ లోని ఆయా రాష్ట్రాలకు గంప గుత్తగా కేటాయింపులు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 1480 టి.యం.సి లు కేటాయించినది. అయితే రాష్ట్ర విభజన జరిగిన నాటి నుండి ఇరు రాష్ట్రాల మధ్య గోదావరి జలాల వాటాలపై వివాదం నడుస్తోంది.
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా అప్పటి నుండి ఇప్పటి వరకు గోదావరి వరద జలాలు బనకచర్ల లేక నల్లమల అనుసంధానం గురించి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు గాని ఏ రోజూ ఆంధ్రప్రదేశ్ వాటా నికర జలాలు గురించి పట్టించుకోలేదు. ట్రిబ్యునల్ నియామకం గురించి పట్టించుకోలేదు. ఇటీవల ఒక మారు ఢిల్లీ లో రెండు రాష్ట్రాల వాటా తేల్చేందుకు ట్రిబ్యునల్ నియామకం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి పాటిల్ వద్ద ప్రస్తావించారు. ఈ లోపు ఆంధ్ర ప్రదేశ్ దిమ్మ తిరిగేలా కేంద్ర జల సంఘం బాంబు పేల్చింది. ఇటీవల ఢిల్లీ నుండి కేంద్ర జల సంఘం వర్చువల్ గా నిర్వహించిన సమావేశంలో తెలంగాణ వాటా 968 టి.యం.సి లని ఆంధ్ర ప్రదేశ్ కేవలం 516 టి.యం.సి లని నిగ్గు తేల్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా 968 టి.యం.సి లని డిమాండ్ చేయడం అర్థం చేసుకోగలం. కాని ట్రిబ్యునల్ తేల్చవలసిన నిర్ణయం కేంద్ర జల సంఘమే వెల్లడి చేయగానే ఆంధ్రప్రదేశ్ అధికారులు తెల్ల మొహం వేయక తప్ప లేదు.
సమావేశంలో పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ అధికారులు ఇచ్చిన వివరణ కేంద్ర జల సంఘం పట్టించుకున్నట్లు లేదు. మరు సమావేశంలో చర్చించుదామని వాయిదా వేశారు. ఒక దఫా కేంద్ర జల సంఘమే లెక్కలు తేల్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కిందకు దిగే అవకాశం వుండదు కదా?
కెసిఆర్ తో అంట కాగుతూ వున్నందున జగన్‌మోహన్ రెడ్డి తన హయాంలో గోదావరి నదిలో ఎవరి వాటా ఎంతో తేల్చడానికి ట్రిబ్యునల్ నియామకం గురించి పట్టించుకోలేదు. కాని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ట్రిబ్యునల్ నియామకం గురించి దృష్టి సారించలేదు. బనకచర్ల నల్లమల సాగర్ అనుసంధానం మూడు నాలుగు వేల టి.యం.సి ల గోదావరి వరద జలాల్లో 200 టి.యం.సి లు జపంతోనే సరి పోయింది. గోదావరి ట్రిబ్యునల్ నియామకానికి తెలంగాణ అంగీకరించడం లేదు. ఈ పరిస్థితుల్లో ట్రిబ్యునల్ నియామకం ఎంత వరకు సాధ్యం? ఒక వేళ ట్రిబ్యునల్ నియామకం జరిగినా కలిగే లాభం అతి స్వల్పం. ఎందుకంటే గోదావరి నదిపై తెలంగాణకు చెందిన పలు ప్రాజెక్టులకు వివిధ రకాల అనుమతులు ఇవ్వబడ్డాయి. ఈ అంశాన్ని కేంద్ర జల సంఘం వివరించుతూ తాము శాస్త్రీయంగా వ్యవహరించామని ఆంధ్ర ప్రదేశ్ అధికారులకు వివరించారు. ఆంధ్ర ప్రదేశ్ లో అప్పుడు బటన్ నొక్కుడు, ఇప్పుడు పారిశ్రామికవేత్తలకు భూపందేరంతో సరిపోతోంది.
- వ్యాసకర్త ; వి. శంకరయ్య
విశ్రాంత పాత్రికేయుడు








కామెంట్‌లు (0)