mh ad
శనివారం, 20 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్మశాన వాటిక రికార్డుల పరిశీలన

2 గంటల క్రితం

acp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 02:02 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

30 మంది స్టేట్‌‌మెంట్లు రికార్డు

సాయికృష్ణ కేసులో *కృష్ణలంక పిఎస్‌‌లో విచారణ

ప్రజాశక్తి - విజయవాడ, అమరావతి బ్యూరో : సాయి కృష్ణ కేసులో విజయవాడ కృష్ణలంక స్వర్గపురి స్మశాన వాటిక డేటాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. శనివారం వరకు సుమారు 30 మంది నుంచి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. నమోదైన రికార్డుల ప్రకారం మే 24న ఐదు గుర్తుతెలియని మృతదేహాలు, మే 25న నాలుగు, మే 26న అత్యధికంగా ఏడు గుర్తుతెలియని మృతదేహాలు స్వర్గపురికి వచ్చినట్లు పోలీసులు గుర్తించి ఆ డేటాను విశ్లేషిస్తున్నారు. విచారణ బృందంలో ఉన్న విజయవాడ పటమట సిఐ పవన్‌ ‌కిషోర్‌, మరికొంత మంది పోలీసు సిబ్బంది స్వర్గపురి స్మశాన వాటికకు వెళ్లి రికార్డులను పరిశీలించారు. సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. అనాథ మృతదేహాల నిర్వహణలో నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలతో ఎలక్ట్రికల్ ఫర్నెస్ ఆపరేటర్ బాషాను అదుపులోకి తీసుకుని స్టేషన్‌‌కు తీసుకెళ్లి విచారించారు. ఆయన మొబైల్ ఫోన్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వర్గపురి సిసి పుటేజీ కోసం ఆరా తీయగా సిసి కెమెరాలు లేవనే విషయం తేలింది. దీంతో గత నెల 20 నుండి 25 మధ్య అక్కడకు వచ్చిన గుర్తుతెలియని మృతదేహాల వివరాలను పోలీసులు సేకరించారు. ధ్రువీకరణ పత్రం ఆధారంగానే గుర్తుతెలియని మృతదేహాల ఖననం జరుగుతుందని స్వర్గపురి సిబ్బంది వివరించారు. ఆ సమయంలో స్వర్గపురికి మృతదేహాలను తరలించిన వాహనాలు, వాటి వివరాలను కూడా సేకరిస్తున్నారు. కృష్ణలంక పోలీసుస్టేషన్‌‌లో రెండో రోజు విచారణ జరిపిన అనంతరం బయటకు వచ్చిన ఎసిపి దైవప్రసాద్‌... విచారణపై మీడియాతో మాట్లాడకుండానే స్టేషన్‌ ‌నుంచి వెళ్లిపోయారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. మరోవైపు సాయికృష్ణ ఘటనపై విచారణ అధికారిగా నియమితులైన రాజమహేంద్రవరం ఎస్‌‌పి నరసింహ కిశోర్‌ కూడా విచారణ ప్రారంభించారు. కృష్ణలంక పోలీసుస్టేషన్‌ సిబ్బందిని ప్రశ్నించారు. కృష్ణలంక స్టేషన్‌ లోపల, బయట ఉన్న సిసి కెమెరాల హార్డ్‌డిస్క్, డివిఆర్, ఎన్‌విఆర్‌ పరికరాలను ఫోరెన్సిక్, సైబర్‌ విశ్లేషణ బృందం స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపింది.

సమగ్ర విచారణకు ఐలు డిమాండ్‌

కాగా సాయికృష్ణ అదృశ్యంపై తక్షణమే నిష్పక్షపాత విచారణ జరపాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు ఇస్తున్న వివరణ, సిఐని సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశించడం చూస్తే సాయికృష్ణ అదృశ్యంపై అనేక అనుమానాలకు తావిస్తుందని పేర్కొన్నారు. మార్కాపురం నుంచి సాయికృష్ణను విజయవాడకు తీసుకొచ్చిన పోలీసులందరినీ సిఐతో సహా విధులకు దూరంగా ఉంచి సమగ్ర విచారణ జరపాలని కోరారు. హైకోర్టులో పెండింగ్‌‌లో ఉన్న కేసులో బాధ్యులైన పోలీసుల పేర్లు వెల్లడించి వారికి శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైకోర్టులో ఉన్న కేసు డిస్పోస్ అయిన తర్వాత బాధ్యులపై తగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారికి శిక్షలు పడేలా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు.


సిఐ నాగరాజు ఎక్కడ?

సాయికృష్ణ ఘటనలో సస్పెన్షన్‌‌కు గురైన విజయవాడ కృష్ణలంక సిఐ నాగరాజు ఎక్కడ ఉన్నారనేది తెలియడంలేదు. ఈ ఘటనలో ముందుగా ఆయనను వేకెన్సీ రిజర్వు (విఆర్‌)‌కు పంపుతున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం... ఆ తర్వాత ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతతో సిఐ నాగరాజును సస్పెండ్‌ ‌చేస్తూ విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు ఆదేశాలు జారీ చేశారు. ఎట్టకేలకు ఆయనపై కేసు నమోదైంది. అయితే ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనేది తెలియడంలేదు. సాయికృష్ణ ఘటనపై విచారణ సాగిస్తున్న పోలీసు అధికారులు ఆయనను మాత్రం అరెస్టు చేయలేదు. సిఐను విఆర్‌‌కు పంపడం దగ్గర నుంచి సస్పెండ్ చేయడం వరకు చూస్తే సాయి కృష్ణ ఘటనలో తప్పు జరిగిందని స్పష్టమవుతున్నా సిఐ అరెస్టుకు మాత్రం వెనుకడగువేస్తున్నారు. మరోవైపు హెబియస్‌ ‌కార్పస్‌ ‌పిటిషన్‌ దాఖలైన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఈనెల 29న సాయికృష్ణను పోలీసులు కోర్టు ఎదుట ప్రవేశపెట్టాల్సి ఉంది. దీనిపై ఏం చేయాలని పోలీసులు మల్లగుల్లాలుపడుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్