పేద, ధనిక తారతమ్యం లేకుండా ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదువుకోవాలి. కానీ నేటి విద్యావ్యవస్థ అలా లేదు. డబ్బులు పెట్టినవాళ్లకే మెరుగైన, నాణ్యమైన విద్య అందడం సర్వసాధారణం అయిపోయింది. పాఠశాల విద్య దాటి పైచదువులు చదవడం చాలామందికి తీరని కలగా మిగిలిపోతోంది. ఉపాధి చూపించే ఏ కోర్సు నేర్చుకోవాలన్నా కోచింగ్ సెంటర్లకు లక్షల రూపాయలు చెల్లించాల్సిందే. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్.. వేదిక ఏదైనా ఫీజులు చెల్లిస్తేనే బోధన. అలాంటిది ఇటీవల బీహార్‌లోని ఓ కోచింగ్ సెంటర్ గురించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ప్రత్యర్థి కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఖాన్ సార్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న 'ఖాన్ జీఎస్ రీసెర్చ్ సెంటర్' ఎదుట బీభత్సం సృష్టించారు. తుపాకి కాల్పులు జరిపి, బెదిరింపులు చేసేదాకా వెళ్లింది. ఒక విద్యా సెంటర్ నిర్వాహకుడిపై ఇంత అక్కసు ఎందుకు? కేవలం రూ. 200లకే నాణ్యమైన విద్యను అందిస్తున్న ఆ ఖాన్ సార్ ఎవరు? ఆయన లక్ష్యం ఏంటి?
ఖాన్ సార్ విద్యాబోధనకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. విద్యార్థులకు సులభమైన రీతిలో, అందుబాటు ఫీజులో బోధించడం ఆయన ప్రత్యేకత. ఈ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి. అయినా ఆయన తన లక్ష్యానికే కట్టుబడి ఉన్నారు. ఖాన్ సార్ కోచింగ్ సెంటర్‌ను ఆపేయమని ఒకసారి ఏకంగా 107 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చింది. ఆ ప్రతిపాదనను తిరస్కరించి మరీ పేద విద్యార్థుల పక్షాన నిలిచారు ఖాన్ సార్.
నామమాత్రపు ఫీజు వసూలు చేసి నాణ్యమైన విద్య అందించడం సవాలుతో కూడుకున్న పని. ఆ సొమ్ము కోచింగ్ సెంటర్లలో బోధించే టీచర్ల జీతాలకు కూడా సరిపోదు. కానీ ఖాన్ సార్ లాభాల కోసం ఎదురుచూసే వ్యక్తి కాదు. అందుకే ఎన్నో కోచింగ్ సెంటర్లకు అసాధ్యమైనదాన్ని సాధ్యం చేసి చూపించారు. ఆయన తీసుకున్న నిర్ణయం ఎన్నోసార్లు ప్రాణాపాయాన్ని తెచ్చిపెట్టింది. ప్రత్యర్థులు బాంబు దాడులు కూడా చేయించాలని చూశారు. తనపై ఇంతలా బెదిరింపులు వస్తున్నా ఆయన తన నిర్ణయాన్ని ఎప్పుడూ వెనక్కి తీసుకోలేదు. ఆర్థికంగా, సామాజికంగా ఆయన్ను దెబ్బతీయలేని వ్యక్తులు మతం పేరుతో నిందించాలని కూడా చూశారు. ఇస్లామోఫోబిక్ వివాదాన్ని కూడా ఆయనపై రుద్దారు. అప్పుడే ముస్లిం వ్యక్తి అయిన ఖాన్ సార్ ఎంతో ప్రేమ, ఆప్యాయతలతో రక్షాబంధన్‌ను జరుపుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాలు బోధించడంలో 'జీఎస్' సెంటర్ బాగా పాపులర్ అయింది. ఎన్నో క్లిష్టమైన అంశాలను చిన్న చిన్న భాగాలుగా విభజించి అర్థవంతంగా వివరించడంలో ఖాన్ సార్‌కు మంచి పేరు ఉంది. విద్యావేత్తగా ఖాన్ సార్ సంపాదించినది డబ్బుల రూపంలో చాలా తక్కువ. కానీ ఫీజులు కట్టలేని కోట్లాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మనసుల్లో ఆయన సంపాదించుకున్న స్థానం మాత్రం డబ్బుతో వెలకట్టలేనిది.
బాల్యం.. విద్యాభ్యాసం
1993లో ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో జన్మించిన ఖాన్ సార్ అసలు పేరు ఫైజల్ ఖాన్. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఖాన్ ఆర్మీలో చేరాలని ఎంతో ఆశపడ్డారు. అయితే కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ దిశగా చదువు కొనసాగించలేకపోయారు. సైనిక్ స్కూల్ అడ్మిషన్ కోసం ఆయన చేసిన దరఖాస్తును తిరస్కరించారు. దీంతో సాధారణ విద్య అభ్యసించారు. అలహాబాద్ యూనివర్సిటీలో జాగ్రఫీలో ఎంఏ పూర్తి చేశారు. ఈ మొత్తం ప్రయాణం ఖాన్ సార్‌కు ఎన్నో అనుభవాలను నేర్పింది. కోరుకున్న చదువు చదవలేని పేదరికం, చదివిన చదువుకు అందని ప్రోత్సాహం ఆయన్ను ఉపాధి కోసం బీహార్ వైపు పయనించేలా చేసింది. అక్కడ ఒక కోచింగ్ సెంటర్‌లో తన బోధనా వృత్తిని ప్రారంభించారు. 2019 నాటికి సొంతంగా ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేశారు. మొదటి నుంచి ఆయన లక్ష్యం ఒకటే. వెనుకబడిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం. అందుకే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తన ఆశయం కోసమే నిలబడ్డారు.
కోవిడ్ సమయం ఖాన్ సార్ గొప్ప ఆశయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఇన్‌స్టిట్యూట్ సేవలను ఆన్‌లైన్ వేదికగా అందించాలని ఖాన్ సార్ 2020లో 'ఖాన్ జీఎస్ రీసెర్చ్ సెంటర్' పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. ఎంత క్లిష్టమైన విషయాన్ని అయినా చాలా సరళంగా, నిజ జీవిత సంఘటనలతో ముడిపెట్టి ఆహ్లాదభరితంగా చెప్పే ఆయన బోధనా విధానానికి చాలా స్వల్ప కాలంలోనే లక్షలాది మంది విద్యార్థులు ఛానెల్‌ను అనుసరించడం మొదలుపెట్టారు. 2025 నాటికి ఆ సంఖ్య 2 కోట్ల 40 లక్షలకు చేరింది. ఈ ప్రయాణంలో ఆయన ఎన్నో మైలురాళ్లను కూడా అధిగమించారు. డిజిటల్ కోర్సుల కోసం సరికొత్త మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. 2021 నాటికి కోర్సుల కోసం సొంతంగా మెటీరియల్ ఏర్పాటు చేశారు. కులం, మతం, పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదన్నది ఖాన్ సార్ భావన. విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకునేలా స్ఫూర్తిదాయక ప్రసంగాలను కూడా ఖాన్ సార్ ఇస్తుంటారు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉచితంగా క్లాసులు తీసుకుంటారు. ఆయన ఉపన్యాసాల్లో ఎప్పుడూ లౌకికవాదం, జాతీయ గౌరవం ప్రస్ఫుటిస్తుంది.
వివిధ ఉద్యోగాలకు వేలాదిమంది
ఖాన్ సార్ కోచింగ్ సెంటర్‌లో విద్యనభ్యసించిన విద్యార్థుల్లో ప్రతి ఏడాది వేలాది మంది SSC, రైల్వే, NDA, వివిధ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల వంటి పరీక్షలకు అర్హత సాధిస్తున్నారు. బీహార్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో 12,000 మందికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని సంస్థ ప్రకటించింది. ఖాన్ సార్ డిజిటల్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు భారతదేశం అంతటా అనేక చోట్ల సేవలు అందిస్తున్నాయి. ఢిల్లీ, పాట్నా, ప్రయాగ్‌రాజ్, డెహ్రడూన్‌తో పాటు ప్రధాన విద్యా కేంద్రాల్లో ఆఫ్‌లైన్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. దీంతో ఖాన్ సార్ కోచింగ్ సెంటర్ దేశంలోనే అతిపెద్ద పోటీ పరీక్షల కోచింగ్ కమ్యూనిటీలలో ఒకటిగా నిలిచింది.
సేవామార్గంలో..
విద్యతో పాటు ఖాన్ సార్ సేవా మార్గంలో కూడా నడుస్తున్నారు. గ్రంథాలయాలు, గోశాల, ఆస్పత్రి వంటివి ఆయన సేవల్లో కొన్ని. అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మించిన ఆస్పత్రి కోచింగ్ సెంటర్ మాదిరిగానే ఎంతో ఉదారంగా ఉచిత సేవలు అందిస్తోంది. డబ్బులు లేకపోవడం వల్ల కోరుకున్న చదువు చదువుకోలేకపోయిన ఖాన్ సార్, ఇప్పుడు కోట్లాది మంది విద్యార్థులకు ఆ కష్టాన్ని తెలియకుండా చేస్తున్నారు.
పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు ఖాన్ సార్ చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. 2024లో రాష్ట్ర ప్రభుత్వ పోకడలకు నిరసనగా పోరాడుతున్న బీపీఎస్సీ అభ్యర్థులకు అండగా ఖాన్ సార్ నిరసనల్లో పాల్గొన్నారు. అప్పుడు అధికారులు ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. అరెస్టు వరకు వెళ్లారు. అయితే సార్‌కు మద్దతుగా విద్యార్థుల నిరసనలతో ఆ వ్యవహారం వెనక్కి తగ్గింది. తాజాగా జరిగిన ఉదంతంలో కూడా ఆయన ఇన్‌స్టిట్యూట్‌ను ధ్వంసం చేశారు. సార్ ప్రోద్బలంతోనే తుపాకులు ఉపయోగించారన్న నెపంతో ఖాన్ సార్‌ను కూడా పోలీసులు నిర్బంధించారు. చదువును అందరికీ దగ్గర చేయాలన్న గొప్ప సంకల్పం ఉన్న ఖాన్ సార్‌ను ఇలాంటి బెదిరింపులు ఏమీ చేయలేవని ఆయన ప్రయాణం గుర్తుచేస్తుంది.









కామెంట్‌లు (0)