మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా పోలీస్ స్టేషన్‌కు జూన్ 12 శుక్రవారం రాత్రి సమయంలో ఓ మహిళ వచ్చింది. అప్పటికే ఆమె తీవ్రంగా అలసిపోయి ఉంది. ఆమె పాదాల్లో ముళ్లు గుచ్చుకుని ఉన్నాయి. గాయాల నుంచి రక్తం కారుతోంది. ఇంకా, ఆమె మెడ చుట్టూ ఇనుప గొలుసు, దానికి ఓ తాళం ఉన్నాయి. పోలీసులను చూసి ఆమెకు మాటలు రాలేదు. తెగ ఆయాసపడుతోంది. తనపై జరిగిన దారుణాన్ని చెబుతున్నప్పుడు ఆమె కళ్లు భయంతో వణికాయి. మహిళపై ఇంతటి దాష్టీకానికి తెగబడింది ఆమె భర్తే. రెండు రోజుల పాటు భార్యను అతడు తీవ్రంగా కొట్టి హింసించాడు. ఆ మహిళ ఎదుర్కొన్న గృహహింస తనది మాత్రమే కాదు, కోట్లాది మహిళలది. కుటుంబ గౌరవం, పిల్లల భవిష్యత్తు, సమాజం ఏమనుకుంటుందో అన్న భయాలతో మౌనంగా గృహహింసను భరిస్తున్న మహిళలు మనచుట్టూ ఎంతోమంది. ఈ హింస వ్యక్తిగత సమస్య కాదు; తీవ్రమైన సామాజిక సమస్య.
మంగీబాయ్ తన్వార్ భర్త తనపై చేసిన దాడిని పోలీసులకు వివరించింది. జూన్ 10 నుంచి, అంటే తను పోలీస్ స్టేషన్‌కు రావడానికి రెండు రోజుల ముందు నుంచే, తనను హింసించడం మొదలుపెట్టాడని తెలిపింది. మద్యానికి బానిసైన అతడు భార్యను కొట్టడానికి పెద్ద కర్రను ఉపయోగించాడు. పదేపదే ఆమె శరీరంపై దాంతో మోదాడు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆ హింస కొనసాగింది. దెబ్బలు తాళలేక అర్ధరాత్రి సమయంలో మంగీబాయ్ ఇంటి నుంచి పారిపోయింది. కొన్ని గంటల పాటు చిమ్మచీకటిలో నడిచింది. ఖిల్చిపూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకోవాలనుకుంది. మార్గమధ్యంలో భర్త కాపుకాశాడు. రోడ్డుపైనే తనను కొట్టి మళ్లీ ఇంటికి తీసుకొచ్చాడు. ఈసారి తను తప్పించుకోకుండా ఉండాలని ఇనుప గొలుసును మెడలో వేసి తాళం వేసి, స్తంభానికి కట్టేశాడు. అయినా అతడి కోపం చల్లారలేదు. ఇనుప రాడ్డును ఎర్రగా కాల్చి కాళ్లపై, నడుంపై, తొడలపై విచక్షణారహితంగా కాల్చాడు. ఇలా 24 గంటల పాటు హింసించాడని మంగీబాయ్ చెప్పింది. ఇంత బాధ అనుభవించిన ఆమె ఎలాగో తప్పించుకుని బయటపడింది.
మౌన వేదన!
మరోచోట 31 ఏళ్ల గంగ (పేరు మార్చాం) తన గోడు ఇలా వెళ్లబోసుకుంది. తన దినచర్య ఉదయం 6 గంటలకే ప్రారంభమవుతుంది. వంట చేసి, పిల్లలను స్కూలుకు పంపి, పనికి బయల్దేరుతుంది. తొమ్మిది గంటలు పనిచేసి ఇంటికి వచ్చాక మళ్లీ వంట సిద్ధం చేస్తుంది. రాత్రుళ్లు భర్త తాగి వచ్చి ఆమెను తీవ్రంగా కొడతాడు. ఉదయం పని దగ్గర నొప్పితో విలవిల్లాడుతుంది. తోటి మహిళలతో ఆ విషయాన్ని చాలా సరదాగా చెబుతూ నవ్వుతుంది. ఎప్పుడూ ఈ హింస గురించి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తను గర్భం దాల్చినప్పుడు ఆశా వర్కర్‌కు ఆ హింస గుర్తులు కనిపించాయి. దానిపై ఆమె నిలదీసినప్పుడు, ఇదంతా చాలా సర్వసాధారణమని గంగ కొట్టిపారేసింది. మంగీబాయ్, గంగ ఉదంతాలు మనకు ఎన్నో విషయాలను చెబుతున్నాయి. హింసను తాళలేక పోలీస్ స్టేషన్ వరకు వచ్చిన మంగీ ఒక్కరోజులో రాలేదు. కొన్ని దశాబ్దాల పాటు దాన్ని భరించింది. గంగపై నిత్యం వేధింపులు ఉన్నా, ఎప్పుడూ వాటిపై ఫిర్యాదు చేయాలని అనుకోలేదు.
గత నెలలో విడుదలైన జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్సీఆర్బీ) 2024 నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా మహిళలపై జరిగే నేరాల్లో 27 శాతం భర్త లేదా బంధువుల నుంచే జరుగుతున్నాయి. ఈ కేసులు 2023తో పోలిస్తే తగ్గాయని నివేదికలో పేర్కొన్నారు. అయితే పలు సర్వేలు, అధ్యయనాల ప్రకారం కేసుల తగ్గుదల అంటే హింస తగ్గిందని చెప్పలేమని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. “హింస ప్రాణాపాయంగా మారనంత వరకు ఏ ఫిర్యాదూ పోలీస్ స్టేషన్ వరకు రాదు. ఒక్కోసారి చాలామంది భార్యలు తమ భర్తలను మందలించి వదిలేయమని కూడా పోలీసులకు చెప్పిన ఉదాహరణలు ఉంటాయి” అని సామాజిక పరిశోధకురాలు విబూతి పటేల్ అంటున్నారు. “లింగ సమానత్వాన్ని సమర్థించే జెన్-జెడ్ తరంలో కూడా మహిళలపై హింస కొనసాగడానికి కారణం, సూత్రప్రాయంగా సమానత్వాన్ని సమర్థిస్తూనే పురుషుల అధికారాన్ని సమర్థించే ధోరణులు ఇంకా వదల్లేకపోవడమే” అని అమెరికాకు చెందిన యువాన్ సంస్థ చేసిన సర్వేలో తేలింది.
గణాంకాల హెచ్చరిక
2025లో 29 దేశాల్లో ఉన్న 18 ఏళ్లు పైబడిన 23,268 మంది భారతీయులపై లండన్‌లోని కింగ్స్ కాలేజీలో యువాన్ సంస్థ, ఇప్సోస్ భాగస్వామ్యంతో నిర్వహించింది. ఈ సర్వేలో చాలా మంది సాధారణంగా లింగ సమానత్వానికి మద్దతు ఇస్తున్నప్పటికీ, వివాహం, కుటుంబ అధికారం, గృహ బాధ్యతలు వంటి నిర్దిష్ట అంశాలపై దాని ప్రభావం పడినప్పుడు మాత్రం అంత సానుకూలంగా లేరని తేలింది. ఇండియాలో 18-49 సంవత్సరాల వయస్సు గల వివాహిత మహిళల్లో 22.3 శాతం మంది తమ భర్తల నుంచి శారీరక లేదా లైంగిక హింసను ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఎవరి చేతనైనా శారీరక లేదా లైంగిక హింసకు గురైన మహిళల్లో కేవలం 14 శాతం మంది మాత్రమే ఆ హింసను ఆపడానికి సహాయం కోరినట్లు 2023-24లో నిర్వహించిన భారత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. 12 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాఠశాల విద్యను పూర్తి చేసిన భర్తలు, ఎలాంటి చదువు లేని భర్తలతో పోలిస్తే, తమ జీవిత భాగస్వామిపై శారీరక, లైంగిక లేదా మానసిక హింసకు పాల్పడే అవకాశం సగం మాత్రమే ఉందని సర్వే వెల్లడించింది. తరచుగా మద్యం సేవించే భర్తలు ఉన్న కుటుంబాల్లో 71 శాతం మంది మహిళలు వైవాహిక శారీరక లేదా లైంగిక హింసను ఎదుర్కొన్నారు. మద్యం సేవించని భర్తలు ఉన్న మహిళల్లో ఈ శాతం 23గా ఉంది. “గృహహింస ఎప్పుడూ శారీరక హింసతో ప్రారంభం కాదు. అది సూక్ష్మమైన, నిరంతర భావోద్వేగ వేధింపులతో మొదలవుతుంది. ఇది క్రమపద్ధతిలో ఒక మహిళ ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేస్తుంది. చివరకు శారీరక దాడి జరిగినప్పుడు ఆ నిందను తనలోనే వేసుకునేలా చేస్తుంది” అని వ్యక్తిగత, వివాహ, కుటుంబ చికిత్సలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న పూణేకు చెందిన మనస్తత్వవేత్త పరమిత చక్రవర్తి అంటున్నారు. మంగీ, గంగ.. పేర్లు ఏవైనా, వారు ఎదుర్కొన్న హింస ఎందరిదో! పరమిత చక్రవర్తి అన్నట్లు, నిరంతర భావోద్వేగ వేధింపులతో మొదలయ్యే ఈ హింస వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే స్థాయికి చేరుకోవడం మహిళల భవిష్యత్తుకే కాదు, సమాజ ప్రగతికి కూడా చేటు చేస్తుంది.









కామెంట్లు (0)