వెండితెరకు కొత్త సొబగులు, పల్లె జీవితపు సౌందర్యమూ అద్దిన అరుదైన దర్శకుడు, సృజనశీలి భారతీరాజా. ఆయన రాకముందు తమిళ సినిమాలు ఎక్కువగా స్టూడియో సెట్లకే పరిమితమయ్యేవి. కథలు నగరాల చుట్టూ తిరిగేవి. భారతీరాజా కెమెరాను పల్లెల్లోకి తీసుకెళ్లారు. పొలాలు, చెరువులు, మట్టి దారులు, గ్రామీణ సంస్కృతి, సాధారణ మనుషుల జీవితాలు ఆయన చిత్రాల్లో ప్రధాన పాత్రలుగా మారాయి. గ్రామీణ జీవితాన్ని ఆయన కేవలం అందమైన నేపథ్యంగా చూపించలేదు. అక్కడి ప్రేమలను, బాధలను, కుల విభేదాలను, పేదరికాన్ని, ఆశలను, నిరాశలను అత్యంత సహజంగా ఆవిష్కరించారు. అందుకే భారతీరాజా సినిమాలను చూసినప్పుడు అవి కథలుగా కాకుండా మన చుట్టూ జరుగుతున్న జీవితాల్లా అనిపిస్తాయి. తమిళ సినిమాకు ఆయన తీసుకొచ్చిన ఈ వాస్తవికత ఒక విప్లవాత్మక మార్పుగా నిలిచింది. అందుకే ఆయనను అభిమానులు ప్రేమగా "మట్టివాసనల దర్శకుడు (మణ్ వాసనై ఇయక్కునర్)" అని పిలిచేవారు. పచ్చని పొలాలు, గాలికి ఊగే వరి పైర్లు, చెరువు గట్లు, పల్లె యువతీ యువకుల ప్రేమలు, కష్టాలతో నిండిన రైతు జీవితం, కులాల మధ్య సంఘర్షణలు, ప్రకృతితో మనిషి అనుబంధం... ఇవన్నీ భారతీరాజా చిత్రాల్లో కథానాయకులుగా మారాయి.
తొలి అడుగులు
1941 జూలై 17న తమిళనాడులోని థేని జిల్లాలోని అల్లినగరంలో జన్మించిన భారతీరాజా అసలు పేరు చిన్నస్వామి పెరియమాయత్తేవర్. రైతు కుటుంబంలో పెరిగిన ఆయన చిన్ననాటి నుంచే పల్లె జీవితాన్ని దగ్గరగా చూశారు. ఆ అనుభవాలే తరువాత ఆయన సినిమాలకు ప్రాణం పోశాయి. చదువు పూర్తయ్యాక తమిళనాడు విద్యుత్ శాఖలో ఉద్యోగం చేశారు. స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం ఉన్నప్పటికీ కళల పట్ల ఉన్న మక్కువ ఆయనను వేరే దారిలో నడిపించింది. ఉద్యోగం చేస్తూనే నాటకాలు రాసేవారు. వేదికలపై ప్రదర్శించేవారు. సాహిత్యం, సినిమా, నాటకరంగాలపై ఆయనకు అమితమైన ఆసక్తి ఉండేది. ఆ కలలే చివరకు ఆయనను చెన్నైకి తీసుకెళ్లాయి. చెన్నైలో ఆయన ఎన్నో అవమానాలు, తిరస్కారాలు ఎదుర్కొన్నారు. దర్శకుడు పుట్టన్న కనగాల్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేస్తూ సినిమా నిర్మాణంలోని ప్రతి అంశాన్ని నేర్చుకున్నారు. ఈ కాలంలోనే "మయిలు" అనే కథను రాశారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఆ కథను నిర్మాతలు మొదట తిరస్కరించారు. కానీ భారతీరాజా తన కథపై నమ్మకం కోల్పోలేదు. అదే కథ తరువాత "16 వయథినిలే"గా రూపుదిద్దుకుని 1977లో విడుదలైంది. కమల్ హాసన్, శ్రీదేవి, రజనీకాంత్ నటించిన ఆ చిత్రం తమిళ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఆ సినిమా తెలుగులో "పదహారేళ్ల వయసు" పేరుతో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఆ సినిమా విజయంతో భారతీరాజా పేరు ఒక్కసారిగా దక్షిణ భారతదేశమంతటా మార్మోగిపోయింది. తరువాత వచ్చిన "కిళక్కే పోగుం రైలు", "అలైగల్ ఓయ్వతిల్లై", "మణ్ వాసనై", "మొదల్ మరియాదై", "వేదం పుదితు", "కరుత్తమ్మ" వంటి చిత్రాలు ఆయనను ఒక ప్రత్యేక దర్శకుడిగా నిలబెట్టాయి. మహిళల జీవితం, కుల వివక్ష, బాల్య వివాహాలు, సామాజిక అసమానతలు, పేదరికం వంటి అంశాలను ఆయన తెరపైకి తీసుకొచ్చిన తీరు భారతీయ సినిమాకు కొత్త దృక్పథాన్ని అందించింది.
దర్శకుల దర్శకుడు
భారతీరాజా కేవలం విజయవంతమైన దర్శకుడు మాత్రమే కాదు; దక్షిణ భారతీయ సినిమా భాషను మార్చిన సృజనకర్త. అందుకే తమిళ సినీ ప్రపంచం ఆయనకు "ఇయక్కునర్ ఇమయం" అంటే "దర్శకుల ఎవరెస్ట్" అనే అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. సినీ విమర్శకులు ఆయనను "దర్శకుల దర్శకుడు", "గ్రామీణ సినిమాల పితామహుడు", "తమిళ సినిమా గ్రామీణ విప్లవకారుడు" అని అభివర్ణించారు. కమల్ హాసన్‌ను గ్రామీణ యువకుడిగా కొత్త కోణంలో చూపించిన దర్శకుల్లో భారతీరాజా ముందుంటారు. రజనీకాంత్‌లోని నటుడిని కూడా తొలినాళ్లలోనే ఆయన గుర్తించారు. 1985లో శివాజీ గణేశన్‌తో రూపొందించిన "మొదల్ మరియాదై" చిత్రం ఆ మహానటుడి కెరీర్లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కార్తిక్‌ను హీరోగా పరిచయం చేసి స్టార్‌గా తీర్చిదిద్దారు. రాధ, రేవతి, రజని, రేఖ, భానుప్రియ వంటి నటీమణులకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. సత్యరాజ్ వంటి నటుల్లోని నటనా వైవిధ్యాన్ని వెలికితీశారు. కొత్త నటీనటులు, రచయితలు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు కల్పిస్తూ ఒక తరం సినీ కళాకారుల ఎదుగుదలకు కారణమయ్యారు. గ్రామీణ ప్రేమకథలు, సహజమైన పాత్రలు, ప్రకృతితో మమేకమైన దృశ్యభాష, సామాజిక స్పృహతో కూడిన కథలు... ఇవన్నీ భారతీరాజా సినిమాలకు ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. బాలా, అమీర్, చేరన్, శశికుమార్, సీను రామసామి వంటి దర్శకుల చిత్రాల్లో ఆయన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగులో బి. నర్సింగరావు, వంశీ, శేఖర్ కమ్ముల వంటి దర్శకుల పనిలో కూడా ఆయన వేసిన బాట ప్రతిధ్వనిస్తుంది. సినిమా విద్యార్థులకు భారతీరాజా చిత్రాలు ఒక పాఠశాల వంటివి. ఆయన చిత్రాలు ఆరు జాతీయ చలనచిత్ర పురస్కారాలను గెలుచుకున్నాయి. "మొదల్ మరియాదై", "వేదం పుదితు", "కరుత్తమ్మ", "అంతిమంతారై" వంటి చిత్రాలు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాయి. 2004లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
తెలుగు సినిమాతో అనుబంధం
భారతీరాజాకు తెలుగు సినిమాతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ‘కొత్త జీవితాలు’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన, ఆ తర్వాత పలు విలక్షణ చిత్రాలను తెరకెక్కించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. 1977లో వచ్చిన ‘16 వయథినిలే’ తెలుగులో ‘పదహారేళ్ల వయసు’ పేరుతో విడుదలై మంచి ఆదరణ పొందింది. 1981లో వచ్చిన ‘సీతాకోకచిలుక’ తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ప్రేమకథగా గుర్తింపు పొందింది. జాతీయ అవార్డును గెలుచుకుంది. అదే చిత్రానికి భారతీరాజా ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. అనంతరం ‘ఆరాధన’, ‘జమదగ్ని’ వంటి చిత్రాలను నేరుగా తెలుగులో తెరకెక్కించి తన సృజనాత్మక దృష్టిని చాటుకున్నారు. ‘మంగమ్మగారి మనవడు’ చిత్రానికి కథను, ‘పల్నాటి పౌరుషం’కు స్క్రీన్‌ప్లేను అందించారు. ఆయన తమిళ చిత్రాల్లో అనేకం తెలుగులోకి అనువాదమై ఇక్కడ కూడా విజయవంతమయ్యాయి. గ్రామీణ జీవితాన్ని సహజత్వంతో చిత్రీకరించడం, ప్రకృతిని కథలో అంతర్భాగంగా మలచడం, పాత్రల భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలు తరువాతి తరాల తెలుగు దర్శకులపై గణనీయమైన ప్రభావం చూపాయి.
భారతీరాజా కన్నుమూశారన్న వార్త భారతీయ సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది. ఎనిమిది దశాబ్దాలకు పైగా సాగిన ఆయన జీవితం, దాదాపు అయిదు దశాబ్దాల సినీ ప్రయాణం భారతీయ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతాయి. దర్శకులు ఎందరో వస్తారు. కానీ ఒక తరం సినిమా చూసే దృష్టిని మార్చినవారు చాలా అరుదు. భారతీరాజా అలాంటి అరుదైన సృష్టికర్త. మట్టిలోంచి కథలను తవ్వి, వాటికి కవిత్వం జోడించి, వెండితెరపై చిరస్థాయిగా నిలిపిన మహా కథకుడాయన. భారతీయ సినిమా చరిత్రలో ఆయన పేరు ఎప్పటికీ నిలిచి ఉంటుంది.
- శాంతిమిత్ర









కామెంట్లు (0)