ఉష్ణోగ్రతలు పెరగడం, వడగాల్పులు, ఆరోగ్య సమస్యలను ప్రస్తావిస్తూ ఎన్నో నివేదికలు వచ్చాయి. అయితే పెరుగుతున్న వేడి గాలులు నాలుగు గోడల మధ్య నలిగిపోతున్న కుటుంబాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? ఎండలో పనులు చేస్తున్న వారి ఆర్థిక, శారీరక, మానసిక పరిస్థితులను ఏ విధంగా మారుస్తున్నాయి? అనేది ఎవరూ కచ్చితంగా అంచనా వేయలేరు. కనీసం ఆ బాధను అనుభవిస్తున్న వారు తమ అనుభవాలను స్వయంగా నమోదు చేస్తున్నారా? అంటే... అదీ చెప్పలేం. ఆ లోటును గుర్తించిన ఢిల్లీకి చెందిన 'గ్రీన్‌పీస్' అనే ఓ ప్రైవేటు సంస్థ నగరంలోని ఇరుకు గదుల్లో నివసించే వారితో 'గర్మీ ఖాతా' పేరుతో డైరీలు రాయించింది. ఆ డైరీల్లో సామాన్యులు స్వయంగా రాసిన ప్రతి అక్షరం... వాతావరణ మార్పులు జీవితాలను ఎంతలా అతలాకుతలం చేశాయో చెప్పడానికి నిదర్శనంగా నిలిచింది.
తూర్పు ఢిల్లీ సుందర్ నగరి స్లమ్ ఏరియాలో రెండు, మూడు అంతస్తుల భవనాలు అగ్గిపెట్టెల మాదిరిగా వరుసగా ఉంటాయి. ఆ భవనాల్లో ఒక గదిలో 25 ఏళ్ల పూజ ఎనిమిది మంది కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది. తనకిచ్చిన హీట్ డైరీలో ఆమె ఇలా రాసుకుంది. "బయట 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మా ఇంట్లో కూడా అదే పరిస్థితి ఉంది. తేడా ఏమీ లేదు."
పూజ ఉంటున్న గదిలో సీలింగ్‌కు అమర్చిన ఫ్యాన్ పగుళ్లను ప్లాస్టర్‌తో కవర్ చేశారు. ఆ ఫ్యాన్ తలకు తగులుతున్నంత ఎత్తులోనే ఉంది. ఆ గదిలోకి గాలి, వెలుతురు వచ్చే వీలు లేదు. ఆ గది కొన్ని సార్లు లివింగ్ రూమ్‌గా, రాత్రుళ్లు బెడ్‌రూమ్‌గా, ఇంకొన్ని సార్లు ఒకేసారి అన్ని పనులు చేసుకునేలా మారిపోతుంది. గదిలో ఓ మూల సోఫా, మరో మూల స్టడీ టేబుల్ ఉన్నాయి. ఇంకా మొత్తం కుటుంబానికి అవసరమైన సామగ్రి అంతా అక్కడే పెట్టుకున్నారు. వేసవి వేడిలో భవన నిర్మాణరంగ పనికి వెళ్లడం కష్టంగా ఉండి పూజ తండ్రి చాలారోజులు పనికి వెళ్లలేదు. సైకిల్‌పై రోజూ పనికి వెళ్లే అతను ఒకసారి కళ్లు తిరిగి పడిపోయినట్లు కూడా పూజ డైరీలో రాసుకుంది. మందులకు డబ్బులు ఖర్చవుతాయని ఒక రోజు సెలవు తీసుకుని అతను పనికి వెళ్లిన సంగతి కూడా రాసింది.
2023లో ఢిల్లీ గణాంక హ్యాండ్‌బుక్‌లో ప్రస్తావించిన అంశాల ప్రకారం... పూజలాంటి ఒకే గదిలో నివసించే కుటుంబాలు ఢిల్లీ మొత్తం నివాసితుల్లో 32.2 శాతం ఉన్నాయి. వాతావరణ పారామీటర్లను అంచనా వేసే కేంద్రాలు ఢిల్లీలో ఐదు మాత్రమే ఉన్నాయి. అవి కూడా పచ్చని, విశాలమైన ప్రభుత్వ స్థలాల్లో ఉన్నాయి. ఈ కేంద్రాలు ఒకే గదిలో రేకుల కప్పులున్న ఇరుకైన ఇళ్లల్లో నివసించే వారి జీవన అనుభవాలను అంచనా వేయలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే 'గ్రీన్‌పీస్' ముందుకు వచ్చింది. మే నెల నుంచి ఢిల్లీ వ్యాప్తంగా సుందర్ నగరిలోని 20 కుటుంబాలు, ఇతర ప్రాంతాల్లో 50 మంది నివాసితులతో సర్వే ప్రారంభించింది. నివాసితులకు ఒక డైరీని ఇచ్చి అందులో తమ దైనందిన జీవితాలను అధిక ఉష్ణోగ్రతలు ఎలా ప్రభావితం చేస్తున్నాయో రాయమని చెప్పింది.

డైరీ ఉద్దేశం ఇది...
వాతావరణ కేంద్రాలు సేకరించే సమాచారం ఆస్పత్రి రికార్డులపైనే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ లోపించిన వివరాలను ప్రత్యక్ష సాక్ష్యాలతో నమోదు చేయడమే ఈ డైరీ ఉద్దేశం. ఇందులో 9 ప్రశ్నలను ఉంచారు. వాటి సాయంతో ఆరోగ్యం, పని, నిద్ర, ఇంటి పనులను అధిక వేడి ఎలా ప్రభావితం చేస్తుందో ఇందులో పాల్గొనే వారు రాస్తున్నారు. 16 ఏళ్ల నస్రీన్ ఇలా రాసింది. "వేడి కారణంగా తన తండ్రి పదే పదే పనికి వెళ్లకపోవడంతో ఫ్యాక్టరీ జీతం తగ్గించి ఇచ్చింది. దీంతో ఈద్ వేడుకలు జరుపుకోవడానికి తమ కుటుంబం చాలా ఇబ్బంది పడింది." సుందర్ నగరిలో కూరగాయల బండి నడిపే 22 ఏళ్ల రాజు ఇలా రాశాడు. "వేడి కారణంగా టమోటాలు త్వరగా పాడైపోయాయి. దీంతో ఎక్కువ ధరకు తక్కువ పరిమాణంలో వాటిని కొనుక్కోవాల్సి వచ్చింది." వేడి కారణంగా రాజు వాళ్ల అమ్మ, అమ్మమ్మ బయటకు వెళ్లి కూరగాయలు అమ్మలేకపోయారు.
ఇంకా ఏమున్నాయంటే...
భర్త, ఇద్దరు పిల్లలతో ఒకే గదిలో నివసిస్తున్న రేష్మ ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం సీలింగ్ ఫ్యాన్ వేసినప్పుడు "ఊపిరి ఆడడం లేదు" అని రాసుకుంది. "ఫ్యాన్ వేడి గాలిని తిప్పడం మొదలుపెట్టగానే నేను గుమ్మం దగ్గర కూర్చుని ఊపిరి పీల్చుకోవడానికి ప్రయత్నిస్తాను. రాత్రి పూట తలుపులు మూసివేసినప్పుడు కూడా ఆ పరిస్థితే ఉంటోంది" అని రాసుకుంది. ప్రతి వేసవిలో తనకు రక్తపోటు ఎక్కువవుతోందని కూడా గుర్తించింది. నిద్ర పట్టక నిద్ర మాత్రలు వేసుకుంటున్న విషయాన్ని కూడా డైరీలో ప్రస్తావించింది. "నీళ్లు తాగడానికి పదే పదే లేవడం వల్ల వేసవి రాత్రుళ్లు సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను" అని కూడా డైరీలో నమోదు చేసింది. రేష్మ చెప్పిన ఈ కష్టాలన్నీ ఆమె కూతుళ్లు డైరీలో రాశారు.
నస్రీన్, రేష్మ, రాజు ప్రస్తావించిన ప్రతి కష్టం ఢిల్లీ వాసులకే పరిమితం కాదు. చాలీచాలని ఇరుకు గదుల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరిదీ. 'గ్రీన్‌పీస్ ఇండియా' వాతావరణ, ఇంధన విభాగ ప్రచారకర్త ఆకిజ్ ఫరూక్ దీని గురించి మాట్లాడుతూ... "అధిక ఉష్ణోగ్రతలు మానవ హక్కులకు సంబంధించిన అంశం. ప్రజలను విపరీతంగా ప్రభావితం చేసే ఈ విషయంలో వ్యక్తిగత అనుభవాలకు చోటు లేకుండా పోతోంది. ఆ లోటు భర్తీ చేయాలంటే ప్రతి ఒక్కరూ తరచూ తాము ఎదుర్కొంటున్న సమస్యలను నమోదు చేయాలి" అంటున్నారు.
అయితే మారుతున్న వాతావరణం గురించి కలత చెందే ప్రతి ఒక్కరూ ఆ మార్పును, దాని పర్యవసానంగా ప్రభావితమవుతున్న జీవితాలను నమోదు చేయడంతో పాటు, ప్రత్యామ్నాయ విధానాల వైపు అడుగులు వేయాలి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని గణాంకాలు కొంతవరకే చెప్పగలవు. కానీ పూజ, నస్రీన్, రాజు, రేష్మ వంటి వారి డైరీల్లో నమోదైన అనుభవాలే ఆ గణాంకాలకు జీవం పోస్తాయి. అందుకే మారుతున్న వాతావరణాన్ని నమోదు చేయడంతో పాటు, దాని వల్ల మారిపోతున్న జీవితాలనూ నమోదు చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి అనుభవాలే సమస్య తీవ్రతను సమాజానికీ, పాలకులకూ మరింత స్పష్టంగా తెలియజేస్తాయి. అప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి.









కామెంట్‌లు (0)