mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆంక్షల చెర!

2 గంటల క్రితం

fcra
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 06:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

విపత్తులొచ్చినపుడు బాధితులకు ఆసరానివ్వడం, పేదలకు వైద్య సేవలు, విద్యా సౌకర్యాలు అందజేయడంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు విశేష కృషి చేస్తున్నాయి. అలాంటి స్వచ్ఛంద సంస్థలపై, ముఖ్యంగా విదేశీ నిధులతో పనిచేసే వాటిపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం దారుణం. ఎఫ్‌సిఆర్‌ఎ సవరణ నిబంధనలు-2026 ద్వారా అమలు చేస్తున్న మార్గదర్శకాలు కేవలం నిబంధనావళి మాత్రమే కాదు, స్వచ్ఛంద రంగాన్ని క్రమంగా నిర్వీర్యం చేయాలన్న వ్యూహం దాని వెనుక ద్యోతకమవుతోంది.

విదేశీ విరాళాల నియంత్రణ కేంద్ర ప్రభుత్వ చట్టబద్ధమైన విధి. ఎఫ్‌‌సిఆర్‌ఎ చట్టం ద్వారా నియంత్రిస్తుంది. నియంత్రణ అనేది స్వచ్ఛంద, ధర్మబద్ధ, విద్యా సంస్థలు, మానవతా సేవా సంస్థల మనుగడను నిరోధించే ఆయుధంగా మారకూడదు. గత పదేళ్లలో ఎఫ్‌సిఆర్‌ఎ చట్టం అనేకసార్లు ప్రయోగించారు. 20 వేలకు పైగా సంస్థల నమోదులు రద్దయ్యాయి.

అనంతపురం జిల్లాలోని ప్రముఖ సేవా సంస్థ ‘ఆర్‌‌టిడి’ నిధులను స్తంభింపజేసి ప్రజల నుండి ఒత్తిడి రావడంతో వెనక్కి తగ్గింది. ప్రముఖ పాత్రికేయుడు, న్యూస్‌‌క్లిక్‌ ఎడిటర్‌ ‌ప్రబీర్‌ ‌పుర్కాయస్థను ఎఫ్‌‌సిఆర్‌ఎ నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగంతోనే ఏళ్ల తరబడి నిర్బంధించారు. తప్పుడు కేసులు పెట్టారని, ప్రబీర్‌ ఎఫ్‌‌సిఆర్‌ఎ చట్ట ప్రకారం అన్ని నిబంధనలను అమలు చేశారని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్న విషయం జగమెరిగిందే! ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలిచిన వారిని వేధించడానికి ఎఫ్‌‌సిఆర్‌ఎ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారనడానికి ఇది ప్రబల నిదర్శనం. పార్లమెంటులో సిపిఎం రాజ్యసభ సభ్యులు డాక్టర్ జాన్ బ్రిట్టాస్ ఎఫ్‌‌సిఆర్‌ఎ గురించి అనేకసార్లు ప్రశ్నించినా ప్రభుత్వం నుండి జవాబు కరువైంది. ‘రహస్య స్వభావం’ అంటూ సమాచారమివ్వలేదు. పారదర్శకతకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. అయితే ఈ కఠిన నిబంధనలు ప్రభుత్వాన్ని సమర్ధించే సంస్థలకు వర్తించవు. అసలు తమకు గుర్తింపు అవసరమే లేదని ధిక్కరిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ కు ఈ నిబంధనలు కల్పతరువుగా మారుతున్నాయి. వారు నిర్నిబంధంగా వ్యవహరిస్తుండగా అనేక సేవా సంస్థలు నష్టపోనున్నాయి. గత నెలలో బెంగళూరు పోలీసులు ‘టిటిఐ’ సంస్థ ఎఫ్‌‌సిఆర్‌ఎ నమోదు లేకుండా విదేశీ నిధులు స్వీకరించి, వాటిని మతపరమైన కార్యక్రమాలకు వినియోగించిందని దర్యాప్తు చేస్తున్నారు. గిరిజన, దళిత, మైనారిటీ తరగతులకు సేవలందిస్తున్న వందలాది సంస్థలు ఈ కొత్త నిబంధనల వల్ల ఆందోళనకు గురవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత కోసం కృషి చేసే సంస్థలను నేరగాళ్లుగా చిత్రీకరించడం తగునా?

కొత్త సవరణల్లో అత్యంత ప్రమాదకరమైన అంశం 'మత మార్పిడి' అనే పదాన్ని షెడ్యూల్‌లో చొప్పించడం. అయితే 'మత మార్పిడి' అనే పదానికి ఎఫ్‌సిఆర్‌ఎ చట్టంలో గాని, నిబంధనల్లో గాని, భారతీయ చట్ట చరిత్రలో గాని స్పష్టమైన నిర్వచనమే లేదు! అర్థం స్పష్టంగా లేని పదం చట్టంలో చేరినపుడు అది అధికారుల ఇష్టారాజ్య వివక్షకు దారితీస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రతి వ్యక్తికి మత స్వాతంత్ర్యాన్ని హామీ ఇస్తోంది. ఆ హక్కుపై ఆంక్షలు విధించాలంటే చట్టం సుస్పష్టంగా ఉండాలి. కానీ ఈ సవరణ అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఈ నిబంధనలు ఆర్థిక జవాబుదారీతనాన్ని మించి సంస్థల కదలికపై నిఘాను పెంచుతున్నాయి. సంస్థ నిర్వహిస్తున్న వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాలు, ప్రచురించిన రచనలు, నాయకుల వ్యాసాలు వీటన్నింటి వివరాలు ప్రభుత్వానికి సమర్పించాలి. ఇది కేవలం ఆర్థిక పారదర్శకత కాదు.. ఇది నిస్సందేహంగా మేధో నిఘా!

జస్టిస్ కెఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగపు ఆర్టికల్ 21 కింద గోప్యత ఒక ప్రాథమిక హక్కు, జీవించే హక్కుకు సంబంధించిన ముఖ్య భాగమని స్పష్టం చేసింది. ఏ ప్రభుత్వ జోక్యమైనా చట్టబద్ధత, ఆవశ్యకత, అనుపాతికత (ప్రపోర్షనాలిటీ) అనే పరీక్షలను తట్టుకోవాలని తీర్పు చెప్పింది. ఒక సంస్థ ఏ రాష్ట్రంలో పనిచేయాలో, దేనికోసం నిధులు ఖర్చు చేయాలో ముందుగానే చెప్పాలని సర్కారు వారి ఆదేశం. అయితే వరదలు, భూకంపాలు, తుపానులు, మహమ్మారులు ఎక్కడ వస్తాయో అడిగి వస్తాయా? ఇది అత్యవసర సేవలను ప్రజలకు దూరం చేయడం కాదా! ఈ సవరణలు రాజ్యాంగంలోని 14, 19(1)(సి), 25, 26, 29, 30 అధికరణలను ఉల్లంఘించే స్వభావాన్ని కలిగి ఉన్నాయని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. విద్య, ఆరోగ్యం, మానవతా సేవలు, సాంఘిక సేవా రంగాల్లో పని చేసే సంస్థలపై, ముఖ్యంగా అల్ప సంఖ్యాక వర్గాల సంస్థలపై ఈ సవరణల ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణుల మాట. దశాబ్దాలుగా దేశ సంక్షేమంలో భాగస్వాములైన స్వచ్ఛంద సంస్థలను ఊపిరాడకుండా చేయడం ప్రజాస్వామ్య ధర్మం కాదు. దేశంలోని వివిధ స్వచ్ఛంద సంస్థలను పూర్తిగా తన అదుపాజ్ఞలలోకి తెచ్చుకోవాలన్న దుర్బుద్ధితోనే కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌‌సిఆర్‌ఎ నిబంధనల్ని ఆయుధాలుగా వాడుకుంటున్నది. ఇటువంటి నిరంకుశ నిబంధనలను ప్రజలు నిరసించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి!

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్