మూడేళ్లుగా ఆ పిల్లలు భయంకర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. బాంబు దాడులు, కుప్పకూలుతున్న భవంతులు, రక్తమోడుతున్న శరీరాలు, అశువులు బాస్తున్న ఆప్తులు.. ఇవే వారికి నిత్యం కనిపిస్తున్న దృశ్యాలు.. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా.. ఆ పిల్లలు ఓ కల కంటున్నారు. అది చదువు కల. అది నెరవేర్చుకోవడం కోసం ముక్కలు ముక్కలుగా పెచ్చులూడిపోయిన భవన సముదాయాల్లోనే పాఠాలు వల్లెవేస్తున్నారు. బాంబుదాడులకు తోడు కుప్పలుగా పేరుకుపోయిన చెత్తలో పెరుగుతున్న సూక్ష్మజీవులు, ఎలుకలు, దోమలు, ఈగలు, పందికొక్కులు.. వారి ఆరోగ్యాన్ని దెబ్బతీసి, వాళ్లకు చదువును దూరం చేయాలని శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. అయినా ఆ పిల్లలు పట్టు వదలడం లేదు. పగలంతా నీళ్ల కోసం, రొట్టె కోసం గంటలు గంటలు ప్రాకులాడుతున్నా రాత్రుళ్లు విధిగా సోలార్ లైట్ల కాంతిలో పుస్తకం తెరిచి చదువుకుంటున్నారు. శిథిలాలు, బాంబుదాడులు, మరణశయ్యల ఆవల ప్రపంచాన్ని చూపించే ఏకైక సాధనం చదువు అని వాళ్లు బలంగా నమ్ముతున్నారు.
గతేడాది అక్టోబరు నుండి గాజాలో సీజ్ ఫైర్ అమలవుతోంది. కానీ ఇజ్రాయిల్ దాడుల్లో ఇప్పటికి 229 మంది చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మొత్తం మూడేళ్ల కాలంలో 21 వేల మందికి పైగా అశువులు బాశారు. అంతకు రెట్టింపు సంఖ్యలో దాడుల్లో అవయవాలు తెగిపడి వైకల్యం బారిన పడ్డారు. అనాథలైన పిల్లలు, వృద్ధుల సంరక్షణలో జీవచ్ఛవాల్లా బతుకుతున్న చిన్నారులు గాజాలో ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు.
గాజా ప్రపంచంలో అత్యధిక జనాభా సాంద్రత కలిగిన ప్రదేశాలలో ఒకటి. తాజా పరిస్థితుల్లో గాజాలో మిగిలి ఉన్న 40 శాతం స్థలంలోనే మొత్తం జనాభా కిక్కిరిసిపోయారు. ఆ నగరంలో ఎక్కడ చూసినా భవన వ్యర్థాలతో కుప్పలు కుప్పలుగా చెత్త పేరుకుపోయింది. పేరుకుపోయిన చెత్తలో ఎలుకలు, బొద్దింకలు, ఈగలు, పేలు, నల్లులు విరివిగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితిలో శిబిరాల అంతటా గజ్జి, ఆటలమ్మ, తామర వంటి చర్మ వ్యాధుల వ్యాప్తి తీవ్రమవుతోంది. ఇటీవలి కాలంలో, ఎలుకల కాటు కేసులు కూడా విపరీతంగా పెరిగాయి. కేవలం 2026లోనే 70 వేలకు పైగా ఎలుకలు, బాహ్య పరాన్నజీవుల కేసులు నమోదయ్యాయి. అవసరమైన మందుల లభ్యత పరిమితంగా ఉండటం వల్ల అన్ని కేసులకు స్పందించడం కష్టంగా ఉంది.
ఈ పరిస్థితుల్లోనే చదువు
ఇలాంటి వాతావరణంలోనే 11 ఏళ్ల కాదీ రాత్రుళ్లు సోలార్ దీపం వెలుగులో చదువుకుంటోంది. ఆ బాలిక ఉంటున్న గది ఒక పక్క గోడ పూర్తిగా కూలిపోయింది. టార్పాలిన్‌తో దాన్ని మూసి ఉంచారు. గది చుట్టూ తెరిచిన కిటికీల మాదిరి చాలా చోట్ల ఖాళీ ఉంది. విరిగిపోయిన బల్లలు, కుర్చీలు, దుమ్ము పట్టిన బట్టలు, వస్తువులు చుట్టూ ఉన్నాయి. కాదీ అవేమీ పట్టించుకోకుండా ఎంతో ఏకాగ్రతగా పుస్తకంలో పాఠం చదువుకుంటోంది. ఆ పిల్ల వంక తదేకంగా చూస్తున్న కాదీ నాన్న మిర్హట్ అల్ హమాల్వి 'గాజాలో పిల్లలు బాల్యంలో ఉండే సున్నితత్వాన్ని కోల్పోయార`ని చెబుతున్నారు. 'వాళ్లు ఆటలాడడం, ఆలోచించడం వంటి సాధారణ పనులను ఎప్పటి నుండో ఆపేశారు. కుటుంబానికి సరిపోయే నీళ్లు, ఆహారం ఎక్కడ దొరుకుతుందనే ఇప్పుడు గాజాలో పిల్లలు ఆలోచిస్తున్నారు. ఈ ఆకలి బాధను మేము మా పిల్లలకు కొన్ని తరాల వరకు పరిచయం చేయాల్సిన దారుణ పరిస్థితులు ఉన్నాయి` అని మిర్హట్ ఎంతో ఆవేదనగా అంటున్నాడు.

ఇంటికి వెళ్లమన్నా వెళ్లడం లేదు..
గాజాలో పిల్లలు ఆడుకునే స్థలాలు ఇప్పుడు శ్మశానవాటికల్లాగా మారిపోయాయి. గతంలో వారు చదువుకున్న పాఠశాల గదులు నామరూపాలు లేకుండా ఉన్నాయి.
స్కూలు పరిస్థితి గురించి గాజా సిటీలో ఓ గుడారంలో స్కూలు నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ ఇనామ్ హిలాల్ ఇలా చెబుతున్నారు. ‘పిల్లలు కూర్చొనేందుకు ఇక్కడ బల్లలు లేవు. నేలపైనే కూర్చుంటున్నారు. వానలు పడినప్పుడు గది అంతా నీళ్లు నిండిపోతున్నాయి. అప్పుడు పిల్లలను ఇళ్లకు వెళ్లిపొమ్మని చెబుతున్నాం. అయినా పిల్లలు ఇక్కడి నుండి కదలడం లేదు. బెంచీలు లేకపోయినా కుర్చీలో కూర్చునైనా నేర్చుకునేందుకు సిద్ధపడిపోతున్నారు.’
97 శాతం పాఠశాలలు కూల్చేశారు..
గాజాలోని స్కూలు భవనాలను లక్ష్యంగా చేసుకుని కూడా ఇజ్రాయిల్ దాడులు చేసింది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం గాజాలో 97 శాతం పాఠశాల భవనాలు దెబ్బతిన్నాయి. అందులో కొన్ని పూర్తిగా కూలిపోయాయి. ఒకప్పుడు వందల్లో పిల్లలు చదువుకున్న ఆ స్కూళ్లు, ఇప్పుడు ఒక్క 100 మంది పిల్లలు చదువుకునేందుకు కూడా సిద్ధంగా లేవు. ఐక్యరాజ్య సమితి తెలిపిన వివరాల ప్రకారం ‘బడికి వెళ్లేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నా నిర్వహణ సామర్థ్యం లేక పిల్లలు ప్రతి రోజూ స్కూలుకు వెళ్లలేకపోతున్నారు. వారంలో మూడు రోజులు, అదీ కొన్ని గంటలు మాత్రమే వాళ్లు చదువుకునే వీలు ప్రస్తుతం అక్కడ ఉంది. గాజాలో ఇంకా అనేకమంది పిల్లలు స్కూలు వైపు రావడం లేదు’.
స్కూలుకు రాకుండా ఏం చేస్తున్నారు..!
స్కూలుకు రావాల్సిన సమయంలో ఆ పిల్లలు ఏం చేస్తున్నారో ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్స్ ఫండ్ ప్రతినిధి జేమ్స్ ఎల్డర్ ఇలా చెబుతున్నారు. ‘ఆ సమయంలో పిల్లలు నీళ్లు తెచ్చుకోవడం కోసం బారులు తీరిన లైన్లల్లో నుంచొంటున్నారు. ఒక ప్లేటు ఆహారం కోసం గుంపుతో కలిసిపోయి దీనంగా అభ్యర్థిస్తున్నారు`. ఈ పరిస్థితులన్నీ ప్రపంచంలో ఏ పిల్లలూ అనుభవించని దైన్యమైన బాల్యాన్ని గాజా పిల్లలకు పరిచయం చేస్తున్నాయి. దాడులు, హింస, ఒక చోటు నుండి వేరే చోటుకు వలసలు, తాత్కాలిక గుడారాల్లో నివసించడం వంటి పరిస్థితుల్లో కాంతి కోసం రాత్రి పూట గదిలో వెలిగించుకున్న ఓ చిరుదీపం వాళ్ల ఆశను ప్రపంచానికి చూపిస్తోంది.
‘కాదీ’ ఆశ.. గాజా పిల్లలందరిదీ..
‘అమ్మకు వంటలో సాయం చేయడంతో నా దినచర్య మొదలవుతుంది. ప్రస్తుతం నేను స్నేహితులతో గడిపే తీరిక లేని రోజులు అనుభవిస్తున్నాను. పగలంతా పరిశుభ్రమైన నీళ్లు, ఆహారం కోసం వెతకడంతోనే సరిపోతుంది. ఒక్కోసారి రాత్రి బాగా పొద్దుపోతోంది కూడా! అప్పుడు కూడా నేను చదువుకుంటున్నాను. నాకు ప్రయాణించడం అంటే చాలా ఇష్టం. అంతకంటే ముందు గాజాను సురక్షితంగా చేయడం నా కోరిక`.. అంటున్న కాదీ గాజాలో చదువుకుంటున్న ఎందరో పిల్లలకు ప్రతిబింబం. ఆ పిల్లల చదువు ఆశ నెరవేరాలంటే.. ప్రపంచమంతా ఏకమై దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్న ప్రతి చిన్నారి చేయి పట్టి ఉజ్వల భవిత వైపు అడుగులు వేయించాలి.








కామెంట్లు (0)