పర్యావరణానికి మేలు, మనిషికి బలం, సమాజానికి స్ఫూర్తి. ఇవన్నీ ఒకేసారి అందించే సాధనం సైకిల్. ఉరుకులు, పరుగుల జీవితంలో మరిచిపోతున్న ఆరోగ్యాన్ని గుర్తుచేస్తూ ‘అమరావతి రన్నర్స్’ సంస్థ వేల మందిలో ఫిట్‌నెస్‌పై చైతన్యం నింపుతోంది. “రన్ మైల్స్, స్ప్రెడ్ స్మైల్స్” నినాదంతో వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్‌ను జీవనశైలిగా మార్చుకోవాలని ప్రోత్సహిస్తోంది. వాహనాల వినియోగం పెరిగి శారీరక శ్రమ తగ్గుతున్న ఈ కాలంలో రోజూ కొంత సమయాన్ని నడక, పరుగు, సైక్లింగ్‌కు కేటాయించాలని ఈ సంస్థ సూచిస్తోంది. వ్యాయామంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించడంలోనూ ఇవి దోహదపడతాయని సభ్యులు చెబుతున్నారు.
విజయవాడ కేంద్రంగా 2016లో ఐదుగురితో ప్రారంభమైన ‘అమరావతి రన్నర్స్’లో ప్రస్తుతం 500 మందికి పైగా సభ్యులు ఉన్నారు. రన్నర్లు, వాకర్లు, సైక్లిస్టులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. రాష్ట్రంలోని వివిధ నగరాల్లో నడక, పరుగులు, సైక్లింగ్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరి ప్రోత్సాహంతో వేల మందికి ఉదయం నడక అలవాటైంది. వందల మంది జాతీయ, అంతర్జాతీయ మారథాన్లలో పాల్గొనే స్థాయికి చేరుకున్నారు. ఫిట్‌నెస్‌తో పాటు సామాజిక స్పృహ పెంపొందించడంపై కూడా ఈ సంస్థ దృష్టి సారిస్తోంది. మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణ, రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు వంటి అంశాలపై సైకిల్ ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. “ప్రతి రైడ్ ఫిట్‌నెస్‌కు మించిన సందేశాన్ని వ్యాప్తి చేస్తోంది. ప్రజల్లో సైక్లింగ్‌పై ఉన్న అపోహలను తొలగించి ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహిస్తున్నాం” అని అమరావతి రన్నర్స్ కార్యక్రమ నిర్వాహకులు నిషికాంత్ నర్రా తెలిపారు. “సైక్లింగ్ ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా వాయు కాలుష్యం, ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. ఇంధన వ్యయాన్ని కూడా ఆదా చేస్తుంది” అని సంస్థ అధ్యక్షులు రమేష్ రావి చెప్పారు.








కామెంట్‌లు (0)