mh ad
సోమవారం, 22 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కొడుకు ఆచూకీ కోసం...

2 గంటల క్రితం

saikrishna case
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 22, 2026, 06:30 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

​"నా బిడ్డను అరెస్టు చేసి ఉంటే ఎక్కడున్నాడో చెప్పండి. ఒక్కసారి చూసి వస్తాను. మీరు కొట్టి చంపేసి ఉంటే శవాన్నైనా ఇవ్వండి. చివరి చూపు చూసుకుంటాను. కాల్చేసి ఉంటే కనీసం బూడిదైనా ఇవ్వండి. కర్మకాండలు చేసుకుంటాను..." విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె విజయలక్ష్మి నోటివెంట వస్తున్న ఈ మాటలు కేవలం ఒక తల్లి రోదన మాత్రమే కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థ ముందు నిలిచిన ఒక ప్రశ్న. తన 23 ఏళ్ల కుమారుడు సాయికృష్ణ ఆచూకీ కోసం నలభై రోజులకుపైగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన ఒక కన్నతల్లి ఆవేదన.


కష్టాలు ఆమెకు కొత్తవి కావు. అయినా తన కుమారుడు ఫుడ్ డెలివరీ పని చేస్తూ జీవితం గడుపుతున్నాడనే ధైర్యం ఆమెకు ఉండేది. కానీ ఒకరోజు అతడు పోలీసుల అదుపులోకి వెళ్లాడని తెలిసిన తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. తన కొడుకు ఎక్కడున్నాడో చెప్పమని, ఒక్కసారి చూపించమని, కనీసం మాట్లాడనివ్వమని వేడుకున్నా సమాధానం దొరకలేదని ఆమె వాపోతున్నారు.

నలభై రోజుల నిరీక్షణ...

"మే 5న కృష్ణలంక సీఐ నాగరాజు పంపించారని చెప్పుకుంటూ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, స్థానిక పోలీసులు మా ఇంటికి వచ్చారు. నా కొడుకు ఇక్కడ లేడని, మార్గాపురంలో అద్దెకు ఉంటూ ఫుడ్ డెలివరీ పని చేస్తున్నాడని చెప్పా. అయినా నన్ను స్టేషన్‌కు తీసుకెళ్లారు. కానిస్టేబుళ్లు అశోక్, బాబూరావు, సీఐ జీపు డ్రైవర్, శివకుమార్ అనే వ్యక్తులు నన్ను తీసుకెళ్లారు. దారిలోనే నా ఫోన్ తీసుకున్నారు. అదే రోజు నా కొడుకును తీసుకొచ్చారు. అతడి స్నేహితులు నలుగురిని కూడా స్టేషన్‌కు తీసుకొచ్చారు. తర్వాత వారిని రిమాండ్‌కు పంపారు. కానీ నా కొడుకును మాత్రం పంపలేదు" అని విజయలక్ష్మి చెబుతున్నారు.

"అప్పటి నుంచి నా జీవితం పోలీస్ స్టేషన్ చుట్టూనే తిరిగింది. రోజూ వెళ్లేదాన్ని. కనిపించిన ప్రతి పోలీసునీ 'మా అబ్బాయి ఎక్కడ?' అని అడిగేదాన్ని. 'ఒక్కసారి మాట్లాడనివ్వండి', 'ఒక్కసారి చూపించండి', 'మీ కాళ్లు పట్టుకుంటా' అని వేడుకున్నా ప్రయోజనం లేకపోయింది. 'ఉన్నాడు... పంపిస్తాం' అనేవారు. కానీ చూపించేవారు కాదు. ఒకరోజు సీఐ నాగరాజు 'మీ వాడిని చంపేస్తున్నాం... దండ రెడీ చేసుకో' అని అన్నాడు. ఆ మాట విన్న తర్వాత కూడా నా కొడుకు బతికే వస్తాడేమోనని ఎదురు చూశా" అని ఆమె కన్నీటి పర్యంతమవుతున్నారు.

​"స్టేషన్‌లో ఉన్న నా కొడుకు స్నేహితులను అడిగితే బాగా కొట్టారని, కాళ్ల గోళ్లు పీకేశారని, చిత్రహింసలు పెట్టారని చెప్పారు. ఒకసారి స్టేషన్‌లో ఇద్దరు వ్యక్తులు రక్తసిక్త స్థితిలో ఒక యువకుడిని మోసుకెళ్తుండగా చూసా. అతడే నా కొడుకేమోనని ఏడ్చా. చూపించలేదు. 'కనీసం ఫోన్ అయినా చేయించండి. ఒక్క మాటనైనా మాట్లాడనివ్వండి' అని వేడుకున్నా ఎవరూ కనికరం చూపలేదు. రోజులు గడుస్తున్నా నా కొడుకు గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు" అని విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక తల్లి గుండెల్లో ఆశ ఎంత బలంగా ఉంటుందో విజయలక్ష్మి ఆవేదన చెబుతోంది. రోజులు గడుస్తున్నాయి. వారాలు గడుస్తున్నాయి. అయినా తన కొడుకు ఇంటికి వస్తాడేమోనన్న ఆశను ఆమె వదులుకోలేదు.

​నిందితుడైనా జీవించే హక్కు ఉంటుంది

సాయికృష్ణ వయసు కేవలం 23 సంవత్సరాలు. అతనిపై కొన్ని కేసులు ఉన్నాయని, కొన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని సమాచారం. కానీ ఈ కేసు ముందుకు తెస్తున్న అసలు ప్రశ్న అది కాదు. ఒక వ్యక్తిపై కేసులు ఉండొచ్చు. అతడు నిందితుడు కావొచ్చు. చట్టం ముందు సమాధానం చెప్పాల్సి రావొచ్చు. కోర్టు విచారణ ఎదుర్కోవాల్సి రావొచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో శిక్ష విధించే అధికారం కోర్టులకే ఉంటుంది. భారత రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు నిందితుడికీ వర్తిస్తుంది. నేరం చేసిన వ్యక్తికీ వర్తిస్తుంది. చట్టం శిక్షించవచ్చు. జైలుకు పంపవచ్చు. కానీ చట్ట ప్రక్రియను పక్కనపెట్టి ఒక మనిషి ప్రాణాన్ని హరించే హక్కు ఎవరికీ లేదు.

​అందుకే సాయికృష్ణ కేసు కేవలం ఒక కుటుంబం విషాదంగా మిగలలేదు. మానవ హక్కులు, రాజ్యాంగ హక్కులు, పోలీసు వ్యవస్థ జవాబుదారీతనం గురించి పెద్ద చర్చకు కారణమైంది. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత అతడి ఆచూకీ కుటుంబానికి తెలియజేయకపోవడం, అతడు ఎక్కడున్నాడనే విషయంపై స్పష్టత లేకపోవడం, చివరకు అతడి మరణంపై తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి రావడం ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రశ్నించే అంశాలుగా మారాయి. ఒక పేద కుటుంబం గోడును ఎవరూ పట్టించుకోకపోయి ఉంటే ఈ సంఘటన కూడా ఎన్నో కేసుల మాదిరిగా మరుగున పడిపోయేదేమో. కానీ కుటుంబ సభ్యుల పట్టుదల, న్యాయపోరాటం, ప్రజల మద్దతు దీనిని రాష్ట్రవ్యాప్త చర్చగా మార్చాయి.

"నా కొడుకు తప్పు చేసి ఉంటే కోర్టులో పెట్టండి. చట్టం ప్రకారం శిక్షించండి. జైలుకు పంపండి. కానీ నా బిడ్డను నాకు దూరం చేసే హక్కు ఎవరికిచ్చారు? తల్లిగా నేను అడుగుతున్నది అంతే" అని విజయలక్ష్మి ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్న ఒక తల్లి ప్రశ్న మాత్రమే కాదు. చట్టబద్ధమైన పాలన అంటే ఏమిటి? మానవ హక్కుల విలువ ఏమిటి? అనే పెద్ద చర్చకు దారితీసే ప్రశ్న.

​హెబియస్ కార్పస్ నుంచి హైకోర్టు వరకు...

తన కుమారుడి ఆచూకీ తెలియక రోజులు గడుస్తుండటంతో విజయలక్ష్మి చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఒక తల్లి తన కుమారుడిని కోర్టు ముందు వెతుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి ఎంత విషాదకరమో ఈ కేసు చెబుతోంది. సాయికృష్ణను తమ ముందు హాజరుపరచాలని కోరుతూ ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ నెల 29న సాయికృష్ణను తన ముందు హాజరుపరచాలని ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి ఆ తేదీపైనే నిలిచింది. హైకోర్టు ఆదేశాలకు పోలీసులు ఎలాంటి సమాధానం ఇస్తారు? సాయికృష్ణ విషయంలో ఏమి వివరిస్తారు? ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అంశాలపై న్యాయస్థానం ముందు ఏమి ఉంచుతారు? అన్నది ఆసక్తికరంగా మారింది.

​ఇదే సమయంలో విజయలక్ష్మి సోదరి, న్యాయవాది ముళ్లపూడి కనకదుర్గ చేపట్టిన న్యాయపోరాటం కూడా ఈ కేసును రాష్ట్రస్థాయి చర్చగా మార్చింది. పోలీస్ స్టేషన్‌ల నుంచి కోర్టుల వరకు, అధికారుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఈ వ్యవహారం వెళ్లింది. కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీఐ నాగరాజుపై హత్య కేసు నమోదు కావడం ఈ వ్యవహారం తీవ్రతను సూచిస్తోంది. కేసు ఉపసంహరించుకోవాలని, రాజీ చేసుకోవాలని ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. "మాకేమీ వద్దు. మా అబ్బాయిని మాకు ఇవ్వండి. చంపేసి ఉంటే శవమైనా ఇవ్వండి. కాల్చేసి ఉంటే బూడిదైనా ఇవ్వండి. తల్లిగా చివరి చూపు చూసుకునే హక్కు కూడా లేదా?" అని విజయలక్ష్మి అడుగుతున్నారు.

జూన్ 29న హైకోర్టు ముందు ఏమి జరుగుతుందో చూడాలి. కానీ అంతకంటే ముందు ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. తన కుమారుడి కోసం విజయలక్ష్మి చేస్తున్న పోరాటం ఇప్పుడు ... ఒక పౌరుడి జీవించే హక్కు, ఒక తల్లి తన బిడ్డను చూడాలనే హక్కు, అధికార వ్యవస్థ జవాబుదారీతనం గురించి సమాజం ముందుంచిన ప్రశ్నగా మారింది. ఆ ప్రశ్నకు సమాధానం దొరికే వరకు ఆమె ఎదురుచూపులు ఆగవు. తల్లి ఆశలకు గడువు ఉండదు. ఆమె కళ్లలో ఇప్పటికీ "నా బిడ్డ నాక్కావాలి..." అన్న తపనే కనిపిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్