mh ad
సోమవారం, 22 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అట్టడుగు జీవితాల అక్షర శిల్పి

2 గంటల క్రితం

article
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 22, 2026, 06:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

తెలుగు సాహిత్యానికి సామాజిక దృష్టిని జోడించి, అద్భుతమైన సృజన సాహిత్యాన్ని వెలువరించిన ప్రతిభాశాలి ఆచార్య కొలకలూరి ఇనాక్. “మీరు భయ ప్రాతిపదిక మీద బతుకుతున్న ఈ ఊరు, ఈ దేశం ఎంతకాలం జీవిస్తాయి? ప్రేమ ప్రాతిపదిక మీద బతికే సమాజం, వ్యవస్థ ఏ రోజు పుడతాయి?” అంటూ ఏడు దశాబ్దాలకు పైగా నిరంతర సాహిత్య కృషి సాగించారు. స్త్రీల పట్ల, దళితుల పట్ల, అణగారిన పేద ప్రజల పట్ల అమిత ప్రేమను వ్యక్తపరుస్తూ.. “ఈ దేశంలో దుఃఖంతో కన్నీళ్లు పెట్టని మనిషి ఉండేంత వరకు నా కలం ఆగదు” అని ప్రకటించిన మానవతావాది. దళితులు, బహుజనులు, స్త్రీలు, మైనారిటీలు, గిరిజనుల జీవితాలను తెలుగు సాహిత్య ప్రధాన ప్రవాహంలోకి తీసుకువచ్చిన రచయితగా కొలకలూరి ఇనాక్ ప్రత్యేక స్థానం సంపాదించారు.

గుంటూరు జిల్లా వేజండ్ల గ్రామంలో 1939 జులై 1న విశ్రాంతమ్మ, రామయ్య దంపతులకు జన్మించిన ఇనాక్ వేజండ్ల ఏ.బి.యం. స్కూలు, గుంటూరు యు.యల్.సి.యం. హైస్కూలు, ఆంధ్ర క్రైస్తవ కళాశాలల్లో విద్యాభ్యాసం చేసి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.ఏ. (ఆనర్స్), శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పీహెచ్.డీ. పూర్తి చేశారు. పరిశోధనపై ఉన్న ఆసక్తి, విద్యపై ఉన్న పట్టుదల ఆయనను ఉన్నత శిఖరాలకు చేర్చాయి. అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా, పరిపాలకుడిగా, రచయితగా అనేక బాధ్యతలు నిర్వహించినప్పటికీ సాహిత్య సృజనను మాత్రం ఎప్పుడూ విస్మరించలేదు. ‘అనంత జీవనం’ నవలకు జ్ఞానపీఠ్ వారి మూర్తిదేవి పురస్కారం లభించింది. ఈ పురస్కారం అందుకున్న తొలి తెలుగు రచయితగా గుర్తింపు పొందారు. ‘విమర్శిని’ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అనేక జాతీయ, అంతర్జాతీయ సత్కారాలు అందుకున్నప్పటికీ “నేను సమాజ వారసుణ్ణి” అనే భావనను జీవితాంతం నిలబెట్టుకున్నారు.

“నేనెవరికంటే ఎక్కువ కాదు, నాకంటే ఎవరూ తక్కువ కాదు” అనే సమానత్వ దృక్పథం ఇనాక్ సాహిత్యానికి పునాది. కథ, నవల, నాటిక, నాటకం, కవిత్వం, పరిశోధన, విమర్శ, అనువాదం వంటి విభిన్న ప్రక్రియల్లో సమాన ప్రతిభ కనబరిచిన అరుదైన రచయిత. ఏ ప్రక్రియను ఎంచుకున్నా అందులో తనదైన ముద్ర వేశారు. తెలుగు సాహిత్యంలో దళిత చైతన్యానికి, సామాజిక అవగాహనకు, మానవీయ విలువలకు అక్షరరూపం ఇచ్చిన రచయితగా నిలిచారు. అట్టడుగు వర్గాల జీవితాల్లోని దుఃఖం, అవమానం, ఆకలి, పోరాటం, ఆత్మగౌరవం, మనుషుల మధ్య అసమానతలను ఆయన రచనలు నిరంతరం ప్రశ్నించాయి. సాహిత్యాన్ని కేవలం కళగా కాకుండా సామాజిక బాధ్యతగా భావించిన రచయితగా ఇనాక్ గుర్తింపు పొందారు. ఏ సభలోనైనా అమ్మ ప్రస్తావన వచ్చినప్పుడు భావోద్వేగానికి లోనయ్యే వ్యక్తిత్వం ఇనాక్‌ది. తనను పెంచి చదివించడానికి విశ్రాంతమ్మ పడిన కష్టాన్ని తరచూ గుర్తుచేసుకుంటారు. ఆ తల్లిపట్ల ఉన్న ప్రేమ, కృతజ్ఞతలే తరువాత “కొలకలూరి పురస్కారాలు” రూపంలో వెలిశాయి. కథ, నవల, కవిత్వం, విమర్శ రంగాల్లో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించి కొత్త రచయితలను ప్రోత్సహించే సంప్రదాయాన్ని కుటుంబం కొనసాగిస్తోంది.

​తనకు తెలిసిన, తాను అనుభవించిన జీవితమే ఇనాక్ రచనలకు మూలద్రవ్యం. దళితులు, స్త్రీలు, బహుజనులు, మైనారిటీలు, గిరిజనుల బతుకు చిత్రణలే ఆయన కలంలో ఒదిగి సాహిత్యంగా రూపాంతరం చెందాయి. 1960 ఆంధ్రప్రభ నవలల పోటీలో ‘అనాథ’ నవలకు బహుమతి లభించింది. అంతకు ముందే ‘సమత’ నవల రాశారు. చిన్న వయసు నుంచే కథానికలు, కవిత్వం రాయడం ప్రారంభించారు. పద్యకవిత్వం నుంచి గేయ, వచన కవిత్వం వైపు, అక్కడి నుంచి కథ, నవల, నాటక, విమర్శా ప్రక్రియల వరకు ఆయన సాహిత్య ప్రయాణం విస్తరించింది. ‘అనంత జీవనం’, ‘ఊరబావి’, ‘మునివాహనుడు’, ‘ఆది ఆంధ్రుడు’ వంటి రచనలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. “నా బాల్యమంతా దుఃఖమే, కన్నీరే! అందుకే దుఃఖితులు నాకు ఆత్మీయులు” అన్న ఇనాక్ మాటల్లోనే ఆయన సాహిత్య తత్వం అంతా కనిపిస్తుంది. ఆయన సాహిత్యంలో అణగారిన మనిషి కేవలం పాత్రగా కాదు, చరిత్ర సృష్టించే శక్తిగా కనిపిస్తాడు. సమాజ అంచుల్లోకి నెట్టివేయబడిన మనుషులకు స్వరం ఇవ్వడమే ఆయన సాహిత్య ధ్యేయంగా నిలిచింది.

ఇనాక్ రచనలు అనేక భారతీయ భాషల్లోకి అనువాదమై విస్తృత ఆదరణ పొందాయి. ఆయన నాటకాలు, కథలు, నవలలు ప్రాంతీయ సరిహద్దులను దాటి జాతీయ స్థాయిలో చర్చకు వచ్చాయి. మానవ సంబంధాలు గిడసబారిపోతున్న నేటి కాలంలో, పరిపక్వ ఆలోచనలతో, తాను ప్రత్యక్షంగా అనుభవించిన జీవిత సత్యాలతో సాహిత్య సృజన చేస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కొలకలూరి ఇనాక్, తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట అధ్యాయం.

(జులై 1 : కొలకలూరి ఇనాక్ జన్మదినం)

– విల్సన్ రావు కొమ్మవరపు

89854 35515​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్