- కిలో రూ.160లే అంటున్న ట్రేడర్లు
- పెరుగుతున్న నో బిడ్ బేళ్లు
- అమలుకాని ముఖ్యమంత్రి ఆదేశాలు
- వేలం కేంద్రాల వద్ద రైతుల ఆందోళనలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పొగాకు ధరలు రోజురోజుకూ నేల చూపులు చూస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సరాసరి అమ్మకం ధరలు క్రమంగా తగ్గిపోతుండగా, నో-బిడ్ బేళ్ల సంఖ్య పెరుగుతుండటం సంక్షోభ తీవ్రతను వెల్లడిస్తోంది. పొగాకు సరాసరి అమ్మకం ధర 2026 మే 25 నాటికి కిలోకు రూ.237.21 ఉండగా, జూన్ ఒకటి నాటికి రూ.235.63కు, 9వ తేదీన రూ.232కు, 15వ తేదీన రూ.227.78కు పడిపోయింది. దక్షిణాది ప్రాంతంలో ధరల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. జూన్ ఒకటిన కిలోకు రూ.224.45గా ఉన్న సరాసరి ధర, 17వ తేదీకి రూ.183.65కు పడిపోయింది. కనిష్ట ధర రూ.160 మాత్రమే నమోదవగా, గరిష్ట ధర రూ.250గా ఉంది. జూన్ 19న వెల్లంపల్లి-2 కేంద్రంలో కిలోకు రూ.183.26, ఒంగోలు-1లో రూ.181.39, ఒంగోలు-2లో రూ.182.77, టంగుటూరులో రూ.190.49 మాత్రమే సరాసరి ధర నమోదైంది. కనిగిరిలో రూ.187.80 మాత్రమే ధర లభించింది. ఈ నెల 20న ప్రకాశం జిల్లా పొదిలి వేలం కేంద్రంలో కనిష్ట ధర రూ.160 మాత్రమే చెల్లించడంతో వేలం కేంద్రం షర్టర్ మూసి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతకముందు రోజు ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు.
సిఎం ఆదేశాలు బేఖాతర్
పొగాకు రకం ఏదైనా మార్కెట్‌లో కిలో ధర రూ.200 కంటే తగ్గడానికి వీల్లేదని ఈ నెల 18న రైతులు, ట్రేడర్లతో రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పొగాకు రైతులను ఆదుకునేందుకు ట్రేడర్లు, కొనుగోళ్ల కంపెనీలు నూటికి నూరు శాతం మానవీయ కోణంలో సహకరించాలని సూచించారు. పొగాకు వేలం కేంద్రాల్లో నో బిడ్, లో బిడ్ అనే మాటలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు మార్కెట్టుకు తెచ్చిన పొగాకు బేళ్లను వెనక్కి పంపే పరిస్థితులు అస్సలు ఉండకూడదన్నారు. మార్కెట్లోకి వచ్చిన పొగాకును కంపెనీలు కొనుగోలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. అయితే, ముఖ్యమంత్రి సమక్షంలో సమావేశం జరిగిన మరుసటి రోజే ధరలు మరింత తగ్గిపోవడంతో రైతులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు కొనుగోలు సంస్థలు విలువ ఇస్తున్నాయా అనే ప్రశ్న రైతుల్లో వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సుమారు 260 మిలియన్ కేజీల ఉత్పత్తి అంచనా ఉండగా, జూన్ 15 నాటికి కేవలం 18.94 మిలియన్ కేజీలు మాత్రమే వేలం జరిగాయి. గతేడాది ఇదే 65 వేలం రోజుల వ్యవధిలో 50.82 మిలియన్ కేజీలు విక్రయమయ్యాయి. దీంతో మార్కెట్లో కొనుగోళ్లు మందగించినట్లు స్పష్టమవుతోంది.
పెరుగుతున్న నో-బిడ్ బేళ్లు
ఒంగోలు, టంగుటూరు, కొండెపి, వెల్లంపల్లి కేంద్రాల్లో ఈ నెల 17న 28.44 శాతంగా ఉన్న తిరస్కరించిన బేళ్లు 19 నాటికి 38.16 శాతానికి పెరిగినట్లు, పొదిలి, కనిగిరి, కందుకూరు, కలిగిరి, డీసీపల్లి కేంద్రాల్లో తిరస్కరించిన బేళ్లు 23.32 శాతం నుంచి 24.21 శాతానికి అధికారులు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తిరస్కరించిన బేళ్లను తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకు ఒక్కో బేళ్లకు సుమారు రూ.2 వేల వరకు అదనపు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. నో బిడ్ అనే మాటకు తావు ఉండకూడదని సిఎం చెప్పినా.. పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. 2023-24 మార్కెటింగ్ సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు సరాసరి ధర కిలోకు రూ.288 ఉండగా, ప్రస్తుతం అది రూ.228కు పడిపోయింది. దీంతో రైతులు కిలోకు సుమారు రూ.60 నష్టం చవిచూస్తున్నారు. ఇదే సమయంలో ఉత్పత్తి వ్యయం కూడా గత రెండేళ్లలో కిలోకు కనీసం రూ.20 పెరిగినందున మొత్తం నష్టం కిలోకు రూ.80 వరకు చేరుతోందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతేడాది కంపెనీలు రైతుల నుంచి పొగాకును సక్రమంగా కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనగా, వివిధ సాకులతో ధరలను తగ్గించడంతో రైతులు ఆరుగాలం పండించిన పంటను నష్టాలకు అమ్ముకోవాల్సి వస్తుంది.








కామెంట్‌లు (0)