ఒకింట్లో అమ్మ వంటింట్లో చపాతీలు చేస్తోంది. పిండి కలపడం, నీరు పోయడం, చపాతీలు వత్తడం చాలా వేగంగా చేసుకుపోతోంది. అవన్నీ తనకు సాధారణ పనులు. కానీ, ఒక కన్ను మాత్రం ఆ పనులను చాలా శ్రద్ధగా పరిశీలిస్తోంది. ఇంకో ఇంట్లో అక్క సాయంత్రం స్నాక్స్ కోసం పండ్లను శుభ్రంగా కడిగి, తొక్క తీసి, ముక్కలుగా కట్ చేసుకుంటోంది. ఈ పనులను కూడా ఓ కన్ను చూస్తోంది. ఒకచోట బట్టలు మడతపెట్టడం, మరోచోట అంట్లు తోమడం, సర్దడం వంటి ఎన్నో సాధారణ పనులను అత్యంత శ్రద్ధగా చూస్తున్న ఆ కళ్లు... మనుషులవి కావు; ‘ఏఐ’వి. ఒకప్పుడు ఈ పనులన్నీ అమ్మలు, అమ్మమ్మలు పిల్లలకు నేర్పేవారు. ఇప్పుడు యంత్రాలకు నేర్పుతున్నారు. మారింది శిష్యుడు మాత్రమే! గురువు, పాఠం అదే!
తమిళనాడుకు చెందిన గృహిణి నాగిరెడ్డి శ్రీరామచంద్ర తలకు స్మార్ట్‌ఫోన్ కట్టుకుని మామిడి పండ్లు కోస్తున్న దృశ్యాలను రికార్డ్ చేస్తున్నారు. గంట వీడియోకు ఆమెకు రూ. 250 లభిస్తున్నాయి. బెంగుళూరులో రోడ్డు పక్కన పూలు అమ్ముకునే పొన్ని, తలకు ఫోన్ కట్టుకుని పూలు కట్టడాన్ని రికార్డ్ చేస్తూ అదనపు ఆదాయాన్ని సంపాదిస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల మన దేశంలో ఏఐ వ్యవస్థలకు శిక్షణ ఇచ్చే వేలాది మంది వ్యక్తుల బృందంలో ఈ మహిళలు కూడా ఉన్నారు.
ఇంటిపనులు మహిళల బాధ్యతగా మాత్రమే భావించిన సమాజంలో క్రమంగా మార్పులు వస్తున్నాయి. కుటుంబ సభ్యులందరూ ఇంటి పనులను పంచుకోవాలనే అవగాహన పెరుగుతోంది. ఈ పరిస్థితులకు తగ్గట్లుగా ఇంటిని, ఉద్యోగాన్ని సమర్థవంతంగా నడిపించే మహిళలు ఇక కేవలం గృహిణులుగా మాత్రమే కాకుండా, రోబోట్లకు నైపుణ్యాలు నేర్పించే గురువులుగా మారుతున్నారు. యంత్రాలకు ఇంటి పనులు నేర్పుతున్న ఎందరో అమ్మలు వంట చేయడం దగ్గర నుంచి బట్టలు మడతపెట్టడం, పాత్రలు కడగడం, ఇల్లు సర్దుకోవడం వరకు ఎన్నో దైనందిన కార్యకలాపాలను ఏఐ నేర్చుకునేలా డేటాను సిద్ధం చేస్తున్నారు.
శిక్షణ ఎందుకంటే...
ఏఐకి ఒక కప్పు టీ తయారు చేయడం అంత సులభం కాదు. మనకు చాలా సహజంగా అనిపించే ప్రతి చర్యా యంత్రానికి విడివిడిగా వివరించాలి. కెటిల్ ఎక్కడ ఉంది? ఏ గ్లాస్? నీరు ఎంత పోయాలి? స్టవ్ ఎలా ఆన్ చేయాలి? ఇలా ప్రతి కదలికను గుర్తించి డేటాగా మార్చాలి. ఈ పనుల్లో మహిళల అనుభవం ఇప్పుడు ఏఐకి గొప్ప వరంగా మారుతోంది. బియ్యం కడగడం, కూరగాయలు తరగడం, మసాలా కలపడం, ఆహారాన్ని నిల్వ చేయడం వంటి పనులను వీడియోలు, చిత్రాలు, వివరణల రూపంలో మన దేశంలో ఎంతోమంది మహిళలు ఏఐ వ్యవస్థలకు అందిస్తున్నారు. ఒక ఇంటిని సమర్థవంతంగా నడపడానికి అవసరమైన ప్రణాళిక, క్రమబద్ధత, పరిశుభ్రత, సమయపాలన వంటి అంశాలను కూడా ఏఐ అర్థం చేసుకునేలా ఈ మహిళలు శిక్షణ ఇస్తున్నారు.
ఆ పనులు ఎంతో విలువైనవి!
ఒకప్పుడు ఇంటిపనులు కనిపించని శ్రమ. కుటుంబం కోసం గంటల తరబడి కష్టపడినా గుర్తింపు దక్కని పని. కానీ, నేడు అదే పని డిజిటల్ ఆస్తిగా మారింది. వంటగదిలో పుట్టిన నైపుణ్యాలు కోట్ల రూపాయల ఏఐ పరిశ్రమకు పునాదిగా నిలుస్తున్నాయి. వంటగదిలో నేర్పుతున్న ఈ జ్ఞానం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న రోబోటిక్స్, ఏఐ రంగాలకు ఇప్పుడు ఎంతో అమూల్యం. యంత్రాలు ఎంత తెలివిగా మారినా, వాటికి తొలి పాఠాలు చెప్పేది మనుషులే. ఆ మనుషుల్లో ముఖ్యంగా మహిళల పాత్ర మరింత విశిష్టమైనది. అందుకే ఏఐ విప్లవం గురించి మాట్లాడేటప్పుడు కంప్యూటర్ శాస్త్రవేత్తలతో పాటు, వంటగది పాఠాలు నేర్పుతున్న ఈ మహిళలను కూడా గుర్తుంచుకోవాలి. రేపటి రోబోలకు రోటీ ఎలా చేయాలో, ఇల్లు ఎలా చూసుకోవాలో నేర్పిస్తున్నవారు వీరే.
మన కళ్లే మార్గదర్శకం
ఎగోసెంట్రిక్ డేటా అని పిలవబడే ఈ ఫస్ట్-పర్సన్ ఫుటేజ్‌ను ఏఐ మోడళ్లకు అందించడం వల్ల రోబోట్లు మానవ ప్రవర్తనను అనుకరించే వీలు కలుగుతుందని డెవలపర్లు నమ్ముతున్నారు. ఈ కారణంగానే దేశవ్యాప్తంగా ఏఐకి శిక్షణ ఇస్తున్న కొంతమంది శిక్షకులు ఇంట్లో పనిచేస్తుంటే, మరికొంతమంది ఫ్యాక్టరీల్లో, ప్రత్యేక స్టూడియోల్లో వీడియో గ్లాసెస్, తలకు అమర్చుకున్న కెమెరాలతో పనిచేస్తున్నారు. ప్రస్తుతం హ్యూమనాయిడ్ రోబోట్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఒక అంచనా ప్రకారం, 2050 నాటికి వంద కోట్లకు పైగా రోబోట్లు ప్రధానంగా పారిశ్రామిక, వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగంలోకి రానున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏఐ డేటా సృష్టి, ప్రాసెసింగ్, వ్యాఖ్యానం కోసం భారతదేశం ప్రపంచ మధ్యవర్తిగా నిలవనుంది.
ఇప్పటివరకు పిల్లలకు, కుటుంబాలకు జీవన నైపుణ్యాలు నేర్పిన మహిళలు... ఇప్పుడు భవిష్యత్తు యంత్రాలకు కూడా అదే పాఠాలు బోధిస్తున్నారు. రేపు ఒక రోబో వంటగదిలో చపాతీలు చేయగలిగితే, దాని వెనుక ఒక భారతీయ మహిళ అనుభవం ఉందని కచ్చితంగా గుర్తుంచుకోవాలి. వంటగదిలో తను చేసే పనులకు విలువ ఇవ్వని సమాజాన్ని ఏమాత్రం నిందించకుండా మౌనంగా ఉన్న మహిళ... నేడు ఏఐ రూపంలో తన ఉనికిని ప్రపంచానికి చాటిచెబుతోంది.








కామెంట్‌లు (0)