గురువారం, 05 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపలు గ్రామాల్లో ఎన్నికల బహిష్కరణ

1 గంట క్రితం

పలు గ్రామాల్లో ఎన్నికల బహిష్కరణ
- పోలింగ్‌ రోజు సమస్యలపై గళం
- తమ గ్రామాలను పట్టించుకోవడం లేదంటూ ఓటు వేసేందుకు నిరాకరణ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 08:31 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • పోలింగ్‌ రోజు సమస్యలపై గళం

  • తమ గ్రామాలను పట్టించుకోవడం లేదంటూ ఓటు వేసేందుకు నిరాకరణ

ప్రజాశక్తి - యంత్రాంగం : పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ ‌రోజు గురువారం పలు గ్రామాల ప్రజలు నిరసన గళమెత్తారు. తమ సమస్యలను పరిష్కరిస్తే తప్ప ఓటు వేయబోమంటూ తేల్చి చెప్పారు. మార్కాపురం జిల్లా పిసిపల్లి మండలం అయ్యవారిపల్లి గ్రామంలో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. ఓట్ల సమయంలో మాత్రమే తమ గ్రామానికి వచ్చి ఓట్లు అడుగుతున్నారని, మిగతా సమయంలో గ్రామ అభివృద్ధికి ఏమాత్రమూ తోడ్పాటు అందించటం లేదని అందుకే ఓటు వేసేందుకు నిరాకరిస్తున్నామని తెలిపారు.

చిత్తూరు జిల్లా పూతలపట్టు, ఐరాల మండలాల పరిధిలోని రెండు పోలింగ్ స్టేషన్ పరిధిలో గ్రామస్తులు ఓట్లు వేయకుండా నిరసన తెలిపారు. ఐరాల మండలం అబ్బగుండు గ్రామస్తులు.. గ్రామంలోని మురుగునీటి కాలువలు, తాగునీటి, రోడ్ల సమస్యలను పరిష్కరించలేదని, అనేకమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ఏకతాటిపై నిలబడి పోలింగ్‌‌ను బహిష్కరించారు. జెసి ఆదర్శ రాజేంద్రన్ గ్రామానికి విచ్చేసి రెండు నెలల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పూతలపట్టు మండలం తలుపులపల్లి పంచాయతీలోని గ్రామస్తులంతా ఓట్లు వేయకుండా బహిష్కరించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌‌మోహన్ రెడ్డి పులివెందులలో ఓటు వేయని కారణంగా సంఘీభావం తెలుపుతూ తాము ఓట్లు వేయబోమని పట్టు పట్టారు. ఇక్కడ ఎనిమిది ఓట్లు మాత్రమే నమోదైనట్టు సమాచారం. ఉదయం 11 గంటల వరకు కూడా ఈ రెండు బూత్‌లలో ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు.

    తొట్టంబేడు మండలం మామిడిగుంట గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని సాంకేతిక కారణాలతో దైనేడుకు మార్చడంతో జెడ్‌‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో 93 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఎన్నో ఏళ్లుగా మామిడిగుంటలోనే ఓటు వేస్తున్నామని, తమ గ్రామంలో 93 మంది ఓటర్లు ఉండగా, కేవలం 33 మంది ఓటర్లున్న దైనేడుకు పోలింగ్ కేంద్రాన్ని మార్చడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. మామిడిగుంట ఓటర్ల కోసం ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కూడా కల్పించామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి గోవిందరాజ భాస్కర్ తెలిపినా, ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసినా ఏ ఒక్కరూ రాకపోవడంతో బస్సులు ఖాళీగానే వెనుదిరిగాయి.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రూరల్‌ మండలం వినాయకపురంలోని పోలింగ్‌ కేంద్రాన్ని వర్షం కారణంగా కోమటి గుంట ప్రాంతానికి మార్చారు. దీంతో గ్రామస్తులు నిరసిస్తూ ఓట్లు వేయడానికి నిరాకరించారు. దీంతో, భీమవరం ఎంఎల్‌ఎ రామాంజనేయులు ఓటర్లతో మాట్లాడగా ఓటర్లు ఓటు వేశారు.

తమ గ్రామంలోని సమస్యలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదంటూ విశాఖ జిల్లా భీమిలి మండలం తాళ్లవలస గ్రామ పంచాయతీ పరిధి రాయినిపేట గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. కొన్ని కార్పొరేట్ కళాశాలల నుంచి వస్తున్న వ్యర్థాలతో కూడిన నీరు తమ గ్రామానికి సమీపంలో ఉన్న చెరువులోకి చేరి దుర్గంధం వస్తోందని, ఈ విషయాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యక్తిగత సలహాదారైన చిక్కాల విజయ్ బాబు దృష్టికి తీసుకెళ్లినా ఎవ్వరూ పట్టించుకోలేదని వాపోయారు. బోర్ల నీరు సైతం కలుషితమవుతోందని, ఈ సమస్య పరిష్కరించకుంటే ఓటు వేయబోమని తెలిపారు. అనకాపల్లి మండలం రొంగలివానిపాలెం గ్రామస్తులు... సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్‌‌లో తొలుత అన్ రిజర్వుడ్ మహిళ అని చెప్పి, గత నెల 26న తమ గ్రామ సర్పంచ్ రిజర్వేషన్‌‌ను ఎస్‌‌సి మహిళకు మార్చేశారంటూ ఓటు వేసేందుకు నిరాకరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్