ప్రజాశక్తి - యంత్రాంగం : ఆటంకాలు, అడ్డగింతలు మధ్య కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలం కితలంగి పంచాయతీ గాంధ గ్రామంలోని సుమారు 30 మందికి ఓటరు స్లిప్పులను ప్రభుత్వ సిబ్బంది ఇచ్చినా పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వారిని అధికారులు అనుమతించలేదు. తుది ఓటర్ల జాబితాలో పేర్లు లేవంటూ వారిని వెనక్కి పంపించేశారు. తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని సిపిఎం జెడ్‌పిటిసి అభ్యర్థి ఎస్‌బి.పోతురాజు, కితలంగి ఎంపిటిసి అభ్యర్థి మహేశ్వరరావు కోరారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండల కేంద్రంలో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. స్థానిక హైస్కూల్‌లో ఉన్న పోలింగ్ బూత్‌లకు ఓటరు స్లిప్పులను పట్టుకుని పలువురు రాగా అక్కడ ఉన్న ఓటర్ల జాబితాలతో అవి సరిపోలలేదు. సమస్యను పరిష్కరించేసరికి గంటల సమయం పట్టింది. మధ్యాహ్నం అధికారులు ఓటర్లతో మాట్లాడిన అనంతరం వారు ఓటు వేశారు.
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామంలో పడమర ఎస్‌సి కాలనీ వాసులకు టిడిపి నాయకులు ఓటు కోసం నగదు ఇచ్చారు. అయితే, పడమర ఎస్‌సి కాలనీవాసులందరూ మధ్యాహ్నం నుంచి వచ్చి టిడిపికి వేయాలని సూచించారు. ఎస్‌సి కాలనీవాసులు ఓటు వేయడానికి పోలింగ్ బూత్ వద్దకు రాగా బయట పోలింగ్ బూత్‌లో ఉన్న టిడిపి ఏజెంట్లు ప్రతి ఒక్క ఓటరూ తమ ఓటును చూపించి వేయాలని గట్టిగా సూచించారు. దీంతో, 80 మంది వరకు చూపించి ఓటు వేశారు. అంతలో ఎన్నికల అధికారులు వచ్చి చూపించి వేయడానికి కుదరదని చెప్పడంతో, ఓటింగ్ కాసేపు ఆగి.. మరలా ప్రారంభమై తర్వాత సజావుగా సాగింది.
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో తమ ఓటు వేయకముందే ఓటు వేశారంటూ ఎన్నికల అధికారులు ఓటర్లను వెనక్కి పంపేశారు. ఫొటోలు చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపైన కూడా ఖాజీపేట, చెన్నూరు మండలాల నుంచి వచ్చిన కొత్త వ్యక్తులు దౌర్జన్యాలు, బెదిరింపులకు దిగారు. మొబైల్స్ కూడా లాక్కున్నారు. పోలీసులకు సమాచారం తెలిపినా పట్టించుకోలేదు. ప్రతి బూత్ వద్ద పది నుంచి 20 మంది వరకు ఉండి కూటమికి మద్దతుగా నిలిచారు.
పోలవరం జిల్లా కూనవరం మండలం చూచిరేవులగూడెం పోలింగ్ కేంద్రం వద్ద అధికార టిడిపి ఎంపిటిసి అభ్యర్థి శ్రీమంతుల త్రివేణి భర్త సత్యనారాయణ బూత్ ఏజెంట్‌గా ఎన్నికల అధికారి సంతకం లేని కార్డును ధరించి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చూడగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీమంతుల వెంకటరమణ ప్రశ్నించి, ఆర్‌ఒకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి సంతకం ఆ కార్డుపై లేకపోవడంతో ఫేక్ ఐడిగా గుర్తించి ఆయనను బయటకు పంపేశారు.







కామెంట్‌లు (0)