గురువారం, 05 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపరిషత్‌లోనూ ఉద్రిక్తత

1 గంట క్రితం

kurnoolvoting3-1793893977330-2601_resized.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 12:25 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

  • బూత్‌‌ల ఆక్రమణ, రిగ్గింగ్‌

  • రెండు చోట్ల పెట్రోలు బాంబులతో దాడులు

  • 67.24 శాతం పోలింగ్‌

  • శ్రీ సత్యసాయి జిల్లాలో అత్యధికం

  • ఐదు చోట్ల రీపోలింగ్‌

ప్రజాశక్తి- యంత్రాంగం : మున్సిపల్‌ ఎన్నికల్లో మాదిరిగానే పరిషత్తు ఎన్నికల్లోనూ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. గురువారం జరిగిన పోలింగ్‌‌తో కూటమి శ్రేణులు పలుచోట్ల రిగ్గింగ్‌‌కు, దాడులకు పాల్పడ్దాయి. రెం‌డు చోట్ల పెట్రోల్‌ ‌బాంబులతో దాడి జరిగింది. ఇద్దరు వైసిపి కార్యకర్తలకు గాయాలయ్యాయి. గురువారం సాయంత్రం 5 గంటల వరకు 67,24 శాతం పోలింగ్‌ జరిగినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఎస్‌ఇసి తెలిపిన వివరాల ప్రకారం.. 28 జిల్లాల పరిధిలోని 30,994 పోలింగ్ కేంద్రాల్లో 1,50,80,414 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. శ్రీసత్యసాయి జిల్లా 82.60 శాతంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 59 శాతంతో చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా నిలిచింది. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోవడంతో ఐదు చోట్ల రీ పోలింగ్‌కు ఎస్‌ఇసి ఆదేశించింది. అనంతపురం జిల్లా కూడేరు మండలం మారుట్ల గ్రామం బూత్‌ నెంబర్‌ 8, పెదవడగూరు మండలం చిత్రచేడు గ్రామంలోని 46, 47 బూత్‌లు, శ్రీకాకుళం జిల్లా పొన్నాం గ్రామంలో బూత్‌ నెంబర్‌ 2, కర్నూలు జిల్లా కొసిగి మండలం ఆర్లబండ గ్రామంలో బూత్‌ నెంబర్‌ 2లలో నేడు రీపోలింగ్‌ జరగనుంది.

పల్నాడు జిల్లా క్రోసూరు మండలం అందుకూరులోని 43, 44 పోలింగ్ బూత్‌లో కూటమి కార్యకర్తలు రిగ్గింగ్‌‌ చేశారు. ప్రతిపక్షాల ఏజెంట్లనుపోలింగ్‌ బూత్‌ల నుంచి దౌర్జన్యంగా తరిమేసి ఈ చర్యలకు పాల్పడ్డారు. నకరికల్లు మండలం జెడ్‌పిటిసి స్థానంలో పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సిపిఎం ఏజంట్లను అందరినీ బయటకు తరిమివేసి బూత్‌లలోని సిసి కెమెరాలను ఆఫ్‌ చేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. కర్నూలు మండలం ఉల్చాల గ్రామంలో సిపిఎం అభ్యర్థిని పోలీసులు లాక్కొని వెళ్లి జీపులో పడేశారు. ఇదే గ్రామంలోని 17,18,19లో టిడిపి వారు లలో తెలుగుదేశం పార్టీ వారు బూత్‌లు ఆక్రమించి రిగ్గింగ్‌‌కు ప్రయత్నించారు.

వైఎస్‌ఆర్‌ కడప జిల్లా పులివెందుల మండలం ఎరిపల్లి గ్రామంలో వైసిపి శ్రేణులపై కూటమి శ్రేణులు పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడడంతో ఉద్రిక్తత నెలకొంది. దొంగ ఓట్లు వేయించడానికి జనసేన నాయకులు ఐదు కారుల్లో తిరుపతి, ప్రొద్దుటూరు, కడపకు చెందిన 60 మందిని నందలూరుకు తీసుకొచ్చారు. స్థానికులు వారిపై దాడి చేసి కారు అద్దాలను పగులగొట్టారు. ఆ నేపథ్యంలో జనసేనకు చెందిన ఐదు కార్లను, 60 మంది స్థానికేతరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్తపల్లి, మోటునూతనపల్లి గ్రామాల్లో టిడిపి వారు వైసిపి మద్దతుదారులపై దాడులకు పాల్పడ్డారు. వైసిపి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి స్వగ్రామమైన పెద్దముడియం మండలం గుండ్లకుంటలో వైసిపి, టిడిపి శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. లింగాల మండలం పార్లపల్లి పోలింగ్ కేంద్రంలోకి వైసిపి వారిని వెళ్లనీయకుండా మాజీ ఎమ్మెల్సీ బిటెక్ రవి చిన్నాన్న రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యాన కూటమి నాయకులు అడ్డుకొని దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయం తెలిసి అక్కడికి వెళ్లిన కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పులివెందులలోని పలు పోలింగ్ బూత్ లను టిడిపి కార్యకర్తలు ఆక్రమించి రిగ్గింగ్‌‌కు పాల్పడ్డాయి. మైదుకూరు మండలంలో పోలింగ్‌ ‌కేంద్రంలో టిడిపి ఏజెంట్లు మాత్రమే ఉండడంతో పోలింగ్‌ ఏకపక్షంగా సాగింది. అన్నమయ్య జిల్లా లక్ష్మిరెడ్డిగారిపల్లెలోని బ్యాలెట్ బాక్స్‌ను టిడిపి వారు బయటకు తెచ్చి పడేయడంతో వైసిపి వారు ఆందోళనకు దిగారు.

నల్లపరెడ్డి పల్లెలో పెట్రోల్ బాంబులతో దాడి.. ఇద్దరికి గాయాలు

తిరుపతి జిల్లా పెనగలూరు మండలం నల్లపరెడ్డిపల్లిలో వైసిపి, టిడిపి శ్రేణులు పెట్రోల్ బాంబులు, కర్రలతో పరస్పర దాడులకు పాల్పడ్డాయి. వైసిపికి చెందిన ఇద్దరు గాయపడ్డారు. సుమారు రెండు గంటల పాటు గ్రామంలో బీభత్స వాతావరణం నెలకొంది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నడుమూరు పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన ఘర్షణలో టిడిపి ఎంపిటిసి అభ్యర్థి పళణికి గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లి, శెట్టూరు మండలం చింతర్లపల్లిలో వైసిపి, టిడిపి నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు ఇరుగ్రూలను చెదరగొట్టారు. గోరంట్ల మండలం మలసముద్రం పంచాయతీలోని పోలింగ్‌ ‌కేంద్రం వద్ద నుంచి వైసిపి నాయకులను వెళ్లిపోవాలంటూ సిఐ శేఖర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో, వైసిపి నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైసిపి జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి ఉషశ్రీ అక్కడికి చేరుకుని వైసిపి నాయకులకు మద్దతుగా ఆందోళన చేపట్టారు.

​వైసిపి నాయకుల హౌస్‌ అరెస్టులు

అనంతపురం జిల్లాలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌‌రెడ్డిని, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌‌ను, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌‌ను పోలీసులు నిర్బంధం చేశారు.

నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం నెహ్రూనగర్ లో నంద్యాల ఎంపి బైరెడ్డి శబరి, వైసిపి యువనేత బైరెడ్డి సిద్దార్థరెడ్డి గ్రూపుల మధ్య పోలింగ్ కేంద్రాల వద్ద మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. పోలీసులు వైసిపి కార్యకర్తలను మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకొని సాయంత్రం ఐదు గంటల తరువాత వదిలిపెట్టారు. ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని నాలుగు పంచాయతీలు మినహా మిగిలిన 22 పంచాయతీల్లో టిడిపి వారు రిగ్గింగ్‌‌కు పాల్పడినట్లు వైసిపి నేతలు ఆరోపించారు. పోలీసులు తమ ఏజెంట్లను కొందరిని భయపెట్టారని, మరికొందరిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. నరసరావుపేట నుంచి రౌడీలు వచ్చి కురిచేడులో రిగ్గింగ్‌ ‌చేశారని వైసిపి నాయకులు ఆరోపించారు.

​ గుంటూరు రూరల్‌ ‌మండలం వెంగళాయపాలెంలో పోలీసు బందోబస్తు లేకుండా టిడిపి ఏజెంటు బ్యాల్‌ట్‌ ‌బాక్సును తీసుకువెళ్లడంపై వైసిపి అభ్యంతరం తెలిపింది. పోలీసులు రంగప్రవేశం చేసి బ్యాలెట్‌ ‌బాక్సును స్వాధీనం చేసుకుని లెక్కింపు కేంద్రానికి తరలించారు.​

బ్యాలెట్‌ ‌బాక్స్‌‌తో రహదారిపై ఆందోళన

గుంటూరు జిల్లా గుంటూరు రూరల్‌ ‌మండలం చల్లావారిపాలెం ఎంపిటిసి స్థానానికి ఎన్నిక ముగిసిన అనంతరం బ్యాలెట్‌ ‌బాక్స్‌‌లను స్ట్రాంగ్‌ ‌రూములకు తరలించే క్రమంలో బ్యాలెట్‌ ‌బాక్సును పోలింగ్‌ ‌సిబ్బంది మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసిపి నాయకులు ఆందోళనకు దిగారు. గుంటూరు- హైదరాబాద్‌ ‌రహదారిపై బైఠాయించారు. వందలాది సుమారు గంటపాటు బైఠాయించడంతో పెద్ద ఎత్తున రాకపోకలు నిలిచిపోయాయి. బ్యాలెట్‌ ‌బాక్స్‌‌తో వాహనం దిగిన సదురు ఉద్యోగిని గ్రామస్తులు అడ్డుకుని బ్యాలెట్‌ ‌బాక్స్‌‌తో రహదారిపై కూర్చున్నారు. వైసిపి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు రూరల్ వైసిపి జెడ్‌‌పిటిసి అభ్యర్థి అంజిరెడ్డి నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. అప్పిరెడ్డిని అరెస్టు చేసి వైసిపి నాయకులు, గ్రామస్తులపై పోలీసులు లాఠీఛార్జీ చేసి చెదరగొట్టారు. బ్యాలెట్‌ ‌బాక్స్‌‌ను స్వాధీనం చేసుకుని గుంటూరుకు తరలించారు. ఎన్నికల బాక్సులో ఉండాల్సిన ఓటర్ల స్లిప్పులు అందుకూరు గ్రామ పరిసరాల్లో దొరికాయి.

శ్రీకాకుళం మండలం పొన్నాంలో

కూడేరులో ఆగిన పోలింగ్‌

అనంతపురం జిల్లా కూడేరు మండలం మరుట్ల రెండో కాలనీ ఎంపిటిసి ఎన్నికల్లో సిఐ రాజు ఆధ్వర్యంలో రిగ్గింగ్‌‌కు పాల్పడుతున్నారంటూ వైసిపి నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో వైసిపి, టిడిపి వర్గీయుల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కొందరు బ్యాలెట్‌ ‌బాక్సులను బయట తీసుకొచ్చి ధ్వంసం చేశారు. దీంతో, అక్కడ పోలింగ్‌ ఆగిపోయింది.

గుండెపోటుతో వైసిపి ఏజెంట్‌ మృతి

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కొత్తవలస పోలింగ్ కేంద్రంలో వైసిపి ఏజెంట్ ఉన్న బొడ్డేపల్లి వరహాలనాయుడు అస్వస్థతకు గురై మృతి చెందారు. విజయనగరం కొమరాడ మండలం దేవకోన గ్రామంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఎపిఒ కొండగొర్రి ప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు.​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్