కొండ కోనల్లో నడుస్తూ.. పడవలపై వస్తూ..
ప్రజాశక్తి - విశాఖపట్నం : అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలోని పలు గ్రామాల గిరిజనులు ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు కొండ కోనలు దాటి వచ్చారు. నేటికీ వారి ప్రాంతాలకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అవస్థలు పడుతూ అడవుల మీదుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. గుమ్మ పంచాయతీ పరిధి కొండ శిఖర గ్రామాలైన కర్రిగూడ, కడరేవు, కల్యాణ భూమి, మర్రిబంద గ్రామాలకు చెందిన వారు ఎత్తైన కొండలపై సుమారు రానుపోను 30 కిలోమీటర్లు నడక సాగించి గుమ్మ పంచాయతీలోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కొట్టంగూడ, తట్టబూడె, సింధుగులపాడు, సొలుబుంగు గ్రామాలకు చెందిన గిరిజనులు రైవాడ జలాశయంపై నాటు పడవల్లో ప్రయాణించి పినకోట పంచాయతీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వచ్చారు. రొంపల్లి పంచాయతీ పరిధి రోకటి, తమ్మపురం, ఆర్‌టి పురం గ్రామానికి చెందిన ఓటర్లూ సుదూర ప్రాంతాలకు నడిచివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జీనబాడు పంచాయతీ వలస గరువు గిరిజనులు ఓటు వేసేందుకు రైవాడ జలాశయంలో బోటుపై ప్రయాణించి వచ్చారు. ప్రమాదకరమైన ప్రయాణమని తెలిసినా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చామని పలువురు చెప్పారు.
వృద్ధున్ని 13 కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లి..
అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ పరిధిలోని జీలుగులోవ, పశువులబంద గ్రామాలకు చెందిన గిరిజనులు తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఈ గ్రామాలకు చెందిన సుమారు 20 మందికి తొలిసారిగా ఓటు హక్కు లభించింది. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలనే డిమాండ్‌తో వారు ఓటు వేయడానికి బయలుదేరారు. ఈ క్రమంలో 80 ఏళ్ల వృద్ధుడు కొర్ర గాసన్న నడవలేని పరిస్థితిలో ఉండడంతో గ్రామస్తులు డోలీ కట్టి ఆయనను భుజాలపై మోస్తూ సుమారు 13 కిలోమీటర్ల దూరంలోని చీమలపాడు పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లారు. రహదారి లేకపోయినా ఓటు హక్కును వినియోగించుకోవాలనే పట్టుదలతో గిరిజనులు చేపట్టిన ఈ కార్యక్రమం పలువురి దృష్టిని ఆకర్షించింది. మాడుగుల మండలం శంకరం ఎంపిటిసి స్థానంలో ఉరకగెడ్డకు అవతల సుమారుగా ఏడు గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకు సరైన రహదారులు లేవు, వాగులపై వంతెనలను పాలకులు నిర్మించలేదు. వారంతా వాగులు దాటుకుంటూ వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.








కామెంట్‌లు (0)