- దానితో అంత్యోదయ లబ్ధిదారులకు భారీ నష్టం
- జాతీయ ఆహార భద్రతా చట్టంపై సిపిఎం పొలిట్‌బ్యూరో డిమాండ్
న్యూఢిల్లీ : జాతీయ ఆహార భద్రతా చట్టాని (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ)కి చేయతలపెట్టిన ప్రతిపాదిత సవరణను సిపిఎం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అంత్యోదయ అన్న యోజన (ఎఎవై) కింద అర్హతా ప్రమాణాలను కుటుంబ ప్రాతిపదిక కాకుండా తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా మార్చాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం సవరణను ప్రతిపాదించింది. ఈ మార్పుతో ఒకో వ్యక్తికి 7కిలోలు చొప్పున ఆహార ధాన్యాలు ఇవ్వనున్నారు, అయితే దీనివల్ల పెద్ద కుటుంబాలు నష్టపోతారని, ఎందుకంటే కుటుంబంలో సభ్యుల సంఖ్యతో నిమిత్తం లేకుండా నెలకు 35 కిలోలు పరిమితి కొనసాగుతున్నపుడు ఈ మార్పు వల్ల ప్రయోజనం వుండదని పొలిట్‌బ్యూరో పేర్కొంది. అదే సమయంలో, ప్రస్తుతమున్న పథకం కింద కచ్చితంగా పూర్తిగా 35 కిలోలు అందుతాయన్న హామీ వున్న చిన్న కుటుంబాలకు ఆహార ధాన్యాలు గణనీయంగా తగ్గిపోనున్నాయి. కుటుంబంలో ఎంతమంది వున్నారనే దానితో నిమిత్తం లేకుండా అంత్యోదయ అన్న యోజనపై ఆధారపడివున్న వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, గిరిజన కుటుంబాలు, భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలు, రోజువారీ కూలీలు, తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న వారు, చిన్న చిన్న కుటుంబాల వారితో సహా సమాజంలోని అతి పేద, దుర్బల వర్గాలు ఈ సవరణతో తీవ్రంగా ప్రభావితమవుతాయని పొలిట్‌బ్యూరో పేర్కొంది.
దక్షిణాదిపై తీవ్ర ప్రభావం..
‘ఈ సవరణతో రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. విజయవంతంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను అమలు చేసిన ఫలితంగా ఈ రాష్ట్రాల్లో సగటున చిన్న కుటుంబాలే వున్నాయి. జనాభా స్థిరీకరణలో విజయాలు సాధించినప్పటికీ మొత్తంమ్మీద తమ ఆహార ధాన్యాల కేటాయింపుల్లో గణనీయమైన వాటానే ఈ రాష్ట్రాలు కోల్పోనున్నాయి. ’ అని సిపిఎం పేర్కొంది. కాలం చెల్లిన 2011 జనాభా లెక్కల ప్రాతిపదికనే ఇప్పటికీ కొనసాగుతున్న ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ లబ్దిదారుల జాబిత ాలను సవరించాలనేది దీర్ఘకాలంగా వున్న డిమాండ్ అని, దీనికి విస్తృతంగా అందరి మద్దతు వున్నదని తెలిపింది. ‘ఫలితంగా, అర్హులైన లక్షలాదిమంది ప్రజలకు ఇప్పటికీ ఈ చట్ట ప్రయోజనాలు అందడం లేదు. లబ్దిదారుల డేటాబేస్‌ను ఆధునీకరించడం ద్వారా, ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఈ చట్ట వర్తింపును విస్తరించడం ద్వారా దీర్ఘకాలంగా వున్న ఈ డిమాండ్‌ను పరిష్కరించడానికి బదులుగా మోడీ ప్రభుత్వం సమాజంలోని నిరుపేద వర్గాల ఆహార పరిమాణాన్ని తగ్గించే ఒక సవరణను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఆహారాన్ని ఒక చట్టబద్ధమైన హక్కుగా మార్చేందుకు నిరంతరంగా ప్రజలు సాగించిన పోరాటాల ఫలితంగా చారిత్రకమైన ఈ చట్టం రూపొందింది. అటువంటి జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని క్రమంగా నీరుగార్చి, బలహీనపరిచేందుకు మోడీ ప్రభుత్వం చేసే ప్రయత్నాన్ని ఈ పేదల వ్యతిరేక సవరణ బహిర్గతం చేస్తోంది.’ అని సిపిఎం పొలిట్ బ్యూరో తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత సవరణను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.







కామెంట్‌లు (0)