mh ad
గురువారం, 25 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‌పల్లెను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు..

2 గంటల క్రితం

Federation of Sustainable Alternatives
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 25, 2026, 06:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

లాభార్జన కోసం వ్యాపారాలు చేసే వారు మన చుట్టూ చాలామంది ఉంటారు. ప్రజల జీవనోపాధి మెరుగుపర్చాలని, సమాజాన్ని మార్చాలని లక్ష్యంగా పనిచేసే వారు మాత్రం కొంతమందే. వారిలో మహిళలు ముందువరుసలో ఉన్నారనడానికి ఈ మహిళా వ్యాపారవేత్తలే నిదర్శనం. ఒంటె పాలు, కొబ్బరిచిప్పలు, చేతివృత్తి కళాఖండాలు, సుగంధ ద్రవ్యాలను ఆధారంగా చేసుకుని గ్రామాల్లో తయారయ్యే ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నారు. రైతులు, కళాకారులు, పశువుల కాపరులు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. థార్ ఎడారి నుంచి కేరళ కొండల వరకు వీరు నిర్మిస్తున్న వ్యాపార సామ్రాజ్యం గ్రామాల ఆర్థిక ముఖచిత్రాలను మారుస్తూ, పల్లెను ప్రపంచానికి పరిచయం చేస్తోంది.

అక్రితి శ్రీవాత్సవ (బహుళ నేచురల్స్)

'బహుళ నేచురల్స్' పేరుతో అక్రితి ప్రారంభించిన ఈ సంస్థ థార్ ఎడారిలో ఒంటెలు కాసుకునే వారి జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకొచ్చింది. బికనీర్, జైసల్మేర్, జైపూర్ ప్రాంతాల్లో దాదాపు 4 వేల కుటుంబాలు ఈ సంస్థతో కలిసి పనిచేస్తున్నాయి. ఒంటె పాలు సేకరించడం, వాటితో వెన్న, నెయ్యి వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారుచేయడం, రాథి ఆవు పాల ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, నల్ల గోధుమ పిండి, నూనెలు, బయోగ్యాస్ ప్లాంట్లు వంటి రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. స్థానిక గ్రామస్తుల్లో 95 శాతం మందికి ఉపాధి అవకాశాలు కల్పించింది. గ్రామీణులు తయారుచేసిన ఉత్పత్తులను ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమం కూడా సంస్థ ఆధ్వర్యంలోనే నడుస్తోంది. ఈ బ్రాండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది.

ప్రేమ అగర్వాల్, శ్వేతాంబర ఉజ్జయిన్ (సమాఖ్య సస్టైనబుల్ ఆల్టర్నేటివ్స్)

రాజస్థాన్‌లోని భారత-పాకిస్తాన్ సరిహద్దు గ్రామాల్లో గొర్రెల ఉన్నే ప్రధాన ఆదాయ వనరు. అయితే కేజీ ఉన్నిని రూ.20లకే దళారులకు విక్రయిస్తున్న పరిస్థితిని గుర్తించిన ప్రేమ, శ్వేతాంబర, డానిష్‌తో కలిసి 2022లో ఈ సంస్థను ప్రారంభించారు. ముతక ఉన్ని అద్భుతమైన సహజ ఉష్ణ నిరోధకం (నేచురల్ ఇన్సులేటర్)గా ఉపయోగపడుతుందనే పరిశోధనల ఆధారంగా పర్యావరణ అనుకూల ఇన్సులేటర్ ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. ప్రస్తుతం 500 పశుపోషక కుటుంబాలు సంస్థతో కలిసి పనిచేస్తున్నాయి. ‘మగ్రా పశుపాలక్’ కేంద్రాల ద్వారా ఉన్ని కత్తిరించడం, పశువైద్య సహాయం, ఉన్ని సేకరణ సేవలు అందిస్తున్నారు. ప్రాసెసింగ్ యూనిట్లో 35 మంది మహిళలకు ఉపాధి కల్పించారు. సంస్థ ఉత్పత్తులు పాఠశాలలు, కమ్యూనిటీ సెంటర్లు, ఇతర భవనాల్లో వినియోగంలోకి వచ్చాయి. ఇవి విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంలోనూ తోడ్పడుతున్నాయి.

మేఘా ఫన్ సల్కార్ (టిస్సర్ ఆర్టిషియన్ ట్రస్టు)

గ్రామీణ హస్తకళాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభమైన ఈ సంస్థ వెయ్యి మంది కళాకారులకు అండగా నిలిచింది. చేతివృత్తి ఉత్పత్తులు, హస్తకళాఖండాలను సేకరించి మార్కెటింగ్ చేయడం ద్వారా ఉపాధి కల్పిస్తోంది. బీహార్‌లోని మధుబని కళాకారులు, పశ్చిమ బెంగాల్ నేత కార్మికులు, ఛత్తీస్‌గఢ్ టస్సర్ కళాకారులు, తెలంగాణ కలంకారి కళాకారులు, తమిళనాడు కంజీవరం కళాకారులు, కర్ణాటక చన్నపట్టణ బొమ్మల తయారీదారులు, మహారాష్ట్ర వార్లీ కళాకారులతో కలిసి పనిచేస్తోంది.

మరియ కురియాకోస్ (థెంగా కోకో)

కేరళకు చెందిన మరియ వృథాగా మిగిలిపోయే కొబ్బరి చిప్పలను ఉపయోగకర ఉత్పత్తులుగా మార్చాలనే ఆలోచనతో 'థెంగా కోకో'ను ప్రారంభించారు. కొబ్బరిచిప్పలతో గృహ అలంకరణ ఉత్పత్తులను తయారుచేస్తున్న ఈ సంస్థ 2024లో కేరళ-తమిళనాడు సరిహద్దులోని వేలంతవళంలో సొంత తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ 26 మంది మహిళలు కొబ్బరి చిప్పలను కత్తిరించడం నుంచి ప్యాకేజింగ్ వరకు అన్ని పనులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 110 రకాలకుపైగా వంటింటి ఉపకరణాలను తయారుచేస్తూ మహిళలకు, గ్రామీణులకు ఉపాధి కల్పిస్తోంది. దేశీయ మార్కెట్‌తో పాటు యూరోపియన్ మార్కెట్లోనూ ఈ ఉత్పత్తులకు ఆదరణ లభిస్తోంది.

అన్ను సన్నీ (గ్రామ్యా)

కేరళలోని ఇడుక్కి జిల్లాలో చిన్న రైతులతో కలిసి 'గ్రామ్యా' పనిచేస్తోంది. మధ్యవర్తులు లేకుండా రైతుల నుంచి నేరుగా సుగంధ ద్రవ్యాలు కొనుగోలు చేస్తోంది. మిరియాలు, యాలకులు, దాల్చినచెక్క, జాజికాయ, జాపత్రి, లవంగాలు, పసుపు, కాఫీతో పాటు ఇతర ఉత్పత్తులను కూడా సేకరిస్తోంది. యాలకుల పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసిన ఐసీఆర్ఐ-10 పచ్చి యాలకుల రకాన్ని వాణిజ్యీకరించిన తొలి సంస్థగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం రెండు ప్రాసెసింగ్ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఒక కేంద్రంలో ఎండబెట్టడం, ప్రాథమిక ప్రాసెసింగ్ చేయగా, మరొక కేంద్రంలో వేరుచేయడం, గ్రేడింగ్, శుభ్రపరచడం, ప్యాకింగ్ చేస్తారు. ఈ కేంద్రాల్లో సాంకేతిక నిపుణులు, మార్కెటింగ్ బృందంతో పాటు మహిళా కూలీలు కూడా పనిచేస్తున్నారు. మసాలాల ప్యాకేజింగ్, అనుబంధ కార్యకలాపాల ద్వారా గ్రామీణులకు ఉపాధి కల్పిస్తోంది.

కొన్ని చిన్న చిన్న ఆలోచనలు, ఆచరణలు ఎంతోమందికి మేలు చేస్తాయి. అభివృద్ధికి కొత్త దారి చూపిస్తాయి. ఊరిని, పట్టణాన్ని అనుసంధానం చేస్తాయి. ఊళ్లు ఇచ్చే ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేస్తాయి. ఒక అనుబంధపు అనుభూతిని కలిగిస్తాయి. ఇలాంటి ప్రయత్నాలు ఊరికి బలం, ఉత్పత్తికి ప్రచారమూ అవుతాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్