mh ad
గురువారం, 25 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రమాద ఘంటికలు..

3 గంటల క్రితం

gdp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 25, 2026, 05:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందంటూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అట్టహాసపు ప్రకటనలకు, వాస్తవాలకు ఏమాత్రం పొంతన లేని స్థితి నెలకొంది. తాజా ఆర్థిక సూచీలు వెల్లడిస్తున్న అంశాలే ఇందుకు నిదర్శనం. పారిశ్రామిక రంగానికి వెన్నెముకగా భావించే ఎనిమిది కోర్ పరిశ్రమల వృద్ధి ఏప్రిల్‌ ‌నెలతో పోలిస్తే మే నెలలో 1.8 శాతం నుండి 0.5 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగించే పరిణామం. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువుల వంటి కీలక రంగాల్లో ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. కోర్ పరిశ్రమల పని తీరే మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ లో 40.27 శాతం వాటాను కలిగి ఉండటంతో ఈ మందగమనం రానున్న నెలల్లో పారిశ్రామిక ఉత్పత్తిపైనా ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి అనుగుణంగానే హెచ్‌ఎస్‌బీసీ–ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్ విడుదల చేసిన తాజా పిఎంఐ (పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌) సర్వే కూడా ప్రైవేట్ రంగ వృద్ధి మూడు నెలల కనిష్ఠానికి పడిపోయిందని వెల్లడించింది. తయారీ, సేవల రంగాల్లో కొత్త ఆర్డర్లు మందగించడం, వ్యాపార విశ్వాసం బలహీనపడటం, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు పరిశ్రమలపై ఒత్తిడిని గణనీయంగా పెంచుతున్నాయి. ఈ నివేదిక ప్రకారం ప్రైవేటు యాజమాన్యంలోని సేవలు, తయారీ రెండు రంగాల్లోనూ వృద్ధి వేగం తగ్గింది. సేవల రంగం పిఎంఐ ఏకంగా 17 నెలల కనిష్టానికి చేరుకోగా, తయారీ రంగం 55.0 నుండి 54.5 పాయింట్లకు దిగజారింది. ఆర్థిక సూచీల్లోని కోర్‌ ‌పరిశ్రమల గణాంకాలు వెల్లడిస్తున్న అంశాలనే పిఎంఐ సర్వే మరింతగా బలపరుస్తుండటం దేశ ఆర్థిక వ్యవస్థను ఆందోళనకరంగా మారుస్తోంది.

తాజాగా వెల్లడైన అంశాలను ఇతర పరిణామాలతో కలిపి పరిశీలిస్తే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుండటమే ఈ ఆందోళనకు కారణం. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం 15-29 ఏళ్ల యువతలో నిరుద్యోగం రెండంకెల స్థాయిలోనే కొనసాగుతోంది. అసంఘటిత రంగం, స్వయం ఉపాధి, కాంట్రాక్టు, అవుట్‌ ‌సోర్సింగ్‌ ‌వంటి వాటిలోనే యువతకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి. స్థిరమైన, నాణ్యమైన ఉద్యోగాలు దక్కడం లేదు. మరోవైపు రిజర్వు బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థల విశ్లేషణలు గ్రామీణ వినియోగం బలహీనంగానే ఉందని, అల్పాదాయ వర్గాలపై ద్రవ్యోల్బణ ప్రభావం తీవ్రంగా ఉందని చెబుతున్నాయి. జిడిపి లో ప్రైవేట్ తుది వినియోగ వ్యయం (ప్రైవేట్‌ ‌ఫైనల్‌ ‌కన్‌‌జమ్షన్‌ ఎక్స్‌‌పెండీచర్‌ - ‌పిఎఫ్‌‌సిఇ) దాదాపు 56-58 శాతం వాటా కలిగి ఉన్న నేపథ్యంలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గితే దాని ప్రభావం నేరుగా పారిశ్రామిక రంగ ఉత్పుత్తల వినియోగంపై పడుతుంది. పిఎంఐ సర్వేలో కొత్త ఆర్డర్లు తగ్గుతున్నాయని పేర్కొనడం ఇదే వాస్తవాన్ని ప్రతిబింబిస్తోంది. దీనికి తోడు ఎగుమతుల్లో అనిశ్చితి, ప్రపంచ వాణిజ్య మందగమనం, పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇంధన, ముడి పదార్థాల ధరల పెరుగుదల, ప్రైవేట్ పెట్టుబడుల్లో సంకోచం కలిసి పారిశ్రామిక రంగాన్ని మరింత ఒత్తిడిలోకి నెడుతున్నాయి. భారీ పెట్టుబడులు వస్తున్నట్లు చేస్తున్న అట్టహాసపు ప్రకటనలు ఎలా ఉన్నప్పటికీ, మార్కెట్‌లో డిమాండ్ పెరగకపోతే వాటి ప్రయోజనం పరిమితంగానే మిగిలిపోతుందన్న వాస్తవాన్ని తాజా గణాంకాలు గుర్తు చేస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించే జిడిపి వృద్ధి రేటు ఒక్కటే ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను కొలిచే ప్రమాణం కాదు. ఉత్పత్తి పెరిగినా ప్రజల చేతుల్లో కొనుగోలు శక్తి లేకపోతే, పెట్టుబడులు వచ్చినా ఉపాధి సృష్టించకపోతే, కార్పొరేట్ లాభాలు పెరిగినా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నిలదొక్కుకోలేకపోతే ఆ వృద్ధి సమాజానికి ఉపయోగపడదు. అందుకే ప్రభుత్వం గణాంకాల ప్రచారానికే పరిమితం కాకుండా ఉపాధి కల్పన, వేతనాల పెంపు, ప్రజల ఆదాయ భద్రత, వ్యవసాయానికి ఊతం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు భరోసా, ఎంఎస్‌ఎంఇ లకు ప్రోత్సాహం, దేశీయ డిమాండ్‌ను పెంచడం వంటి చర్యలపై దృష్టి పెట్టాలి. కోర్ పరిశ్రమల వృద్ధి క్షీణించడం, ప్రైవేట్ రంగంలోనూ తగ్గదుల నమోదు కావడం దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాద ఘంటికలు మోగించడమే! జిడిపి గణాంకాల మెరుపులతో ఈ వాస్తవాలను కప్పిపుచ్చలేరు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్