- బి. తులసీదాస్
కమ్యూనిస్టు శ్రేణులు ఆప్యాయంగా కామ్రేడ్ ఎం.హెచ్ అని పిలుచుకునే మోటూరు హనుమంతరావు గారు కన్నుమూసి పాతికేళ్ళు గడిచిపోయాయి. కానీ అయన వేసిన బాట రాసిన వ్యాసాలు వ్యాఖ్యానాలు పుస్తకాలూ రికార్డు చేసిన కొన్ని ప్రసంగాలు మన ముందున్నాయి. చరిత్రలో అవన్నీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. సోషలిస్టు విప్లవంతోపాటు 1917 లో జన్మించిన ఎంహెచ్ 2001 జూన్ 18 న తుది శ్వాస విడిచారు. కమ్యూనిస్టు ఉద్యమ నేతగా రాష్ట్ర శాసన సభ, శాసన మండలిలో సభ్యునిగా తదనంతరం రాజ్యసభ సభ్యునిగా చట్ట సభల్లో పీడిత ప్రజల గొంతుగా నిలిచారు. తెలుగునాట గొప్ప రాజకీయ సంపాదకునిగా పేరు గాంచారు. అతివాద, మితవాద ధోరణులకు శక్తులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు సిద్ధాంత రాజకీయ స్వచ్ఛత కోసం పోరాడిన గొప్ప యోధుడాయన. అటు ప్రజా క్షేత్రంలోను ఇటు చట్ట సభల్లోనూ పోరాడుతూనే రచనా వ్యాసంగాన్ని పదునుగా సాగిస్తూ బహుముఖంగా కృషి సాగించిన హనుమంతరావు గారిని చాలామంది సవ్యసాచి అని కూడా అంటారు. పదునైన విమర్శలు, ఉర్రూతలూగించే ప్రసంగాలకు ఎంహెచ్ పెట్టింది పేరు. శత్రువును, శత్రు సిద్ధాంతాలనూ దునుమాడడంలో ఆయనది ప్రత్యేక స్థానం. అనర్గళంగా ఉపన్యసించడంలో ఆయన దిట్ట!
కామ్రేడ్ ఎం.హెచ్ పాత్రికేయ ప్రస్థానంలో వివిధ దశల్లో ప్రజాశక్తిది ప్రత్యేక స్థానం. 1968 నుండి వార్తాపత్రికగా వెలువరించిన ప్రజాశక్తిని దినపత్రికగా ప్రచురించాలన్న నిర్ణయం మేరకు 1981 ఆగస్టు ఒకటవ తేదీన ఆనాటి సిపిఎం ప్రధాన కార్యదర్శి ఈ ఎం ఎస్ నంబూద్రిపాద్ చేతుల మీదుగా ప్రారంభించబడింది. అప్పటికి ఉన్న సాంకేతిక ప్రమాణాల మేరకు మొదట లెటర్ ప్రెస్ గా నిర్వహించారు. అప్పుడప్పుడే ఇండియా లో ప్రవేశించిన ఆఫ్ సెట్ పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని, అందుకోసం పత్రిక నూతన భవనంలోకి వెళ్లాలని నిర్ణయించారు. భవన నిర్మాణానికి స్థలాన్ని కీ. శే. కాట్రగడ్డ శ్రీనివాసరావు, ఆయన సతీమణి వెంకటలక్ష్మి గార్లు పార్టీకి కానుకగా సమర్పించారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి జన్మదిన సందర్భంగా 1983 మే ఒకటవ తేదీ నుండి ప్రజాశక్తి ఆఫ్ సెట్ లో ముద్రితమై ఆధునికతను సంతరించుకుంది. ఆఫ్ సెట్ లో ప్రచురించబడ్డ మొట్టమొదటి తెలుగు దినపత్రిక ప్రజాశక్తి కావడం గర్వకారణం. ఆధునిక ముద్రణా టెక్నాలజీ తో పత్రిక ఎం.హెచ్ సారథ్యంలో వెలువడింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఆయన ఎల్లపుడు ముందుండేవారు. పూర్తిగా ఆధునికమైన ఓపెన్ సోర్స్ టెక్నాలజీ లో రూపొందించిన ప్రజాశక్తి వెబ్ సైట్ ను ఆయన వర్ధంతి సందర్భంగా ఈ రోజు (2026 జూన్ 18న ) ఆవిష్కరించడం ఆయనను ఇంకో విధంగా కూడా గుర్తు చేసుకోవడం అవుతుంది. ప్రజాశక్తి దినపత్రిక ఎడిటోరియల్ వర్క్ ఫ్లో కూడా ఓపెన్ సోర్స్ టెక్నాలజీ లో అభివృద్ధి చేసిందే! ఈ రోజున తెలుగు దినపత్రిక రంగంలో పూర్తి ఓపెన్ సోర్స్ టెక్నాలజీ ని ఉపయోగిస్తున్న తొలి పత్రిక ప్రజాశక్తి కావడం గమనార్హం. ఈ కృషిలో కేరళకు చెందిన ‘దేశాభిమాని’ దినపత్రిక వారి సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇతర సాంకేతిక సహకారాన్ని అందజేసిన ఫెయిర్ కోడ్ టెక్నాలజీస్ వారికీ ధన్యవాదాలు.
ప్రజాశక్తి ఎల్లపుడూ ప్రజల పక్షమే!
కామ్రేడ్ ఎం.హెచ్ ప్రజాశక్తి దినపత్రిక సంపాదక బాధ్యతలు స్వీకరించిన నేపథ్యానికి నేటికీ సారూప్యత చాలా ఉంది. ఆనాడు రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో చాలా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కావాలని రాష్ట్ర వ్యాప్తంగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఖిలపక్ష ఉద్యమం సాగింది. పోలీసు దమనకాండలో గుర్రం గోవిందు అన్న డి వై ఎఫ్ ఐ కార్యకర్త అసువులు బాశారు. పాలకులు ఉద్యమాన్ని అణచివేద్దామనుకుంటే అది మరింత భగ్గుమంది. చివరికి రైతు ఉద్యమ కోర్కెలను ఆమోదిస్తూ సర్కారు జీవోలను జారీ చేసింది. ఆ ఉద్యమాన్ని బలపరుస్తూ ప్రజాశక్తి కథనాలు ప్రత్యేక వ్యాసాలు అనేకం ప్రచురించింది. ఇప్పుడు రాష్ట్రంలో అటు ధాన్యం మొదలు మొక్కజొన్న వంటి ఆహార పంటలే గాక వర్జీనియా పొగాకు వంటి వ్యాపార పంటలకూ ధరలు దిగజారిపోయాయి. రైతుకు గిట్టుబాటు ధర సంగతి అటుంచి ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధరలు కూడా దక్కడం లేదు. రైతును ఆదుకోవలసిన ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాసి చేతులు దులుపుకొంటోంది. ఆయా పంటలవారీగా రైతులు సంఘటితమై ఆందోళనలు, ఉద్యమాలు సాగిస్తున్నారు. వాటిని నిత్యం ప్రజాశక్తి ప్రముఖంగా ప్రచురిస్తోంది. వ్యవసాయాన్ని కార్పొరేట్ పరం చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ లో నిరంతరాయంగా సాగిన ఉద్యమ ఘట్టాలు, వార్తలను ఒక్క రోజు కూడా మిస్ కాకుండా ప్రచురించిన ఏకైక తెలుగు దినపత్రిక ప్రజాశక్తి. కామ్రేడ్ ఎంహెచ్ చూపిన బాట లోనే కొనసాగుతోంది. 1982 జనవరి 19న తొలి అఖిల భారత సార్వత్రిక సమ్మె ప్రాధాన్యతను మొదలు ఇటీవల నోయిడా కార్మికుల ఆందోళనల వరకూ ప్రజాశక్తి శ్రమజీవుల పక్షమే వహిస్తోంది. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి దాన్ని ప్రతిఘటిస్తూ సాగిన ఉద్యమానికి ప్రజాశక్తి నిరంతరం వెన్నుదన్నుగా నిలిచింది. విద్యార్థి, యువజన, మహిళా ఉద్యమాలకూ అండగా నిలుస్తోంది.
పదవులకన్నా ప్రజాసేవ మిన్న
నేటి రాజకీయ నాయకులనేకులు తమ పదవులను కాపాడుకోవడానికి సకల విధాలా దిగజారుడుకు సిద్ధమవుతున్న పరిస్థితి చూస్తున్నాం. తమ అధికారాన్ని అడ్డుదారి తొక్కైనా నిలబెట్టుకోవాలన్న కమలనాథుల దుర్విధానాలు జగమెరిగినవే! రెండు గంటలు మాట్లాడి వారిని పార్టీ ఫిరాయింపజేస్తానని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్న రోజులివి. అటువంటిది కామ్రేడ్ ఎంహెచ్ పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదు. వాటికీ అయన వన్నె తెచ్చారు తప్ప హంగుకో స్వార్ధనికో వాడుకున్నది లేదు. చట్ట సభల్లో పదవులు నిర్వహించడం కన్నా పార్టీ పనిలో పీడిత ప్రజల సేవలో ఉండాలనే ఆయన చివరివరకూ పరితపించారు. 1994 మార్చి పదవ తేదీన ఆయన రాజ్య సభ సభ్యునిగా రిటైర్ అయిన సందర్భంలో చేసిన వీడ్కోలు ప్రసంగం ఎంతో స్స్ఫూర్తిదాయకమైనది. ఆ ప్రసంగంలో చివరి వాక్యాలివీ:
'మీరందించిన వీడ్కోలుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ అందరి నుండి వెళ్లిపోవడం నాకు విచారకరంగానే వున్నది. అదే సమయంలో ఆనందంగా ఉన్నది. ఈ బాధ్యత వదలడం వల్ల నా పార్టీకి, ప్రజలకు, మరీ ముఖ్యంగా పీడిత ప్రజలకు మరింత ఎక్కువగా సేవ చేస్తూ జీవితశేషాన్ని గడపగలనని సంతోషిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను' (‘నా గమ్యం’ పేజీ 136)
జోహార్ కామ్రేడ్ ఎంహెచ్ !








కామెంట్‌లు (0)