నైరుతి రుతు పవనాలు జూన్ 4న కేరళంలోకి ప్రవేశించి 6న రాయలసీమను తాకాయని వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. నాలుగైదు రోజుల్లో అన్ని జిల్లాలకూ విస్తరిస్తాయని తెలిపింది. సోమవారం మృగశిర కార్తె కూడా రావడంతో రైతులు ఏరువాకకు సిద్ధమవుతున్నారు. కాగా ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదవుతుందని ఐ.ఎం.డి. అంచనా వేసింది. ఎల్‌నినో రాష్ట్రంపై ప్రభావం చూపుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో వెల్లడించి అందుకు తగ్గ ప్రణాళికలతో సన్నద్ధం కావాలని ఆదేశించారు. రాష్ట్రంలో అత్యధికంగా వ్యవసాయం సాగేది ఖరీఫ్‌లోనే. నిరుడు పంటల సరళిలో మార్పులు చోటు చేసుకున్నప్పటికీ మొత్తంగా విస్తీర్ణ పరంగా సాధారణ సాగు నమోదైంది. అయితే వర్షాభావం, అకాల, భారీ వర్షాలు, తుపాన్లతో పంట నష్టాలు సంభవించి అన్నదాతలను ఆర్థికంగా నష్టపరిచాయి. కీలక సమయంలో వర్షాల్లేక కొన్ని ప్రాంతాల్లో పంటల నష్టం వాటిల్లింది. ఖరీఫ్‌లో డ్రైస్సెల్ వందల మండలాలల్లో తిష్ట వేసినా ప్రభుత్వం కేవలం 37 మండలాల్లోనే కరువును గుర్తించింది. రబీలో దుర్భిక్ష పరిస్థితులు విస్తరించగా 51 మండలాల్లో కరువును ప్రకటించి చేతులు దులుపుకుంది. ప్రకటించిన మండలాల్లో కూడా రైతులకు ఎలాంటి ప్రత్యేక సహాయమూ చేయలేదు. ఇంకో వైపు ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో రైతులకు ఏ పంటకూ ధర రాక, ధర ఇప్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టక రైతులు నష్టాల పాలయ్యారు.
సేద్యానికి రైతులకు అత్యవసరంగా కావాల్సినవి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, పెట్టుబడులు. రైతులకు అవసరమైన మొత్తం విత్తనాల్లో ప్రభుత్వం రాయితీపై అందించేవి 30 శాతమే. అవీ కొన్ని పంటలకే పరిమితం. వేరుశనగ విత్తనాల పంపిణీ ఏర్పాట్లు ఆలస్యమయ్యాయి. వరి, కందులు, ఇతర అపరాలూ అంతే. పచ్చిరొట్ట పంట విత్తనాలిస్తున్నామంటున్నా బహిరంగ మార్కెట్ ధరలే రాయితీ విత్తనాలకూ నిర్ణయించారు. రాయితీ విత్తనాల పంపిణీ యావత్తూ అదే తీరు. సీజన్ ప్రారంభానికి ముందు నుంచీ కేంద్రం ఆదేశాలతో యూరియా, డిఎపి వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్‌లని, కార్డులని, పైలెట్ ప్రాజెక్టులని ప్రహసనం లేవనెత్తి రైతుల్లో, ముఖ్యంగా కౌలు రైతుల్లో గుబులు రేపింది. నిరుడు ప్రభుత్వ ముందుచూపు లేక యూరియా దొరక్క రైతులు ఇబ్బంది పడగా, ఆ పరిస్థితులే ఈ తడవా ఎదురవుతాయని రైతులు మధన పడుతున్నారు. నకిలీ, కల్తీ, అనుమతుల్లేని పత్తి విత్తనాల బెడద ఉండనే ఉంది. కేంద్రం పెంచిన డీజిల్, పెట్రోలు ధరలు, ఎరువుల ధరలు రైతాంగాన్ని కుంగదీస్తున్నాయి.
తొలకరి సంకేతాలతో రైతన్నలు సాగుకు సిద్ధమయ్యేందుకు కావాల్సిన పెట్టుబడులు సమకూర్చడంపై ప్రభుత్వంలో నెలకొన్న స్తబ్దు ఆందోళన కలిగిస్తుంది. పిఎం కిసాన్తో అన్నదాతా సుఖీభవ కలపడంతో సాయం కోసం నిరీక్షణే. అదీ సొంత భూమి కలిగిన వారికే. పిఎం కిసాన్‌లో కోతలు లక్షల మందికి పిసరంత సాయాన్నీ దక్కనీయట్లేదు. కౌలు రైతులకు రెండేళ్లల్లో ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఈసారైనా ఇస్తారో లేదో తెలీదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డుల ఊసే లేదు. నిరుడు అక్టోబర్‌లో మొంథా తుపాన్ రాగా నేటికీ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. పంటల బీమా సొమ్ము లేదు. కరువు మండలాల్లో రైతులకు పరిహారం లేదు. రెండేళ్లల్లో రైతులకు సున్నా వడ్డీ రూపాయి కూడా విడుదల చేయలేదు. వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలు పుస్తకాల వరకే. ఈ పరిస్థితుల్లో అన్నదాతలకు పెట్టుబడులెలా సమకూరతాయి? ప్రైవేటు వడ్డీ వ్యాపారులే దిక్కవుతున్నారు. ప్రాజెక్టుల కింద నీటి విడుదలకు షెడ్యూల్ ఇచ్చినా ఎల్‌నినో, వర్షాభావాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఖరీఫ్ అనేది ఒక్క రైతులకే కాదు వ్యవసాయ రాష్ట్రం ఎ.పి.కి వెన్నెముక. సేద్యం సజావుగా సాగాలంటే రైతుల అవసరాలన్నింటినీ తీర్చేందుకు ప్రభుత్వంలో చిత్తశుద్ధి, ముందుచూపు, సన్నద్ధత అవసరం.
ఖరీఫ్ సన్నద్ధత
09 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 09, 2026, 06:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం








కామెంట్లు (0)