బుధవారం, 05 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకమలానికి శరాఘాతం

20 గంటల క్రితం

prasanth
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 05:53 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

తాజా ఉప ఎన్నికల ఫలితాలు బిజెపి, సంఘ్‌‌పరివార్‌‌ రాజకీయాలకు శరాఘాతం. ఢిల్లీలోని జంతర్‌‌మంతర్‌‌తోపాటు పలు రాష్ట్రాల్లో విద్యార్థి, యువజన ఉద్యమాన్ని కర్కశంగా అణచివేసేందుకు చేసిన ప్రయత్నాలకు దేశమంతటా యువత, మధ్యతరగతిలో పెల్లుబికిన ఆగ్రహజ్వాలకు ప్రతిబింబం. అయోధ్య రామమందిరం పేరుతో మతపరమైన మనోభావాలను ఓటుబ్యాంకుగా ఉపయోగించుకున్న బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌‌లు ... ఇప్పుడు అవే విశ్వాసాలను తుంగలో తొక్కుతూ కోట్లాది రూపాయలు కైంకర్యం చేయడంలో తోడుదొంగలు కావడం విశ్వాస ఘాతుకమే. ప్రలోభాలు, కేంద్ర సంస్థలతో బెదిరింపులకు పాల్పడి ప్రతిపక్ష పార్టీలను నిస్సిగ్గుగా చీల్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న నిరంకుశ ధోరణికి చరమగీతం పాడాలన్నట్టుగా పెల్లుబికిన ఆగ్రహమే బంకీపూర్‌ కంచుకోటను బద్దలు చేసింది. బీహార్‌‌లోని బంకీపూర్‌‌తోపాటు మధ్యప్రదేశ్‌‌లోని దతియాలో సైతం ఓటమి పాలు కావడం, గుజరాత్‌‌లోని మంజల్‌‌పుర్‌ ‌నియోజకవర్గంలోని భారీగా మెజారిటీ తగ్గడం ప్రజల్లో, ముఖ్యంగా మధ్యతరగతి, యువత ఆలోచనల్లో వస్తున్న మార్పునకు ప్రతీక. విద్యార్థి యువజన ఉద్యమంతో దెబ్బతిన్న మోడీ - షా ద్వయానికి ఈ ఉప ఎన్నిక ఫలితం మరో దెబ్బ.

​సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలుస్తుంది. ప్రజా వ్యతిరేకత అధికంగా ఉన్న సందర్భాల్లోనే ప్రతిపక్షాలు గెలుస్తూ ఉంటాయి. బిజెపి, సంఘ్‌‌పరివార్‌‌కు తిరుగులేని పట్టుందని భావిస్తున్న హిందీ ప్రాంతంలో, బిజెపి ప్రభుత్వాలు అధికారంలో ఉన్న బీహార్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌‌లో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. బిజెపి వరుసగా తొమ్మిదిసార్లు నెగ్గి, 59 శాతానికి తగ్గకుండా ఓట్లు తెచ్చుకున్న నియోజకవర్గం, స్వయంగా తానే ఐదుసార్లు గెలిచిన నియోజకవర్గంలోనూ పార్టీ ఓటమిని జాతీయ అధ్యక్షుడు నితిన్‌ ‌నబీన్‌ అడ్డుకోలేకపోయారంటే ప్రజావ్యతిరేకత ఎంతగా పెల్లుబికిందో అర్థం చేసుకోవాలి. ఏడాది క్రితం నితిన్‌ నబీన్‌ 62 శాతం ఓట్లు తెచ్చుకోగా, ఇప్పుడు 34 శాతానికి పడిపోయింది. బిజెపికి బాగా పట్టున్న పట్టణ ప్రాంతంలోని ఈ నియోజకవర్గంలో 25 శాతం ఓటింగ్‌ కోల్పోవడం ఇన్నాళ్లూ తనకు అండగా నిలిచిన ఓటర్లలో గూడుకట్టుకున్న అసంతృప్తే కారణం. జన్‌ సురాజ్‌ ‌పార్టీ తరపున ఆ పార్టీ అధినేత ప్రశాంత్‌ ‌కిషోర్‌ ‌పోటీ చేసి, 19 వేలకు పైగా మెజారిటీతో బంకీపూర్‌ ‌స్థానాన్ని కైవసం చేసుకోవడం సంచలనమైంది. 40 మంది స్టార్‌ ‌క్యాంపెయినర్లను, వేలమంది కార్యకర్తలను దింపినా ఫలితం ఇంత ఘోరంగా అఘోరించడం బిజెపి పట్ల ప్రజావ్యతిరేకతను తెలిపేదే. బీహార్‌ ‌సిఎంగా సామ్రాట్‌ చౌదరి నియామకం, అభ్యర్థిని మార్పు చేయడం, పార్టీ స్థానిక నేతల్లో విభేదాలు కారణాలంటూ ఫలితాన్ని తక్కువ చేయడానికి ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు చెల్లుబాటయ్యేవి కాదు. ఈ నియోజకవర్గ పరిధిలో పాట్నా యూనివర్సిటీ, పలు కళాశాలలు, కోచింగ్‌ ‌సెంటర్లు ఉండటం... యువత ఆగ్రహం కూడా ఫలితాన్ని శాసించింది. మధ్యప్రదేశ్‌‌లోని దతియా నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ‌తన సీటును నిలబెట్టుకోవడానికి ప్రజల్లో బిజెపి పట్ల వ్యతిరేకతే కారణమైంది. మత విభజన, మైనారిటీలపై విద్వేషం తప్ప విద్య, ఉద్యోగాలు, ఉపాధి వంటి అంశాల జోలికే వెళ్లని డబుల్‌ ఇంజన్‌ ‌సర్కార్ల రాజకీయాలపై ఈ ఫలితాలు ప్రజాగ్రహ జ్వాల.

ప్రజల అసంతృప్తి వ్యతిరేక ఓటుగా మారితే సాంప్రదాయంగా ఎంతటి బలమైన నియోజకవర్గాలైనా ఓటమి తప్పదనేందుకు ఈ ఫలితాలే నిదర్శనం. యువత, విద్యార్థుల ఉద్యమంపై మేకులతో ఉన్న లాఠీలతో చి‌తకబాదడం, పెల్లెట్‌ ‌గన్‌‌లు, భాష్పవాయు ప్రయోగం వంటి దుర్మార్గమైన వైఖరి క్షేత్రస్థాయిలో రాజకీయాలను తలకిందులు చేస్తుందనడానికి ప్రతిబింబం. ఇన్నాళ్లూ ప్రధాని మోడీ బలమైన నాయకుడంటూ గోడీ మీడియా, సంఘ్‌‌పరివార్‌ సృష్టించిన భ్రమలు పటాపంచలవుతున్నాయి. భౌతిక సమస్యలు ముందుకొచ్చినప్పుడు భావోద్వేగ, మతపరమైన అంశాలపై పైచేయి సాధిస్తాయనడానికి సూచన. నిరంకుశత్వం కాదు జవాబుదారీతనం కోరుకుంటున్నామన్న ప్రజల సందేశం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్