బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionదేశ ప్రజలకు ద్రోహం

1 గంట క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 05:51 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

దేశభక్తి పేరుతో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు లక్ష‍ల కోట్ల రూపాయలను దోచిపెట్టడం దేశ ప్రజలకు ద్రోహం చేయడమే. నిరుపేదలకు, వెనుకబడిన వర్గాలకు సబ్సిడీలిచ్చినా, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు అండగా ఉండేందుకు రుణ మాఫీ చేసినా ‘రేవడీ కల్చర్‌’ అంటూ విరుచుకుపడే ప్రధానమంత్రి, తీవ్ర విమర్శలు చేసే కార్పొరేట్‌ మీడియా, నయా ఉదారవాద సమర్ధకులు ఈ నిర్వాకంపై నోరుమెదపకపోవడం గమనార్హం. తాజాగా ఎస్సెల్‌ గ్రూప్‌, జీ టివి వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర గోయెంకా వ్యవహారం ముందుకు రావడంతో ఎన్‌డిఎ సర్కారు నిర్వాకం ప్రపంచం ముందు మరోసారి చర్చనీయాంశమైంది. ఎస్సెల్‌ గ్రూప్‌నకు చెందిన వివిధ సంస్థలు తీసుకున్న రూ.22,006.57 కోట్ల రుణాలకు ఆయన పర్సనల్‌ గ్యారెంటీ ఇవ్వగా, అవి ఎగవేశాయి. రుణాలు తీసుకునే ముందు తన ఆస్తులను రూ.40 వేల కోట్లుగా చూపి, ఇచ్చిన వ్యక్తిగత హామీల ఆధారంగా ఇన్‌సాల్వెన్సీ ప్రొసీడింగ్స్‌ ముందుకొచ్చాయి. తన వద్ద రూ.31 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నాయని, రూ.6.25 కోట్లు చెల్లించగలనని, ఇన్‌ సాల్వెన్సీ ప్రక్రియ ఖర్చులకు మరో రూ.25 లక్ష‍లు చెల్లిస్తానని సుభాష్‌ చంద్ర తన రుణ ప్రణాళికను సమర్పించాడు. రూ.40 వేల కోట్లు రూ.31 కోట్లకు ఎందుకు తరిగిపోయాయో ఏలిన వారికే ఎరుక. అంటే రుణదాతలకు తిరిగి 0.03 శాతమే చెల్లించగలనన్న ఆయన ప్రతిపాదనకు ఉదారంగా మద్దతిచ్చిన 81 శాతం రుణాలున్న కంపెనీలన్నీ సుభాష్‌ చంద్ర బంధువులు, మిత్రులవే. అంటే రుణం తీసుకునేటప్పుడే ఎగ్గొట్టేందుకు ప్రణాళికలు వేసుకుంటున్న కార్పొరేట్‌ రాబందుల భవిష్యత్‌ వ్యూహం సామాన్యులను ఆశ్చర్యపరిచేదే. 99.97 శాతం హెయిర్‌కట్‌ చేసేందుకు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సిఎల్‌టి) ఇటీవల ఆమోదం తెలపడాన్ని ఎల్‌ఐసితోపాటు ప్రభుత్వరంగ బ్యాంకులు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ తీర్పుపై వస్తున్న తీవ్ర విమర్శల నేపథ్యంలో తాజాగా ఏర్పడిన ఐదుగురు సభ్యుల బెంచ్‌ ఈ ప్రొసీడింగ్స్‌పై స్టే ఇచ్చింది.

ప్రతిపక్ష‍ పార్టీలకు మద్దతిచ్చే బడా కార్పొరేట్లు, ధనికులపై దాడులు చేసే ఇడి, ఐటి, సిబిఐలు ఎస్సెల్‌ గ్రూపు వైపే చూడకపోగా, ఎన్‌సిఎల్‌టి లాంటి కేంద్ర సంస్థలు అత్యంత ఆప్యాయతను ఎందుకు చూపిస్తున్నాయో పరిశీలిస్తే... అసలు నిజాలు వెలుగు చూస్తాయి. సుభాష్‌ చంద్ర నడిపిన జీ టివి బిజెపికి నిస్సిగ్గుగా కొమ్ముకాయడం, ఆయన గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఆ పార్టీకి సేవచేయడం తెరముందుకు వస్తాయి. జెఎన్‌యులో విద్యార్థులు పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలిచ్చారంటూ 2016లో జీ టివి ఢిల్లీ పెద్దల కోసం బరితెగించి ప్రసారం చేసిన తప్పుడు వీడియో, దీని ఆధారంగా కన్నయ్యకుమార్‌ సహా పలువురిపై దేశద్రోహం కేసులు గుర్తుకు వచ్చేవే. 2022 జులైలో ఉదయ్‌పూర్‌లో టైలర్‌ను కొందరు అతి దారుణంగా హత్య చేశారు. కేరళలో మరో వివాదానికి సంబంధించి ‘పిల్లలు.. వారిని విడిచిపెట్టండి’ అంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను జత చేసి, ఆయన స్పందనగా ప్రసారం చేసింది. ఈ ఘటనపై తీవ్ర వ్యతిరేకత రావడంతో యాంకర్‌ను తొలగించి చేతులు దులుపుకుంది. ఇలాంటి తప్పుడు ప్రసారాలెన్నో. ఇందుకు నజరానాగా అప్పట్లో హర్యానా నుంచి రాజ్యసభ సభ్యత్వాన్ని కమలం పార్టీ కట్టబెట్టిన చరిత్ర మన కళ్లముందుంది. తాజా హెయిర్‌కట్‌ కూడా అందులో భాగమే.

ఇదొక్కటే కాదు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2023-24 వరకూ రూ.16.35 లక్ష‍ల కోట్లు రైట్‌ ఆఫ్‌లు జరిగాయి. రైతులకు, సామాన్యులకు రుణాలను రద్దు చేస్తే మాఫీ, పేదలను ఆదుకోవడానికి సహాయం చేస్తే రేవడీ కల్చర్‌, ఫ్రీ బీస్‌, ఉచితాలు అంటూ ఎద్దేవా చేసే వారికి కార్పొరేట్లకు ఇచ్చే రైట్‌ ఆఫ్‌లు, హెయిర్‌ కట్‌లపై నోరు పెగలదు. వంద కోట్ల రూపాయలకు పైగా రుణాలు తీసుకున్న పెద్దలు 14.5 శాతమే చెల్లిస్తున్నారనేది ఆర్‌టిఐ ద్వారా వెలుగుచూసిన నిజం. కోటి రూపాయల లోపు రుణాలు తీసుకున్న సామాన్య, మధ్యతరగతి వారు చెల్లిస్తున్నది 74 శాతం పైనే. ఎవరైనా అప్పుల ఊబిలో కూరుకుపోతే ఆస్తులను వేలం వేసి, వాహనాలను సీజ్‌ చేసి, దుర్భాషలాడటం సహా... హడావిడి చేయడంతో ఆత్మహత్య చేసుకుంటున్న కుటుంబాలెన్నో. అధికార పార్టీ అంటకాగుతున్న పెద్దల వద్ద పేరుకుపోయిన బకాయిలను వసూలు చేయకుండా బ్యాంకులు చేతులు కట్టేస్తున్నది ఏలినవారేనన్నది జగద్విదితమే.

వీడియో కాన్‌ ఐబిసికి 95.85 శాతం, జెట్‌ ఎయిర్‌ వేస్‌కు 92.33 శాతం హెయిర్‌ కట్‌కు అనుమతించి, అనిల్‌ అంబానీ రూ.47 వేల కోట్లకు రూ.455 కోట్లు, అదానీ గ్రూప్‌ రూ.61,832 కోట్లకు రూ.15,977 కోట్లు చెల్లిస్తే... ఆమోదించింది కమలం పార్టీ సర్కారు ఏలుబడిలోనే. ఈ నిర్వాకాల వల్ల నిండా మునిగేది ప్రత్యక్ష‍, పరోక్ష‍ పన్నులు చెల్లించే, బ్యాంకుల్లో పొదుపు చేసే, రుణాలు తీసుకునే, జిఎస్‌టి చెల్లించే మధ్యతరగతి, సాధారణ ప్రజానీకంతో పాటు 14 నుంచి 16 గంటలు పనిచేస్తూ దోపిడీకి గురయ్యే శ్రమజీవులే. ప్రజాధనాన్ని లూటీ చేసే కార్పొరేట్‌, పాలకుల బంధాన్ని తిప్పికొట్టాల్సిందీ వారే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్