గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఐఐటిల్లో అసహజ మరణాలు

18 గంటల క్రితం

sahil wakode suicide IITB.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 11:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • పదేళ్లలో 120 ఆత్మహత్యలు, బలవన్మరణాలు

  • ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులపై అధిక ప్రభావం.. వెలుగులోకి వస్తున్న అసమానతలు

ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటిల్లో విద్యార్థుల మరణాలు ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయి. 2006 నుంచి 2026 సెప్టెంబరు వరకు 20 ఏళ్ల కాలంలో దేశంలోని వివిధ ఐఐటిల్లో 171 మంది విద్యార్థులు ఆత్మహత్యలు లేదా అసహజ కారణాలతో మరణించినట్లు ఓ డేటా విశ్లేషణ వెల్లడించింది. ఇందులో గత పదేళ్లలోనే 120 మంది మరణించగా, 2006-2015 మధ్య 51 మంది మరణించారు. అంటే గుర్తించిన మొత్తం మరణాల్లో సుమారు 70 శాతం 2016 తరువాతే నమోదయ్యాయి. ఈ వివరాలను ఐఐటి కాన్పూర్‌ పూర్వ విద్యార్థి, గ్లోబల్ ఐఐటి అలుమ్ని సపోర్ట్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు ధీరజ్‌ సింగ్‌ ఆర్‌టిఐ సమాధానాలు, మీడియా కథనాల ఆధారంగా సేకరించారు. విద్యార్థుల సంఖ్య పెరగడాన్ని మాత్రమే కారణంగా చూపలేనంతగా మరణాల సంఖ్య పెరిగిందని ఆయన విశ్లేషణ పేర్కొంది.

క్యాంపస్‌లోనే 82 శాతం

ఆత్మహత్యలుగా నమోదైన ఘటనల్లో సుమారు 82 శాతం ఐఐటి క్యాంపస్‌లలోనే చోటుచేసుకున్నాయి. పరీక్షలు, ఫలితాల ప్రకటన సమయాల్లో మరణాల సంఖ్య పెరగడం, సెమిస్టర్‌ సెలవుల్లో తగ్గడం వంటి నమూనాలు కూడా డేటా విశ్లేషణలో కనిపించాయని ధీరజ్‌ సింగ్‌ పేర్కొన్నారు. మొత్తం ఆత్మహత్యల్లో సుమారు 70 శాతం మంది ఉరివేసుకున్నట్లు విశ్లేషణలో వెల్లడైంది. ఈ పరిస్థితులు విద్యార్థులపై విద్యాపరమైన ఒత్తిడి, సంస్థాగత వాతావరణం, సామాజిక వివక్ష, ఆర్థిక ఇబ్బందులు తదితర అంశాలపై మరింత లోతైన పరిశీలన అవసరాన్ని సూచిస్తున్నాయి. సుప్రీంకోర్టు నియమించిన జాతీయ టాస్క్‌ఫోర్స్‌ కూడా విద్యార్థుల ఆత్మహత్యలకు విద్యాపరమైన ఒత్తిడి, కుల వివక్ష, ఆర్థిక ఒత్తిడి, లైంగిక వేధింపులు, పరీక్షల్లో వైఫల్యం తదితర అనేక కారణాలు దోహదం చేస్తున్నాయని తన మధ్యంతర నివేదికలో పేర్కొంది.

ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులపై అధిక ప్రభావం

డేటాసెట్‌లో సామాజిక వర్గాల వారీగా కూడా వ్యత్యాసాలు కనిపించాయని విశ్లేషణ పేర్కొంది. ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థుల ఆత్మహత్య మరణాల రేటు జనరల్‌ కేటగిరీ విద్యార్థులతో పోలిస్తే సుమారు రెండింతలుగా ఉన్నట్లు ధీరజ్‌ సింగ్‌ అంచనా వేశారు. ఆత్మహత్యకు పాల్పడిన ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థుల సగటు వయసు కూడా జనరల్‌, ఒబిసి విద్యార్థుల కంటే తక్కువగా ఉన్నట్లు విశ్లేషణలో పేర్కొన్నారు. కోవిడ్‌ అనంతర కాలంలో ఈ వ్యత్యాసం మరింత పెరిగినట్లు డేటా విశ్లేషణ చెబుతోంది. ఎస్‌సి విద్యార్థుల్లో ఆత్మహత్య మరణాల రేటు జనరల్‌ కేటగిరీతో పోలిస్తే 2.6 రెట్లు, ఎస్‌టి విద్యార్థుల్లో 4.2 రెట్లు ఉన్నట్లు అంచనా వేశారు.

మానసిక ఆరోగ్య వ్యవస్థలపై ప్రశ్నలు

విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి సంబంధించి ఐఐటిల్లో అందుబాటులో ఉన్న వ్యవస్థలపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుప్రీంకోర్టు నియమించిన జాతీయ టాస్క్‌ఫోర్స్‌ 31 కేంద్ర నిధులతో నడిచే విద్యాసంస్థల నుంచి సేకరించిన సమాచారాన్ని పరిశీలించింది. ఇందులో 23 ఐఐటిలు ఉన్నాయి. అధ్యాపకులు విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే విషయంలో తగిన శిక్షణ పొందలేదని టాస్క్‌ఫోర్స్‌ గుర్తించింది. అధ్యాపకులలో సుమారు 90 శాతం మందికి ఇలాంటి సమస్యలపై విద్యార్థులకు మద్దతు అందించే సరైన శిక్షణ లేదని నివేదిక పేర్కొంది. వివిధ ఐఐటిల్లో కౌన్సెలింగ్‌, పీర్‌ సపోర్ట్‌, వెల్‌నెస్‌ కార్యక్రమాలు అమలులో ఉన్నప్పటికీ, వాటి పరిధి, నాణ్యత, అందుబాటు విషయంలో వ్యత్యాసాలు ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్‌ గుర్తించింది. ఇటీవల ఐఐటి ముంబయిలో విద్యార్థి మరణం అనంతరం క్యాంపస్‌లో విద్యార్థులు సంక్షేమ వ్యవస్థలను బలోపేతం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు చేపట్టారు. ఐఐటి ఢిల్లీలో విద్యార్థి మరణంపై బాహ్య విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దేశంలోని అత్యున్నత సాంకేతిక విద్యాసంస్థల్లో విద్యార్థుల సంక్షేమం, మానసిక ఆరోగ్యం, వివక్ష నివారణ, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం మరోసారి ముందుకొచ్చింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్