ఎఫ్‌టిటిడిసి ఛైర్మన్ భరత్ భూషణ్
గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన నంది అవార్డులను త్వరలో ప్రదానం చేయనున్నట్లు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అవార్డులకు సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ భరత్ భూషణ్ వెల్లడించారు. 2012-2016 మధ్య అవార్డులు ప్రకటించినా వేడుక నిర్వహించలేదని, ఈ కాలానికి చిత్ర పరిశ్రమలో 288 అవార్డులు, 51 జ్యూరీ అవార్డులు, టెలివిజన్ రంగంలో 330 అవార్డులు, 54 జ్యూరీ అవార్డులు అందజేయాల్సి ఉందని తెలిపారు. 2017-2024 మధ్య విడుదలైన చిత్రాలకు ఏటా నాలుగు అవార్డుల చొప్పున ఉత్తమ చిత్రం, ఉత్తమ ద్వితీయ చిత్రం, రెండు స్పెషల్ జ్యూరీ అవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. 2025 నుంచి అన్ని విభాగాల్లో అవార్డులు అందజేస్తామని తెలిపారు. తెలంగాణ గద్దర్ అవార్డు పొందిన సినిమాలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అవార్డుల నగదు ప్రోత్సాహక వివరాలను జీవో ద్వారా వెల్లడిస్తామని చెప్పారు. ఫిల్మ్ నంది అవార్డుల వేడుకను అమరావతిలో, టెలివిజన్ అవార్డుల ప్రదానోత్సవాన్ని తిరుపతిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 12లోగా దరఖాస్తు చేసుకుంటే రెండో వారంలో జ్యూరీ అవార్డులను ప్రకటిస్తామని పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)